మ్యాక్స్‌వెల్‌ ఆటతీరుపై క్లారిటీ ఇచ్చిన రాహుల్‌

KL Rahul Finally Reveals Why KXIP Backed Glenn Maxwell - Sakshi

దుబాయ్‌ : ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ను గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో కింగ్స్‌ పంజాబ్‌  రూ.10.5 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కింగ్స్‌ యాజమాన్యం అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ మ్యాక్స్‌వెల్‌ నుంచి ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మంచి ప్రదర్శన కూడా చూడలేకపోయాం. వరుసగా విఫలమవుతూ వస్తున్న మ్యాక్స్‌వెల్‌ను ఇంకా జట్టులో ఎందుకు ఆడిస్తున్నారంటూ కిం‍గ్స్‌ జట్టును పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. కానీ ఇవేవి పట్టించుకోని కింగ్స్‌ యాజామాన్యం మాక్స్‌వెల్‌ను తుదిజట్టులో ఆడిస్తూనే ఉంది. తాజాగా మాక్స్‌వెల్‌ను జట్టులో ఎందుకు ఆడిస్తున్నామనే దానిపై కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ క్లారీటి ఇచ్చాడు. (చదవండి : పూరన్‌ ఆట అతన్ని గుర్తుకుతెచ్చింది : సచిన్‌)

మ్యాచ్‌ ముగిసిన అనంతరం కేఎల్‌ రాహుల్‌ స్టార్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ...'నిజానికి మ్యాక్స్‌వెల్‌ ప్రాక్టీస్‌ సమయంలో బ్యాటింగ్‌ విషయంలో బాగా కష్టపడుతున్నాడు. మ్యాక్సీ మా జట్టులో ఒక అద్భుతమైన టీం మెంబర్‌గా కనిపిస్తాడు. అతను జట్టులో ఉంటే నాకు ఎందుకో మేము మంచి బ్యాలెన్స్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. జట్టులో 11 మంది సరిగ్గా ఆడడం అనేది ఎప్పటికీ జరగదు. ఫీల్డింగ్‌లోనూ అందరూ తమ వైవిధ్యమైన ఆటతీరును చూపలేరు. కానీ మ్యాచ్‌ విన్నర్లు జట్టుకు చాలా అవసరం. ఇది మాక్స్‌వెల్‌లో పుష్కలంగా ఉంది.. అయితే ఈ సీజన్‌లో అతను విఫలం కావడం నిజమే. కానీ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్సీ చేసిన 32 పరుగులు మా జట్టు విజయంలో మరో కీలకపాత్ర అని చెప్పొచ్చు. నా దృష్టిలో మ్యాక్స్‌వెల్‌ ఫామ్‌లోకి వచ్చాడనే అనుకుంటున్నా. ఒకవేళ అదే నిజమైతే మాత్రం అతని నుంచి ఇకపై మంచి ఇన్నింగ్స్‌లు చూసే అవకాశం ఉంటుంది.' అని రాహుల్‌ చెప్పుకొచ్చాడు.(చదవండి : గేల్‌ రెండు కాళ్లు కట్టేసి బౌలింగ్‌ చేయాలి) 

మంగళవారం ఢిల్లీతో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌ మ్యాక్స్‌వెల్‌తో ఓపెనింగ్‌ బౌలింగ్‌ చేయించడం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే మ్యాక్సీ కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెడుతూ 4ఓవర్లు బౌలింగ్‌ వేసి ఒక వికెట్‌ తీశాడు. ఇక కింగ్స్‌ పంజాబ్‌ బ్యాటింగ్‌ సమయంలోనూ మ్యాక్సీ 24 బంతుల్లో మూడు ఫోర్లతో 32 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో మ్యాక్సీ అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. మ్యాక్స్‌వెల్‌ కొనసాగించడంపై విమర్శలు వస్తున్న వేళ విండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా మాత్రం మ్యాక్సీకి మద్దతుగా నిలిచాడు. మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌పై కింగ్స్‌కు నమ్మకం ఉంది. తన ఆఫ్‌స్పిన్‌ బౌలింగ్‌తో జట్టుకు విజయం సాధించే అవకాశాలు ఉండడంతోనే జట్టులో అతన్ని ఆడిస్తోందని పేర్కొన్నాడు. ఢిల్లీపై విజయంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకిన పంజాబ్‌ తన తర్వాతి మ్యాచ్‌లో అక్టోబర్‌ 24న సన్‌రైజర్స్‌తో తలపడనుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top