లంక లీగ్‌ ఆడట్లేదు: ఇర్ఫాన్‌ | Sakshi
Sakshi News home page

లంక లీగ్‌ ఆడట్లేదు: ఇర్ఫాన్‌

Published Tue, Aug 4 2020 2:43 AM

Irfan Pathan Not Playing In Lanka Premier League - Sakshi

న్యూఢిల్లీ: విదేశీ టి20 లీగ్‌లో తాను పాల్గొంటున్నట్లు వస్తోన్న వార్తల్ని భారత మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఖండించాడు. ఈనెల 28 నుంచి జరుగనున్న లంక ప్రీమియర్‌ లీగ్‌ (ఎల్‌పీఎల్‌)లో ఇర్ఫాన్‌ ప్రాతినిధ్యం వహించనున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశాడు. దీనికి సంబంధించి తాను ఎవరికి మాటివ్వలేదని పఠాన్‌ ట్విట్టర్‌ వేదికగా స్పష్టం చేశాడు. ‘భవిష్యత్‌లో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన టి20 లీగ్‌లలో ఆడాలని అనుకున్నా. కానీ ఈ పరిస్థితుల్లో లీగ్‌లకు అందుబాటులో ఉంటానని చెప్పలేదు. అందరూ అనుకుంటున్నట్లుగా ఎల్‌పీఎల్‌లో పాల్గొనడం లేదు’ అని 35 ఏళ్ల పఠాన్‌ ట్వీట్‌ చేశాడు. ఈ ఏడాది జనవరిలో ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఇర్ఫాన్‌... ఐపీఎల్‌లో ఇప్పటివరకు చెన్నై సూపర్‌ కింగ్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్, రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. భారత్‌ తరఫున 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టి20లు ఆడిన అతను 2500 పరుగులు, 300 వికెట్లు దక్కించుకున్నాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement