ఒత్తిడిలో వార్నర్‌ సేన చిత్తు.. పంజాబ్‌ భళా

Kings Punjab Beat SRH By 12 Runs - Sakshi

దుబాయ్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో చతికిలబడిన సన్‌రైజర్స్‌ ఓటమి పాలైంది. కింగ్స్‌ పంజాబ్‌ 126 పరుగుల స్కోరును కాపాడుకుని భళా అనిపించింది. చివరి మూడు ఓవర్లలో 20 పరుగులు చేస్తే విజయం సాధించే దశలో ఆరెంజ్‌ ఆర్మీ తేలిపోయింది. అర్షదీప్‌ సింగ్‌ వేసిన 18 ఓవర్‌ ఐదో బంతికి విజయ్‌ శంకర్‌(26; 27 బంతుల్లో 4 ఫోర్లు) ఔట్‌ కావడంతో సన్‌రైజర్స్‌పై ఒత్తిడి పెరిగింది. జోర్డాన్‌ వేసిన 19 ఓవర్‌ మూడో బంతికి హోల్డర్‌(5) ఔట్‌ కాగా, ఆ మరుసటి బంతికి రషీద్‌ ఖాన్‌ డకౌట్‌ అయ్యాడు. దాంతో ఆరు బంతుల్లో 14 పరుగులు అవసరమయ్యాయి.

ఆ తరుణంలో ‌ చివరి ఓవర్‌ వేసిన అర్షదీప్ పరుగు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. దాంతో కింగ్స్‌ పంజాబ్‌ విజయం సాధించగా, సన్‌రైజర్స్‌ ఓటమి పాలైంది. కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌, జోర్డాన్‌లు తలో మూడు వికెట్లు సాధించగా,  మహ్మద్‌ షమీ, మురుగన్‌ అశ్విన్‌, రవి బిష్నోయ్‌లకు వికెట్‌ చొప్పున లభించింది. ఇది కింగ్స్‌ పంజాబ్‌కు ఐదో విజయం కాగా, సన్‌రైజర్స్‌కు ఏడో ఓటమి. ఇది కింగ్స్‌ పంజాబ్‌కు వరుసగా నాల్గో విజయం కావడం విశేషం. తాజా విజయంతో కింగ్స్‌ పంజాబ్‌ ప్లే ఆఫ్‌ ఆశలను సజీవంగా ఉంచుకోగా, హైదరాబాద్‌ పరిస్థితి క్లిష్టంగా మారింది.(100 బాల్స్‌.. 102 రన్స్‌.. నో సిక్సర్స్‌)

మనీష్‌ ఔటే టర్నింగ్‌ పాయింట్‌
మనీష్‌ పాండే ఔట్‌ అయ్యే సమయానికి సన్‌రైజర్స్‌కు 27 పరుగులు అవసరం . క్రిస్‌ జోర్డాన్‌ వేసిన 17 ఓవర్‌ తొలి బంతిని వైడ్‌ వేయగా అక్కడ పరుగు వచ్చింది. ఆ తర్వాత అదే బంతికి మనీష్‌ పాండే భారీ షాట్‌ ఆడాడు. అది సిక్స్‌గా మారే చివరి నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ సుచిత్‌ పరుగెత్తుకుంటూ వచ్చి ఒక్క జంప్‌తో దాన్ని క్యాచ్‌ తీసుకున్నాడు. బౌండరీ లైన్‌ చాలా సమీపంగా వెళ్లిన సుచిత్‌ క్యాచ్‌ పట్టిన తీరు శభాష్‌ అనిపించింది. అక్కడే మ్యాచ్‌ టర్న్‌ అయిపోయింది.  ఆపై ఎవరూ కూడా ఆడే యత్నం చేయలేకపోవడంతో సన్‌రైజర్స్‌కు ఓటమి తప్పలేదు. గెలుస్తామనుకున్న మ్యాచ్‌ను ఆరెంజ్‌ ఆర్మీ చేజార్చుకోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

లక్ష్య ఛేదనలో  ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ను డేవిడ్‌ వార్నర్‌-బెయిర్‌ స్టోలు ధాటిగా ఆరంభించారు. ఈ జోడి 56 పరుగుల జత చేసిన తర్వాత వార్నర్‌(35; 20 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్స్‌లు) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. స్పిన్నర్‌ రవి బిష్నోయ్‌ వేసిన ఏడో ఓవర్‌ రెండో బంతికి రాహుల్‌కు క్యాచ్‌ వార్నర్‌ ఔటయ్యాడు. ఆపై వెంటనే బెయిర్‌ స్టో(19; 20 బంతుల్లో 4ఫోర్లు) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. మురుగన్‌ అశ్విన్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌ రెండో బంతికి బెయిర్‌ స్టో బౌల్డ్‌ అయ్యాడు. అబ్దుల్‌ సామద్‌(7; 5 బంతుల్లో 1 ఫోర్‌) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. దాంతో 67 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది సన్‌రైజర్స్‌. ఆ తరుణంలో  మనీష్‌ పాండేకు విజయ్‌ శంకర్‌ జత కలిశాడు. వీరిద్దరూ 33 పరుగుల జత చేసిన తర్వాత  మనీష్‌ పాండే పెవిలియన్‌ చేరగా, ఆ తర్వాత స్వల్ప విరామాల్లో వికెట్లను చేజార్చుకుని పరాజయం పాలైంది. 19.5 ఓవర్లలో 114 పరుగులకే సన్‌రైజర్స్‌ చాపచుట్టేసింది. ఆరుగురు సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన కింగ్స్‌ పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఆరెంజ్‌ ఆర్మీ బౌలర్లు అదరగొట్టడంతో కింగ్స్‌ పంజాబ్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. టాస్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఫీల్డింగ్‌ తీసుకోవడంతో పంజాబ్‌కు బ్యాటింగ్‌కు దిగింది. కింగ్స్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను కేఎల్‌ రాహుల్‌, మనదీప్‌ సింగ్‌లు ఆరంభించారు. మయాంక్‌ అగర్వాల్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన మన్‌దీప్‌ సింగ్‌(17) నిరాశపరిచాడు. సందీప్‌ శర్మ బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత రాహుల్‌-క్రిస్‌  గేల్‌ల జోడి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది.

అయితే జట్టు స్కోరు 66 పరుగుల వద్ద ఉండగా గేల్‌(20;20 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్‌) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. హోల్డర్‌ వేసిన 10 ఓవర్‌ ఆఖరి బంతికి భారీ షాట్‌ ఆడబోయిన గేల్‌.. వార్నర్‌ క్యాచ్‌ పట్టడంతో నిష్క్రమించాడు. ఆపై తదుపరి ఓవర్‌లో రాహుల్‌(27; 27 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్‌) ఔటయ్యాడు. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత కింగ్స్‌ తిరిగి తేరుకోలేకపోయింది. మ్యాక్స్‌వెల్‌(12), దీపక్‌ హుడా(0), క్రిస్‌ జోర్డాన్‌(7), మురుగన్‌ అశ్విన్‌(4)లు విఫలయ్యారు. కాగా, నికోలస్‌ పూరన్‌(32 నాటౌట్‌; 28 బంతుల్లో 2 ఫోర్లు) కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో వంద పరుగుల మార్కును చేరింది కింగ్స్‌ పంజాబ్‌. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ, హోల్డర్‌, రషీద్‌ ఖాన్‌లు తలో రెండు వికెట్లు సాధించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top