ఎస్ఆర్‌హెచ్ ఘన విజ‌యం.. పలు రికార్డులు బద్దలు | IPL 2026: Sunrisers Hyderabad Beat Rajasthan Royals By 5 Wickets | Sakshi
Sakshi News home page

ఎస్ఆర్‌హెచ్ ఘన విజ‌యం.. పలు రికార్డులు బద్దలు

Apr 25 2026 11:50 PM | Updated on Apr 26 2026 11:55 AM

IPL 2026: Sunrisers Hyderabad Beat Rajasthan Royals By 5 Wickets

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. జైపూర్ వేదికగా శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ విజ‌యం సాధించింది. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎస్‌ఆర్‌హెచ్ 18.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేధించింది. 

కెప్టెన్ ఇషాన్ కిషన్ (74), అబిషేక్ శర్మ (57) హాఫ్ సెంచరీలతో రాణించగా, చివర్లో నితీశ్ కుమార్ (36), క్లాసెన్ (29) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును గెలిపించారు. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బ్రిజేశ్ శర్మలు చెరో 2 వికెట్లు తీయగా, ఫెరీరా ఒక వికెట్ పడగొట్టాడు. అంతకముందు రాజస్తాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. 

వైభవ్‌ సూర్యవంశీ (103) సెంచరీతో చెలరేగగా, ధ్రువ్‌ జురేల్‌ (51) అర్థసెంచరీతో రాణించాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో ఇషాన్ మలింగ రెండు వికెట్లు తీయగా, ప్రఫుల్ హింగే, కెప్టెన్ కమిన్స్‌, సాకిబ్ హుస్సేన్, నితీశ్ కుమార్ తలా ఒక వికెట్ తీశారు. ఇషాన్‌ కిషన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు గెలుచుకున్నాడు. 

 ఐపీఎల్‌ 19వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఐదు విజయాలు సాధించగా.. ఇది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌ 10 పాయింట్లు సాధించి రాజస్తాన్‌తో సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన రన్‌రేట్‌తో పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. రాజస్తాన్‌ మూడో ఓటమితో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ప‌లు రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టింది. 

  • 2023 సీజ‌న్ నుంచి రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌పై ఎస్ఆర్‌హెచ్‌కు ఇది వ‌రుస‌గా ఆరో విజ‌యం కావ‌డం విశేషం. గ‌తంలో సీఎస్‌కే (2010 నుంచి 2013 మధ్య‌) రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌పై ఆరు వ‌రుస విజ‌యాలు సాధించింది. 2019 నుంచి 2022 మ‌ధ్య ఆర్సీబీ.. రాజ‌స్తాన్‌పై 5 వ‌రుస విజ‌యాలు అందుకుంది. 2018 నుంచి 2020 మ‌ధ్య ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఐదు వ‌రుస విజ‌యాలు న‌మోదు చేసింది.

  • ఐపీఎల్‌లో 200 ప్ల‌స్ ప‌రుగుల ల‌క్ష్యాన్ని విజ‌య‌వంతంగా ఛేదించ‌డం ఎస్ఆర్‌హెచ్‌కు ఇది ఐదోసారి. ఇక పంజాబ్ కింగ్స్ 11 సార్లు 200 ప్ల‌స్ స్కోర్లు ఛేదించి తొలి స్థానంలో ఉండ‌గా, ముంబై ఇండియ‌న్స్ (ఆరు సార్లు) రెండో స్థానంలో కొన‌సాగుతోంది. రాజ‌స్తాన్‌, ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్‌లు ఐదేసి సార్లు ఛేదించి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి.

  • ఐపీఎల్‌లో అత్య‌ధిక ప‌రుగులు ఛేదించిన జట్ల‌లో ఎస్ఆర్‌హెచ్ చోటు ద‌క్కించుకుంది. రాజ‌స్తాన్‌పై 229 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించిన ఎస్ఆర్‌హెచ్ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. తొలి రెండు స్థానాలు పంజాబ్ కింగ్స్ (ఢిల్లీపై 265, కేకేఆర్‌పై 262 ప‌రుగుల టార్గెట్‌), ఎస్ఆర్‌హెచ్ (పంజాబ్‌పై 246 ప‌రుగుల టార్గెట్‌) మూడో స్థానంలో ఉంది. ఇక ఐదో స్థానంలో ఆర్సీబీ (ల‌క్నోపై 228 ప‌రుగుల టార్గెట్‌) ఉంది.

  • జైపూర్ వేదిక‌పై  రాజ‌స్తాన్‌పై 228 ప‌రుగుల టార్గెట్‌ను ఛేదించిన ఎస్ఆర్‌హెచ్ త‌న రికార్డును తానే మెరుగుప‌రుచుకుంది. 2023లో ఇదే రాజ‌స్తాన్‌పై 215 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించింది. తాజాగా ఆ రికార్డును స‌వ‌రించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement