‘రోమ్‌’ మాస్టర్స్‌ టోర్నీ ఫైనల్లో సినెర్‌ | Jannik Sinner Breaks The Masters 1000 Win Streak Record | Sakshi
Sakshi News home page

‘రోమ్‌’ మాస్టర్స్‌ టోర్నీ ఫైనల్లో సినెర్‌

May 17 2026 6:20 AM | Updated on May 17 2026 6:20 AM

Jannik Sinner Breaks The Masters 1000 Win Streak Record

రోమ్‌: పురుషుల టెన్నిస్‌లో నిర్వహించే తొమ్మిది వేర్వేరు మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నమెంట్‌ టైటిల్స్‌నూ గెలిచిన రెండో ప్లేయర్‌గా గుర్తింపు పొందేందుకు... ఇటలీ స్టార్‌ యానిక్‌ సినెర్‌ ఒక్క విజయం దూరంలో నిలిచాడు. రోమ్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్‌ సినెర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో సినెర్‌ 6–2, 5–7, 6–4తో డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా)పై గెలుపొందాడు. 

2 గంటల 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సినెర్‌ ఏడు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. తొలి సర్వీస్‌లో 41 పాయింట్లు, రెండో సర్వీస్‌లో 22 పాయింట్లు సంపాదించాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేశాడు. 30 అనవసర తప్పిదాలు చేసి, 39 విన్నర్స్‌ కొట్టాడు. ఈరోజు జరిగే ఫైనల్లో కాస్పర్‌ రూడ్‌ (నార్వే)తో సినెర్‌ తలపడతాడు. 

సినెర్‌ విజయం సాధిస్తే ‘కెరీర్‌ గోల్డెన్‌ మాస్టర్స్‌’ ఘనత నమోదు చేస్తాడు. ప్రతి యేటా తొమ్మిది వేర్వేరు మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీలు జరుగుతాయి. సెర్బియా దిగ్గజం జొకోవిచ్‌ రెండుసార్లు చొప్పున ఈ తొమ్మిది టోర్నీల టైటిల్స్‌ సాధించాడు. సినెర్‌ ఇప్పటి వరకు తొమ్మిది మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్స్‌ (మయామి 2 సార్లు; మాడ్రిడ్, మోంటెకార్లో, ఇండియన్‌ వెల్స్, పారిస్, షాంఘై, సిన్సినాటి, కెనడా) సొంతం చేసుకున్నాడు. రోమ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ టైటిల్‌ మాత్రమే సినెర్‌ ఖాతాలో చేరలేదు.  

 

Advertisement
 
Advertisement
Advertisement