
ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఏకంగా 23.75 కోట్లు పెట్టి కొనుకున్న వెంకటేశ్ అయ్యర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయకపోవడంపై కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ వివరణ ఇచ్చాడు. అయ్యర్ ఇంకా పరిణితి సాధించాల్సి ఉందని అన్నాడు. అయ్యర్ కెప్టెన్ మెటీరియలే అయినప్పటికీ.. అత్యున్నత బాధ్యతలు చేపట్టేందుకు అతనికి ఇంకా సమయం ఉందని తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్ కోసం కేకేఆర్ వెంకటేశ్ అయ్యర్‌ను కాదని అజింక్య రహానేను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
రహానేను కేకేఆర్ కేవలం రూ. 1.5 కోట్ల బేస్ ధరకు సొంతం చేసుకుంది. అందులోనూ ఓసారి అమ్ముడుపోకుండా, రెండోసారి వేలానికి వచ్చినప్పుడు దక్కించుకుంది. రహానేను కేకేఆర్ చివరి నిమిషంలో ప్లాన్ చేసుకుంది. అయినా కెప్టెన్సీని కట్టబెట్టింది. రహానే గతంలో ఓసారి కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 2022 సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడాడు.
2024 సీజన్ టైటిల్ విన్నింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిష్క్రమణ తర్వాత కేకేఆర్‌కు కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. తొలుత కెప్టెన్సీ రేసులో వెంకటేశ్ అయ్యర్ పేరు బలంగా వినిపించింది. ఈ విషయంపై అయ్యర్ బహిరంగంగా తన ఇష్టాన్ని వ్యక్తం చేశాడు. అంతిమంగా అయ్యర్‌ను రహానే డిప్యూటీగా (వైస్ కెప్టెన్) ఎంపిక చేశాడు. అయ్యర్.. రహానే అండర్‌లో కెప్టెన్సీ మెళకువలు నేర్చుకోవడంతో పాటు అనుభవం గడిస్తాడని కేకేఆర్ యాజమాన్యం భావిస్తుంది. అయ్యర్‌ను కేకేఆర్ ఫ్యూచర్ కెప్టెన్‌గా అనుకుంటుంది.
మెగా వేలం తర్వాత కేకేఆర్ యాజమాన్యం వెంకటేశ్ అయ్యర్‌ను కెప్టెన్ చేయకపోవడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే రహానేను కెప్టెన్‌గా చేయడంతో కామ్ అయిపోయారు. అయ్యర్ 2021 నుంచి ఫ్రాంచైజీకి నమ్మకస్తుడిగా ఉండటంతో పాటు ఫ్రాంచైజీలో ప్రతి ఒక్కరితో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతను కెప్టెన్ కావడం ఖాయమని అంతా భావించారు. అయితే కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ చివరి నిమిషంలో రహానేను తెరపైకి తెచ్చాడు.
అనుభవం, ఒత్తిడిలో ప్రశాంతంగా వ్యవహరించగలిగే తత్వం రహానే ఎంపికకు ప్రధాన కారణాలని వెంకీ మైసూర్ చెప్పుకొచ్చాడు. జట్టును సమన్వయం చేసుకోవడం, మీడియాను అడ్రెస్ చేయడం, ఆఫ్ ద ఫీల్డ్ సంక్లిష్టతలను మేనేజ్ చేయడం లాంటి ఛాలెంజింగ్ విధులు నిర్వహించాలంటే రహానే లాంటి నాయకుడు తమకు అవసరమని మైసూర్ అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ లాంటి టోర్నీల్లో కెప్టెన్సీ అంటే కేవలం మైదానంలో తీసుకునే నిర్ణయాలు మాత్రమే కాదు, అనుభవంతో వచ్చే చాలా విషయాలు ఉంటాయని తెలిపాడు. అయ్యర్‌కు ఇవన్నీ వంటబట్టేందుకు సమయం పడుతుందని, అంతవరకు అతను రహానే అండర్‌లో ఈ విషయాలన్నీ నేర్చుకుంటాడని చెప్పుకొచ్చాడు.
36 ఏళ్ల రహానే 2008లో లీగ్ ప్రారంభమైనప్పటి నుండి 17 సీజన్లలో వివిధ జట్లకు ప్రాతినిత్యం వహించాడు. 185 ఐపీఎల్ మ్యాచ్‌లు, 195 అంతర్జాతీయ ప్రదర్శనలు, టీమిండియా తరపున, దేశీయ క్రికెట్‌లో ముంబై తరపున, ఐపీఎల్‌లో వివిధ ఫ్రాంచైజీల తరపున కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించడం వంటి అంశాలు కేకేఆర్ కెప్టెన్‌గా ఎంపిక కావడానికి రహానేకు ఉన్న యోగ్యతలని తెలిపాడు. ఆటగాడిగా కూడా రహానే పట్ల మైసూర్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ఐపీఎల్-2025లో అతను చెలరేగుతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment