ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ రేసులో అన్ని జట్లకంటే ముందుకొచ్చింది. తాజాగా పంజాబ్ కింగ్స్‌ను ఓడించడంతో పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానానికి దూసుకొచ్చింది. ఇకపై ఆడాల్సిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచినా, ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది.
ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించిన సన్‌రైజర్స్.. సెకెండ్ బెస్ట్ రన్‌రేట్‌తో (0.737) 14 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. తదుపరి 3 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ ప్రత్యర్దులు గుజరాత్, సీఎస్‌కే, ఆర్సీబీ. ఈ మూడు మ్యాచ్‌లు మే 12, 18, 22 తేదీల్లో అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్ వేదికలుగా జరుగనున్నాయి.
ఇదిలా ఉంటే, ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ప్రయాణం తొలుత అంత సాఫీగా సాగలేదు. మొదటి 4 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, ఢీలాగా ఉండింది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడం ఈ జట్టుపై భారీ ప్రభావం చూపించింది.
అయితే ఐదో మ్యాచ్ నుంచి తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ జట్టును గాడిలోకి తెచ్చాడు. వ్యక్తిగతంగా సత్తా చాటడంతో పాటు జట్టును విజయపథంలో నడిపించసాగాడు. ఇషాన్ సారథ్యంలో మొదటి 4 మ్యాచ్‌ల్లో మూడింట ఓడిన సన్‌రైజర్స్.. ఆతర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించి గాడిలో పడింది.
అయితే సన్‌రైజర్స్‌కు అసలు బ్రేక్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ తిరిగొచ్చిన తర్వాతే వచ్చింది. అప్పటిదాకా బౌలింగ్‌లో బలహీనంగా ఉండిన సన్‌రైజర్స్ కమిన్స్ రాకతో ఒక్కసారిగా బలపడినట్లైంది. కమిన్స్ వ్యక్తిగతంగా సత్తా చాటుతూ యువ బౌలర్లకు మార్గదర్శంగా నిలిచాడు.
అప్పటికే సత్తా చాటుతున్న ఎషాన్ మలింగ కమిన్స్ సలహాలతో మరింత రెచ్చిపోసాగాడు. దేశీయ యువ పేసర్లు సాకిబ్ హుసేన్, ఫ్రఫుల్ హింగే కమిన్స్ మార్గదర్శకత్వంలో రాటుదేలారు. ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ సైతం కమిన్స్ రాకతో సత్తా చాటడం ప్రారంభించాడు.
ఈ ఐదురుగు నిలకడగా రాణిస్తుండటంతో సన్‌రైజర్స్ ప్రస్తుత ఎడిషన్‌లో అత్యంత ప్రమాదకర పేస్ బౌలింగ్ యూనిట్‌గా మారిపోయింది. వీరికి స్పిన్నర్ శివాంగ్ కుమార్ కూడా జతకలవడంతో సన్‌రైజర్స్ అత్యంత పటిష్టమైన బౌలింగ్ విభాగంగా తయారైంది.
సీజన్ ప్రారంభంలో బ్యాటింగ్ అత్యంత పటిష్టంగా ఉన్నా, బౌలింగ్ విభాగం సరిగ్గా లేకపోవడం వల్లనే సన్‌రైజర్స్ అపజయాలు ఎదుర్కొంది. ఇప్పుడు బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా మారడంతో సన్‌రైజర్స్ తిరుగులేని జట్టుగా మారిపోయింది. కమిన్స్ వచ్చాక సన్‌రైజర్స్ నాలుగింట మూడు విజయాలు సాధించి, ప్లే ఆఫ్స్ రేసులో అందరికంటే ముందుకొచ్చింది.
ఆరెంజ్ ఆర్మీ ఇదే జోరును కొనసాగిస్తే మరో టైటిల్ ఖాయం. మొత్తంగా కమిన్స్ రాక సన్‌రైజర్స్‌లో కాకను మరింత పెంచింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా నిలబెట్టింది. జట్టులో అందరూ గెలుపు కోసం తమవంతు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో టాపార్డర్ అంతా నిలకడగా రాణిస్తున్నారు.
ప్రస్తుతం టాప్-4 లీడింగ్ రన్ స్కోరర్లలో ముగ్గురు (క్లాసెన్, అభిషేక్, ఇషాన్) సన్‌రైజర్సే ఉన్నారు. ఈ ముగ్గురు ప్రత్యర్ది బౌలర్ల పాలిట సింహస్వప్నాల్లా మారారు. బౌలింగ్‌లో ఎషాన్ మలింగ చెలరేగిపోతున్నారు. ఇతనికి కమిన్స్ జతకలిశాడు.
కమిన్స్ కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగతంగానూ అద్భుతంగా రాణిస్తున్నాడు. నిన్నటి పంజాబ్ మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా రెండు కీలక వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. సన్‌రైజర్స్ శిబిరంలో మరో అన్ సంగ్ హీరో కూడా ఉన్నాడు.
అతడే నితీశ్ కుమార్ రెడ్డి. నితీశ్ ఈ సీజన్‌లో చాలా అగ్రెసివ్‌గా కనిపిస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు.
సీజన్ ప్రారంభంలో దారుణంగా విఫలమైన ట్రవిస్ హెడ్ కీలక దశలో ఫామ్‌లోకి రావడం సన్‌రైజర్స్‌కు అదనంగా కలిసొస్తున్న అంశం. హెడ్ గత మూడు మ్యాచ్‌ల్లో తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఇలా ఒకరు కాకపోతే ఒకరు బాధ్యతలను భుజాన వేసుకుంటుండంతో సన్‌రైజర్స్ తిరుగులేని జట్టుగా మారిపోయింది. ఇది కొనసాగితే ఆ జట్టుకు మరో టైటిల్ ఖాయం.


