Kieron Pollard Records: చరిత్ర సృష్టించిన కీరన్‌ పొలార్డ్‌.. ఎవరికి అందనంత ఎత్తులో

Kieron Pollard Becomes First Cricketer Played 600th Match T20 Cricket - Sakshi

వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ టి20 క్రికెట్‌లో అరుదైన ఫీట్‌ అందుకున్నాడు. టి20ల్లో 600వ మ్యాచ్‌ ఆడిన తొలి క్రికెటర్‌గా పొలార్డ్‌ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం హండ్రెడ్‌ టోర్నమెంట్‌లో ఆడుతున్న ఈ హిట్టర్‌ లండన్‌ స్పిరిట్స్‌ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సోమవారం మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌తో మ్యాచ్‌లో పొలార్డ్‌ ఈ ఘనత అందుకున్నాడు. కాగా తన 600 వ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో పొలార్డ్‌ 11 బంతుల్లో 34 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్‌, నాలుగు భారీ సిక్సర్లు ఉన్నాయి. 

ఇక టి20ల్లో సక్సెస్‌ అయిన బ్యాట్స్‌మెన్లలో పొలార్డ్‌ ఒకడిగా నిలిచాడు.  600 మ్యాచ్‌ల్లో 31.34 సగటుతో 11, 723 పరుగులు సాధించాడు.  ఇందులో ఒక సెంచరీ ఉండగా.. 56 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక బౌలింగ్‌లో 309 వికెట్లు పడగొట్టిన పొలార్డ్‌ అత్యుత్తమ బౌలింగ్‌ 4/15 గా ఉంది. దాదాపు 15 ఏళ్ల నుంచి టి20లు ఆడుతున్న పొలార్డ్‌ వెస్టిండీస్‌తో పాటు ఎన్నో జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

దేశవాలీలో ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగొ, కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌, బీబీఎల్‌లో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌, మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌, బంగ్లా ప్రీమియర్‌ లీగ్‌లో డాకా గ్లాడియేటర్స్‌, డాకా డైనమిటీస్‌, పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో కరాచీ కింగ్స్‌, ముల్తాన్‌ సుల్తాన్స్‌, పెషావర్‌ జాల్మికి ప్రాతినిధ్యం వహించాడు. పొలార్డ్‌ తర్వాత టి20 క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జాబితాలో డ్వేన్‌ బ్రావో(543 మ్యాచ్‌లు), షోయబ్‌ మాలిక్‌(472 మ్యాచ్‌లు), క్రిస్‌ గేల్‌(463 మ్యాచ్‌లు), రవి బొపారా(426 మ్యాచ్‌లు) ఉన్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే పొలార్డ్‌ హిట్టింగ్‌తో లండన్‌ స్పిరిట్స్‌ 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగుల భారీ స్కోరు చేసింది. పొలార్డ్‌తో పాటు కెప్టెన్‌ ఇయాన్‌ మెర్గాన్‌(37 పరుగులు), ఓపెనర్‌ జాక్‌ క్రాలీ(41 పరుగులు) చేశారు. ఆ తర్వాత మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ జోర్డాన్‌ థాంప్సన్‌(4/15) ధాటికి 108 పరుగులకే కుప్పకూలింది. దీంతో లండన్‌ స్పిరిట్స్‌ 52 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది.

చదవండి: Asia Cup 2022: పాక్‌ ప్రత్యర్ధిగా వందో టీ20 ఆడేందుకు సిద్ధంగా ఉన్న కోహ్లి

బంగ్లాదేశ్‌కు మరోసారి ఊహించని షాక్‌.. వన్డే సిరీస్‌ జింబాబ్వే సొంతం!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top