ఐపీఎల్‌ జోరు.. పీఎస్‌ఎల్‌ బేజారు | IPL 2026 going vigorously compared to PSL 2026 | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ జోరు.. పీఎస్‌ఎల్‌ బేజారు

Apr 22 2026 2:10 PM | Updated on Apr 22 2026 2:33 PM

IPL 2026 going vigorously compared to PSL 2026

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2026, పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2026 ఏకకాలంలో జరుగుతున్న నేపథ్యంలో ఏ లీగ్‌ జోరుగా సాగుతుంది..? ఏ లీగ్‌ బేజారుగా సాగుతుందన్న విషయాలను ఈ కథనంలో పరిశీలిద్దాం.

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు గత సీజన్‌ నుంచి ఐపీఎల్‌కు పోటీగా పీఎస్‌ఎల్‌ను ఒకే సమయంలో షెడ్యూల్‌ చేసింది. పీసీబీ తీసుకున్న ఈ తలతిక్క నిర్ణయం పీఎస్‌ఎల్‌ అన్ని విధాల నష్టపోతుంది. ఐపీఎల్‌కు పోటీ కాదు కదా, కనుచూపుమేరల్లో కూడా లేకుండా పోయింది.

రెండు లీగ్‌లు ఒకేసారి జరుగుతుండటం​ వల్ల సహజంగానే ఐపీఎల్‌కు ప్రజాదరణ ఎక్కువగా ఉంది. స్వదేశీ, విదేశీ స్టార్లంతా ఇదే లీగ్‌లో ఉండటంతో ప్రపంచవాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు ఈ లీగ్‌నే ఫాలో అవుతున్నారు. 

పీఎస్‌ఎల్‌ విషయానికొస్తే.. ఈ లీగ్‌లో స్వదేశీ ఆటగాళ్లు, ఔట్‌ డేటెడ్‌ విదేశీ ఆటగాళ్లు మాత్రమే పాల్గొంటున్నారు. దీంతో ఈ లీగ్‌ పరిధి కేవలం​ పాక్‌కు మాత్రమే పరిమితమైంది. బయటి దేశాల్లో పీఎస్‌ఎల్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.

ప్రస్తుత సీజన్‌లో పీఎస్‌ఎల్‌తో పోలిస్తే ఐపీఎల్‌కు అధిక పాపులారిటీ దక్కడానికి మరో కారణం ఐపీఎల్లో‌ జరుగుతున్న విధ్వంసం. ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్‌లు పోటాపోటీగా సాగాయి. దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. బౌలర్లు సైతం ఈ సీజన్‌లో పని చక్కబెట్టుకున్నారు. అద్భుతమైన ఫీల్డింగ్‌ విన్యాసాలు, కళ్లు చెదిరే క్యాచ్‌లకు ఈ సీజన్‌ ప్రత్యేకమైన వేదిక అయ్యింది.

ఈ సీజన్‌లో 31 మ్యాచ్‌లు పూర్తి కాగా.. భారీ సంఖ్యలో సిక్సర్లు, బౌండరీలు నమోదయ్యాయి. 4 సెంచరీలు, పదుల సంఖ్యలో అర్ద సెంచరీలు రికార్డయ్యాయి. ఎన్నో పాత రికార్డులు బద్దలయ్యాయి, మరెన్నో కొత్త రికార్డులు సృష్టించబడ్డాయి. ఏ మాత్రం అంచనాలు లేని బౌలర్లు ఈ సీజన్‌లో చెలరేగిపోతున్నారు. రొటీన్‌కు భిన్నంగా పేసర్లు స్పిన్నర్ల కంటే మెరుగ్గా రాణిస్తున్నారు.

జట్ల విషయంలోనూ అంచనాలు లేని జట్లే ఈ సీజన్‌లో దూసుకుపోతున్నాయి. భారీ అంచనాలు ఉన్న జట్లు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాల్లో పడి ఉన్నాయి. పంజాబ్‌ కింగ్స్‌ ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగక దూసుకుపోతుంది. 

ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ కూడా అంచనాలకు మించి రాణిస్తున్నాయి. భారీ అంచనాలు ఉన్న ముంబై ఇండియన్స్‌ గత మూడు నాలుగు సీజన్ల తరహాలోనే స్లో స్టార్ట్‌ మోడ్‌లో సాగుతుంది. ఎల్‌ఎస్‌జీ, ఢిల్లీ, గుజరాత్‌  పేపర్‌పై బలంగా కనిపిస్తున్నా, ఆన్‌ ఫీల్డ్‌లో అంచనాలను చేరుకోలేకపోతుంది. సీఎస్‌కే పరిస్థితి ముంబై ఇండియన్స్‌ లాగే ఉంది.

అంచనాలు ఉన్న జట్లు విఫలమవుతున్నా, అంచనాలు లేని జట్లు అద్భుతాలు చేస్తూ ఈ సీజన్‌ను రక్తి కట్టిస్తున్నారు. లీగ్‌ మే 31 వరకు సాగనున్న నేపథ్యంలో మరిన్ని సిత్రాలు చూసే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఐపీఎల్‌ ఈ సీజన్‌లో గతానికి కాస్త భిన్నంగా సాగుతూ అత్యంత ప్రజాదరణ కలిగిన క్రీడా పోటీల రేసులో దూసుకుపోతుంది.

పీఎస్‌ఎల్‌ విషయానికొస్తే.. ఆ లీగ్‌ ముగింపుకు దగ్గరగా వచ్చింది. ఇప్పటివరకు ఐపీఎల్‌ లాగే 31 మ్యాచ్‌లు జరిగినా చెప్పుకోదగ్గ ఒక్క ప్రదర్శన లేదు. బ్యాటింగ్‌ విభాగం సప్పగా, వన్డే క్రికెట్‌ను తలపిస్తుండగా.. నాణ్యత లేని బౌలింగ్‌ జనాలకు బోర్‌ కొట్టిస్తుంది. ఫీల్డింగ్‌ గురించి చెప్పుకోకుంటేనే మంచిది. ప్రపంచంలో ఎక్కడా లేని ఫీల్డింగ్‌ సిత్రాలన్నీ ఈ లీగ్‌లోనే కనిపిస్తాయి. పాక్‌ ఆటగాళ్ల ఫీల్డింగ్‌ చూస్తే నవ్వు ఆపుకోక తప్పదు. వీరి కంటే గల్లీ క్రికెటర్లు నయం అనిపిస్తుంది.

ఈ లీగ్‌ ఆడుతున్నది అతి తక్కువ మంది విదేశీ ప్లేయర్లు, వీరిలో ఒక్కరు కూడా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లో ఇదే పరిస్థితి. అడపాదడపా లోకల్‌ ఆటగాళ్లే కాస్త నయం అనిపిస్తుంది. పాక్‌కు ఈ లీగ్‌ వల్ల దక్కే ఊరట ఏదైనా ఉందా అంటే, అది బాబర్‌ ఆజమ్‌ ఫామ్‌లోకి రావడ​ం​. ఈ పాక్‌ స్టార్‌ బ్యాటర్‌ ఈ పీఎస్‌ఎల్‌ సీజన్‌లో విశేషంగా రాణిస్తున్నాడు. తాజాగా ఓ సెంచరీ కూడా చేశాడు.

ఇది మినహా పీఎస్‌ఎల్‌ మొత్తం మూకీ డ్రామాలాగా సప్పగా సాగుతుంది. ఇప్పటికి పెషావర్‌ జల్మీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. ముల్తాన్‌ సుల్తాన్స్‌, ఇస్లామాబాద్‌ యునైటెడ్‌, లాహోర్‌ ఖలందర్స్‌ రేసులో ముందు వరుసలో ఉన్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement