IPL 2023 SRH Vs PBKS: ‘విన్‌’రైజర్స్‌...

IPL 2023: SRH Vs Punjab Kings Match Updates-Highlights - Sakshi

హైదరాబాద్‌ బోణీ

8 వికెట్లతో పంజాబ్‌  కింగ్స్‌పై విజయం

రాణించిన రాహుల్‌ త్రిపాఠి, మర్కండే

Sunrisers Hyderabad vs Punjab Kings- సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌ సీజన్‌లో రెండు వరుస ఓటముల తర్వాత సన్‌రైజర్స్‌ చెలరేగింది. హైదరాబాద్‌ జట్టు సంపూర్ణ ఆధిపత్యంతో కీలక విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 8 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శిఖర్‌ ధావన్‌ (66 బంతుల్లో 99 నాటౌట్‌; 12 ఫోర్లు, 5 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీకి దూరమయ్యాడు. మయాంక్‌ మర్కండే (4/15) కింగ్స్‌ పతనంలో కీలకపాత్ర పోషించాడు. అనంతరం సన్‌రైజర్స్‌ 17.1 ఓవర్లలో 2 వికెట్లకు 145 పరుగులు చేసి గెలిచింది. రాహుల్‌ త్రిపాఠి (48 బంతుల్లో 74 నాటౌట్‌; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెపె్టన్‌ మార్క్‌రమ్‌ (21 బంతుల్లో 37 నాటౌట్‌; 6 ఫోర్లు) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 52 బంతుల్లోనే 100 పరుగులు జోడించారు.  

శిఖర్‌ మినహా... 
ఒక ఎండ్‌లో ధావన్‌ పట్టుదలగా చివరి వరకు  నిలబడగా, మరో ఎండ్‌ నుంచి కనీసం సహకారం లేకపోవడంతో పంజాబ్‌ భారీ స్కోరు సాధించలేకపోయింది. ఇన్నింగ్స్‌ తొలి బంతికి ప్రభ్‌సిమ్రన్‌ (0)ను అవుట్‌ చేసి భువనేశ్వర్‌ మొదటి దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత జాన్సెన్‌ తన వరుస ఓవర్లలో మాథ్యూ షార్ట్‌ (1), జితేశ్‌ శర్మ (4)లను అవుట్‌ చేయడంతో జట్టు 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. స్యామ్‌ కరన్‌ (15 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కొద్దిసేపు ధావన్‌కు అండగా నిలిచాడు. అయితే ఆ తర్వాత పంజాబ్‌ టపటపా వికెట్లు కోల్పోయింది. 35 పరుగుల వ్యవధిలో ఆ జట్టు 6 వికెట్లు చేజార్చుకుంది. 

దాంతో స్కోరు 88/9 వద్ద 
నిలిచింది. పంజాబ్‌ 100 పరుగులు చేయడం కూడా సందేహంగానే అనిపించింది. అయితే ఈ దశలో ధావన్‌ తను అనుభవాన్నంతా రంగరించి బాధ్యతను తీసుకున్నాడు. ఈ సమయంలో ధావన్‌ 47 పరుగుల వద్ద (38 బంతుల్లో) ఉన్నాడు. ఆపై చెలరేగిపోయిన అతను తర్వాతి 28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో మరో 52 పరుగులు సాధించడం విశేషం. చివరి వికెట్‌కు ధావన్, మోహిత్‌ రాఠీ 55 పరుగులు జోడించగా, అందులో 52 ధావనే చేశాడు.  

భారీ భాగస్వామ్యం... 
ఛేదనలో రైజర్స్‌కు పెద్దగా ఇబ్బంది ఎదురు కాలేదు. ఓపెనర్లు బ్రూక్‌ (13), మయాంక్‌ అగర్వాల్‌ (21) ఫర్వాలేదనిపించడంతో పవర్‌ప్లేలో స్కోరు 34 పరుగులకు చేరింది. వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరిగినా... త్రిపాఠి, మార్క్‌రమ్‌ కలిసి సునాయాసంగా జట్టును విజయం దిశగా నడిపించారు. పంజాబ్‌ బౌలర్లు ఎంతగా శ్రమించినా ఈ జోడీని ఇబ్బంది పెట్టలేకపోయారు. వరుస ఫోర్లతో దూకుడు ప్రదర్శించిన త్రిపాఠి 35 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎలిస్‌ ఓవర్లో మార్క్‌రమ్‌ నాలుగు ఫోర్లు కొట్టడంతో హైదరాబాద్‌ గెలుపు ఖాయమైంది.  

స్కోరు వివరాలు
పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రభ్‌సిమ్రన్‌ (ఎల్బీ) (బి) భువనేశ్వర్‌ 0; ధావన్‌ (నాటౌట్‌) 99; షార్ట్‌ (ఎల్బీ) (బి) జాన్సెన్‌ 1; జితేశ్‌ (సి) మార్క్‌రమ్‌ (బి) జాన్సెన్‌ 4; కరన్‌ (సి) భువనేశ్వర్‌ (బి) మర్కండే 22; రజా (సి) మయాంక్‌ (బి) ఉమ్రాన్‌ 5; షారుఖ్‌ (ఎల్బీ) (బి) మర్కండే 4; హర్‌ప్రీత్‌ (బి) ఉమ్రాన్‌ 1; చహర్‌ (ఎల్బీ) (బి) మర్కండే 0; ఎలిస్‌ (బి) మర్కండే 0; రాఠీ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు 143). వికెట్ల పతనం: 1–0, 2–10, 3–22, 4–63, 5–69, 6–74, 7–77, 8–78, 9–88. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–33–1, జాన్సెన్‌ 3–1–16–2, నటరాజన్‌ 4–0–40–0, సుందర్‌ 1–0–6–0, మర్కండే 4–0–15–4, ఉమ్రాన్‌ 4–0–32–2.  
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: బ్రూక్‌ (బి) అర్ష్ దీప్‌ 13; మయాంక్‌ (సి) కరన్‌ (బి) చహర్‌ 21; త్రిపాఠి (నాటౌట్‌) 74; మార్క్‌రమ్‌ (నాటౌట్‌) 37; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (17.1 ఓవర్లలో 2 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1–27, 2–45. బౌలింగ్‌: స్యామ్‌ కరన్‌ 3–0–14–0, అర్ష్ దీప్‌ 3–0–20–1, హర్‌ప్రీత్‌ 3.1–0–26–0, ఎలిస్‌ 3–0–28–0, రాహుల్‌ చహర్‌ 3–0–28–1, రాఠీ 2–0–29–0.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top