భారత్, పాక్‌ను ఏకతాటిపైకి తెచ్చిన జై షా | Jay Shah Brings India, Pakistan Together For Special ICC Mission In Sri Lanka | Sakshi
Sakshi News home page

ప్రత్యేక మిషన్ కోసం భారత్, పాక్‌ను ఏకతాటిపైకి తెచ్చిన జై షా

May 16 2026 12:19 PM | Updated on May 16 2026 12:23 PM

Jay Shah Brings India, Pakistan Together For Special ICC Mission In Sri Lanka

ఐసీసీ అధ్యక్షుడు జై షా ఓ ప్రత్యేక మిషన్‌ కోసం భిన్న ధృవాలుగా ఉన్న భారత్‌, పాకిస్తాన్‌లను ఏకతాటిపైకి తెచ్చారు. శ్రీలంక క్రికెట్‌లో నెలకొన్న పరిపాలనా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఇరు దేశాలకు చెందిన ఉన్నత స్థాయి అధికారులను శ్రీలంకకు పంపారు.

ఇటీవల స్వదేశంలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో శ్రీలంక క్రికెట్‌ జట్టు ఘోర​ ప్రదర్శనలు చేసి, సూపర్-8 దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ హెడ్ కోచ్ సనత్‌ జయసూర్య తన పదవికి రాజీనామా చేశారు.

దీంతో శ్రీలంక ప్రభుత్వం జోక్యం చేసుకుని క్రికెట్ వ్యవస్థపై విచారణ ప్రారంభించింది. అధ్యక్షుడు అనుర కుమార డిస్సనాయకేతో సమావేశమైన తర్వాత అప్పటి ఎస్‌ఎల్‌సీ అధ్యక్షుడు షమ్మీ సిల్వ రాజీనామా చేశారు. అనంతరం క్రీడాశాఖ మంత్రి సునీల్‌ కుమార గమగే తొమ్మిది మంది సభ్యులతో క్రికెట్ ట్రాన్స్‌ఫర్మేషన్ కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ కమిటీలో మాజీ కెప్టెన్లు కుమార సంగక్కర, రోషన్‌ మహానామా, సిదాత్‌ వెట్టిముని వంటి ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. ప్రతిపక్ష నేత ఎరన్‌ విక్రమరత్నే ఈ కమిటీకి నాయకత్వం వహిస్తున్నారు. శ్రీలంక క్రికెట్ పరిపాలనలో పారదర్శకత తీసుకురావడం, నిర్మాణాత్మక సంస్కరణలు అమలు చేయడం ఈ కమిటీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ పరిస్థితిని సమీక్షించేందుకు ఐసీసీ భారత్‌-పాక్‌ ప్రతినిధులతో కూడిన ప్రత్యేక బృందాన్ని శ్రీలంకకు పంపింది. ఇందులో పాకిస్తాన్ మూలాలున్న ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్‌ ఖ్వాజా, బీసీసీఐకి చెందిన సీనియర్ అధికారి ఉన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement