కింగ్స్‌ పంజాబ్‌ కథ ముగిసె..

Kings Punjab Play Comes To An End In This IPL - Sakshi

అబుదాబి: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో కింగ్స్‌ పంజాబ్‌ కథ ముగిసింది. తాజాగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ పరాజయం చెందడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. తద్వారా ప్లేఆఫ్స్‌ రేసు నుంచి ఔటైన రెండో జట్టుగా పంజాబ్‌ నిలిచింది. సీఎస్‌కేతో మ్యాచ్‌ లో పంజాబ్‌ ముందుగా బ్యాటింగ్‌ చేసి 153 పరుగుల స్కోరునే చేసింది. ఆ లక్ష్యాన్ని ధోని సేన 18.5 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. పంజాబ్‌ కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి పాలుకావడంతో సీజన్‌ను భారంగా ముగించింది. టార్గెట్‌ను ఛేదించే క్రమంలో డుప్లెసిస్‌(48; 34 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు), రుతురాజ్‌ గైక్వాడ్‌(62 నాటౌట్‌;49 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌),,అంబటి రాయుడు(30 నాటౌట్‌; 30 బంతుల్లో 2 ఫోర్లులు రాణించి విజయంలో కీలక పాత్ర పోషించారు. పంజాబ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో సన్‌రైజర్స్‌, రాజస్తాన్‌,కేకేఆర్‌లు బరిలో నిలిచాయి. మంగళవారం ముంబై ఇండియన్స్‌-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగనున్న మ్యాచ్‌ తర్వాత ప్లేఆఫ్స్‌ బెర్తులు ఖరారు కానున్నాయి. ఈ రోజు రాజస్తాన్‌ వర్సెస్‌ కేకేఆర్‌ జట్లలో విజయం సాధించిన జట్టు ప్లేఆఫ్స్‌ రేసులో ఉంటుంది. కానీ లీగ్‌ దశలో చివరి రోజు వరకూ వేచి చూడక తప్పదు.

సీఎస్‌కేతో మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన కింగ్స్‌ పంజాబ్‌ 154 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచిన సీఎస్‌కే తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో పంజాబ్‌ బ్యాటింగ్‌కు దిగింది. పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌లు ఆరంభించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 48 పరుగులు జత చేసిన తర్వాత అగర్వాల్‌(26; 15 బంతుల్లో 5 ఫోర్లు) ఔటయ్యాడు. ఎన్‌గిడి బౌలింగ్‌లో అగర్వాల్‌ బౌల్డ్‌ అయ్యాడు. కాసేపటికి రాహుల్‌(29; 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా పెవిలియన్‌ చేరాడు. ఎన్‌గిడి బౌలింగ్‌లోనే రాహుల్‌ క్లీన్‌బౌల్డ్‌గా నిష్క్రమించాడు. ఇక క్రిస్‌ గేల్‌(12), పూరన్‌(2), మన్‌దీప్‌ సింగ్‌(14), నీషమ్‌(2)లు నిరాశపరచడంతో పంజాబ్‌ కష్టాల్లో పడింది. కానీ దీపక్‌ హుడా(62 నాటౌట్‌; 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) బ్యాట్‌ ఝుళిపించడంతో కింగ్స్‌ పంజాబ్‌ తేరుకుంది. సీఎస్‌కే బౌలర్లలో ఎన్‌గిడి మూడు వికెట్లు సాధించగా, తాహీర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జడేజాలు తలో వికెట్‌ సాధించారు. సీఎస్‌కే ఆరు విజయాలతో టోర్నీ నుంచి ముగించింది. ఇది సీఎస్‌కేకు వరుసగా మూడో విజయం కావడం విశేషం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top