
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ ఆరో విజయం నమోదు చేసుకుంది. హరియాణా స్టీలర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ 37–36 పాయింట్ల తేడాతో గెలిచింది. జైపూర్ తరఫున సాహిల్ 7, అలీ 6 పాయింట్లు సాధించారు.
స్టీలర్స్ తరఫున వినయ్ 11 పాయింట్లతో పోరాడినా సరిపోలేదు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో స్టీలర్స్ 21 రెయిడ్ పాయింట్లు సాధించగా... జైపూర్ 16 రెయిడ్ పాయింట్లకే పరిమితమైంది. అయితే ఆలౌట్ పాయింట్లు, ఎక్స్‌ట్రా పాయింట్లలో ముందంజ వేసిన పింక్ పాంథర్స్ విజయం సాధించింది.
తాజా సీజన్‌లో 10 మ్యాచ్‌లాడిన జైపూర్ పింక్ పాంథర్స్ 6 విజయాలు, 4 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఐదో స్థానానికి చేరింది. హర్యానా స్టీలర్స్ 10 మ్యాచ్‌లో 6 గెలిచి నాలుగింట ఓడి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
మరో మ్యాచ్‌లో యు ముంబా 42–24 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్‌పై గెలుపొందింది. యు ముంబా తరఫున సందీప్ కుమార్ 12 పాయింట్లతో విజృంభించగా... తలైవాస్ తరఫున అత్యధికంగా రోహిత్ గోపాల్ 7 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో బెంగళూరు బుల్స్... గుజరాత్ జెయింట్స్‌తో యు ముంబా తలపడతాయి.
చదవండి: AB de Villiers: ఆసియాకప్ ట్రోఫీ వివాదం.. టీమిండియాపై డివిలియర్స్ విమర్శలు