IPL New Teams: అదానీని తలదన్నేసిన గోయెంకా గ్రూప్‌.. మరి సీవీసీ క్యాపిటల్‌ గురించి తెలుసా?

IPL New Teams Lucknow Ahmedabad CVC Capital Goenka Group Interesting Facts - Sakshi

 లక్నో వేల కోట్లతో గోయెంకా గ్రూప్‌ వశం

 అదానీకి దక్కని అహ్మదాబాద్‌

రూ. 5,625 కోట్లకు సీవీసీ క్యాపిటల్‌ చేతికి గుజరాతీ ఫ్రాంచైజీ

రెండు కొత్త జట్లతో బీసీసీఐ ఖజానాలో రూ.12,715 కోట్లు

పోలా... అదిరిపోలా! ఐపీఎలా మజాకా... మైదానంలో ఓ బ్యాట్, ఓ బాల్‌ ఆడే ఆట కోట్లకు, కోటాను కోట్లకు, రూ.వేలకోట్లకు అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. మళ్లీ లీగ్‌ను పది జట్ల విస్తృతి కోసం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన ప్రయత్నం రూ. 12,715 కోట్లు కురిపించింది. గోయెంకా గ్రూప్‌ అదానీని తలదన్నేసింది. అహ్మదాబాద్, లక్నోలపై ఎవరి ఊహకందని విధంగా రూ.7,090 కోట్లతో బిడ్‌ వేసింది. రెండింటిలో ఒకటి ఎంచుకునే అవకాశం కొట్టేసింది. చివరకు లక్నోవైపే మొగ్గు చూపింది.

IPL New Teams Lucknow Ahmedabad : ఐపీఎల్‌లోకి వచ్చేందుకు ఎన్నో అంచనాలు రేకెత్తించిన అదానీ గ్రూప్‌... మ్యాచ్‌ దాకా కాదు కదా... కనీసం టాస్‌ దాకా అయినా రాలేకపోయింది. సోమవారం టెండర్లు తెరువగా... భారత కార్పొరేట్‌ సంస్థ గోయెంకా గ్రూప్, అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్‌ (ఐరిలియా కంపెనీ లిమిటెడ్‌)లు వరుసగా లక్నో, అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీలను దక్కించుకున్నాయి. ప్రాధాన్యక్రమంలో ఉన్న అహ్మదా బాద్‌ను కాదని తను మొదటి నుంచి కన్నేసిన లక్నోనే గోయెంకా గ్రూప్‌ ఎంచుకుంది.

ఇందుకోసం రాజీవ్‌ ప్రతాప్‌ సంజీవ్‌ గోయెంకా (ఆర్‌పీఎస్‌జీ) వెంచర్స్‌ లిమిటెడ్‌ రికార్డు స్థాయిలో రూ.7,090 కోట్లు (సుమారు బిలియన్‌ డాలర్లు) వెచ్చించింది. ప్రపంచ వ్యాప్తంగా 22 కంపెనీలు బిడ్డింగ్‌పై ఆసక్తి కనబరిచాయి. చివరకు 9 సంస్థలు టెండర్లు దాఖలు చేయగా అత్యధిక మొత్తం గోయెంకా గ్రూప్‌దే! ఐరిలియా కంపెనీ (సీవీసీ క్యాపిటల్‌) రూ. 5,625 కోట్లతో అహ్మదాబాద్‌ను దక్కించుకుంది.  

కొన్నాళ్లుగా వార్తల్లో, అంచనాల్లో... చివరకు బిడ్డర్ల జాబితాలో కూడా తొలి స్థానంలో ఉన్న అదానీ గ్రూప్‌ రూ.5,100 కోట్లతో ఏ ఒక్క నగరాన్ని దక్కించుకోలేక వెనక్కి వెళ్లిపోయింది. ఏదేమైనా మన క్రికెట్‌ బోర్డు భాండాగారం మరింత బరువెక్కింది. రెండు ఫ్రాంచైజీలతోనే ఏకంగా రూ. 12,715 కోట్లు (సుమారు 1.7 బిలియన్‌ డాలర్లు) జమ చేసుకుంది. నిజానికి బోర్డు అంచనా వేసు కున్న మొత్తం రూ. 7 వేల కోట్ల నుంచి రూ. 10 వేల  కోట్లే! కానీ అంచనాను మించి రూ. 2,715 కోట్లు ఎక్కువ మొత్తం వచ్చింది. 2022లో జరిగే ఐపీఎల్‌ –15 సీజన్‌లో ఈ రెండు జట్లు బరిలోకి దిగుతాయి.  

ఐపీఎల్‌ విస్తరణ, టెండర్ల కంటే ముందే... అహ్మదాబాద్‌లో నరేంద్ర మోదీ స్టేడియం మొదలైనప్పటి నుంచి అదానీ గ్రూప్‌ ఐపీఎల్‌ వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. ఒకానొక దశలో అదానీ జట్టు కోసమే లీగ్‌ విస్తరణ అనే గుసగుసలు వినిపించాయి. ఇంకా చెప్పాలంటే అహ్మదాబాద్, లక్నోల్లో ఆరునూరైనా అహ్మదాబాద్‌ అదానీదే అన్న అంచనాలు ఆకాశాన్నంటాయి.

పైగా గతేడాది కాలంగా రోజుకు రూ. 1,000 కోట్లకుపైగా ఆర్జించిన సంస్థ కావడంతో బీసీసీఐ లీగ్‌ విస్తరణ ప్రకటన నుంచే... మీడియాలో ప్రచురితమైన ప్రతీ వార్తలో అదానీ పేరు కనిపించింది. చివరకు 9 సంస్థలు పాల్గొన్న బిడ్డింగ్‌లో మూడో స్థానంతో అదానీ గ్రూప్‌ కంగుతినడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

సీవీసీ క్యాపిటల్‌ ఎక్కడిది?
లండన్‌ ప్రధాన కేంద్రంగా లక్జెంబర్గ్‌కు చెందిన ఈక్విటీ కంపెనీ సీవీసీ క్యాపిటల్‌. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ. ప్రధానంగా సేవల రంగానికి చెందిన ఈ సంస్థ 37 దేశాల్లో పెట్టుబడులు పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 300పైగా పెట్టుబడిదారులకు ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ సేవలందిస్తోంది. మనదేశంలో బెంగళూరు కేంద్రంగా హెల్త్‌కేర్‌ రంగంలో ఉంది.

అలాగే యునైటెడ్‌ లెక్స్‌ పేరుతో ఔట్‌సోర్సింగ్‌ సేవలు అందిస్తోంది. ఐపీఎల్‌కు కొత్తకావొచ్చేమో కానీ... క్రీడలతో సీవీసీకి సుదీర్ఘ బంధముంది. 2006 నుంచి 2017 వరకు ఫార్ములావన్‌లో మెజారిటీ స్టేక్‌హోల్డర్‌గా కొనసాగింది. సాకర్‌ క్రేజ్‌ యూరోప్‌లో ఫుట్‌బాల్, రగ్బీలపై కూడా సంస్థ పెట్టుబడులున్నాయి.

గోయెంకా మనకు తెలిసిందే... 
గోయెంకా గ్రూప్‌ కోల్‌కతాకు చెందిన భారతీయ బహుళజాతి సంస్థ. దివంగత వ్యాపారవేత్త, టేకోవర్‌ కింగ్‌గా పేరుగాంచిన రాజీవ్‌ ప్రతాప్‌ గోయెంకా (ఆర్‌పీజీ) తన పేరుమీద స్థాపించిన సంస్థ. ఆయన తనయుడు సంజీవ్‌ గోయెంకా తండ్రి పేరును జత చేసి ఆర్‌పీఎస్‌జీ వెంచర్స్‌ లిమిటెడ్‌తో టెండరు వేసి గెలిచారు. ‘స్పెన్సర్స్‌’ హైపర్‌ మార్కెట్, షాపింగ్‌ మాల్స్‌ వాళ్లవే. అలా మన వంటింటి నేస్తమైంది. ఇంకా ఐటీ, విద్యుత్, ఎఫ్‌ఎమ్‌సీజీ, మీడియా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్‌ రంగాల్లో గోయెంకా గ్రూప్‌ విస్తరించింది.

కోల్‌కతా మహానగరానికి వెలుగులు నింపుతున్న ఏకైక విద్యుత్‌ పంపిణీ సంస్థ కలకత్త ఎలెక్ట్రిక్‌ సప్లయ్‌ కార్పోరేషన్‌ (సీఈఎస్‌సీ) గోయెంకాదే. ఉత్తర ప్రదేశ్‌లో కూడా విద్యుత్‌ పంపిణీ చేస్తోంది. పైగా ఐపీఎల్‌కు గోయెంకా గ్రూప్‌ కొత్తేం కాదు. 2016, 2017 సీజన్‌లలో రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్స్‌ పేరుతో ఆడింది కూడా! ఐఎస్‌ఎల్‌ (ఫుట్‌బాల్‌ లీగ్‌)లో ఏటీకే మోహన్‌ బగాన్‌ ఎఫ్‌సీ యజమాని కూడా!

ఎప్పట్లాగే 14 మ్యాచ్‌లే!
ఇన్నాళ్లు 8 జట్లు ఆడినట్లే ఇకపైనా 10 జట్లు కూడా లీగ్‌ దశలో 14 మ్యాచ్‌లే ఆడతాయి. అయితే రెండు జట్ల వల్ల మ్యాచ్‌ల సంఖ్య మాత్రం 74కు చేరింది. అయితే 10 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూప్‌లో 5 జట్లు తలపడతాయి. ఈ ఐదు జట్ల మధ్య ఇంటా (4), బయటా (4) ఎనిమిది మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం అవతలి గ్రూప్‌లోని నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్, ఒక్క జట్టుతో మాత్రం రెండు మ్యాచ్‌లు ఆడటం ద్వారా 14 మ్యాచ్‌లు పూర్తవుతాయి.

చదవండి: T20 World Cup 2021: అఫ్గన్‌ సంచలనం.. 130 పరుగుల తేడాతో విజయం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top