IPL 2022 SRH- Simon Katich: మొన్ననే సంతోషంగా ఉందన్నాడు.. ఇంతలోనే ఏమైందో! కారణం ఆమేనా?

IPL 2022: Simon Katich Quits SRH Reports Old Video Goes Viral - Sakshi

IPL 2022 SRH- Simon Katich:- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ఐపీఎల్‌-2021 సీజన్‌లో దారుణ ప్రదర్శన... 2016లో జట్టుకు టైటిల్‌ అందించిన కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌కు ఉద్వాసన.. తుది జట్టులో కూడా చోటు కల్పించలేదు... మెగా వేలం నేపథ్యంలో వార్నర్‌ సహా స్టార్‌ ప్లేయర్‌ రషీద్‌ ఖాన్‌ను రిటైన్‌ చేసుకోలేదు.. ఇక కోచ్‌ల విషయానికొస్తే... అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కోచ్‌గా పేరున్న ట్రెవర్‌ బేలిస్‌... అసిస్టెంట్‌ కోచ్‌ పనిచేసిన బ్రాడ్‌ హాడిన్‌ సైతం గత సీజన్‌లో తమ పదవుల నుంచి తప్పుకొన్నారు. పేలవ ప్రదర్శనకు తోడు వార్నర్‌, రషీద్‌ లాంటి స్టార్‌ ప్లేయర్లను వదులుకున్న క్రమంలో ఐపీఎల్‌-2022 సీజన్‌ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ కొత్త సిబ్బందితో ముందుకు వచ్చింది.

టామ్‌ మూడీ తిరిగి హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టగా... రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు హెడ్‌ కోచ్‌గా పనిచేసిన సైమన్‌ కటిచ్‌ను అసిస్టెంట్‌ కోచ్‌గా నియమించింది. ఇక విండీస్‌ దిగ్గజం బ్రియన్‌ లారా, డేల్‌ స్టెయిన్‌, ముత్తయ్య మురళీధరన్‌, హేమంగ్‌ బదానీని తమ సిబ్బందిలో చేర్చుకుంది. అయితే, ఐపీఎల్‌ మెగా వేలానికి ముందుగా రచించిన ప్రణాళికలను అమలు చేయకుండా భిన్నంగా వ్యవహరించారంటూ అసిస్టెంట్‌ కోచ్‌ సైమన్‌ కటిచ్‌ రాజీనామా చేశారన్న వార్త సంచలనంగా మారింది. సన్‌రైజర్స్‌ యాజమాన్యం తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదన్న ఆరోపణలతో ఆయన పదవి నుంచి వైదొలిగినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ క్రమంలో.. వేలం నేపథ్యంలో సన్‌రైజర్స్‌ విడుదల చేసిన సైమన్‌ కటిచ్‌ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో కటిచ్‌.. దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఎయిడెన్‌ మార్కరమ్‌, మార్కో జాన్సెన్‌ను ఎంపిక చేయడం వెనుక కారణాలు వివరించాడు. ‘‘గత సీజన్‌లో పంజాబ్‌కు ఆడిన ఎయిడెన్‌ మార్కరమ్‌.. రెండేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లోనూ మెరుగ్గా రాణిస్తున్నాడు.  అందుకే అతడిని తీసుకున్నాం. తను మంచి ఆల్‌రౌండ్‌ ఆప్షన్‌. ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌ కూడా చేయగలడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయగలడు. 

అదే విధంగా మార్కో జాన్సెన్‌.. గతంలో ముంబైకి ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తన ప్రదర్శన బాగుంది. వీళ్లిద్దరినీ జట్టులోకి తీసుకోవడం పట్ల సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చాడు. ఇంతలోనే ఇలా ఫ్రాంఛైజీని వీడుతున్నట్లు వార్తలు రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో... ‘‘కొత్త తెలుగు ఆటగాడు కూడా లేడు. పైగా ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా నామ్‌ కే వాస్తే అన్నట్లుగానే ఆడేవాళ్లు... అసలు ఓపెనింగ్‌ జోడీ ఎలా సెట్‌ చేస్తారో తెలియదు. బహుశా కావ్య సెలక్షన్‌ నచ్చలేదేమో! అందుకే కటిచ్‌ రాజీనామా చేసి ఉంటాడు’’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ అయిన సైమన్‌ కటిచ్‌ దేశం తరఫున 56 టెస్టులు, 45 వన్డేలు, మూడు టీ20లు ఆడాడు.

ఎస్‌ఆర్‌హెచ్‌- మెగా వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: 
నికోలస్‌ పూరన్‌(10.75 కోట్లు)
వాషింగ్టన్‌ సుందర్‌(8.75 కోట్లు)
రాహుల్‌ త్రిపాఠి(8.5 కోట్లు)
రొమారియో షెపర్డ్‌(7.7 కోట్లు)
అభిషేక్‌ శర్మ(6.5 కోట్లు)
భువనేశ్వర్‌ కుమార్‌(4.2 కోట్లు)
మార్కో జన్సెన్‌(4.2 కోట్లు)
టి నటరాజన్‌(4 కోట్లు)
కార్తీక్‌ త్యాగి(4 కోట్లు)
ఎయిడెన్‌ మార్క్రమ్‌(2.6 కోట్లు)
సీన్‌ అబాట్‌(2.4 కోట్లు)
గ్లెన్‌ ఫిలిప్‌(1.5 కోట్లు)
శ్రేయస్‌ గోపాల్‌(75 లక్షలు)
విష్ణు వినోద్‌(50 లక్షలు)
ఫజల్‌ హక్‌ ఫారుఖి(50 లక్షలు)
జె సుచిత్‌(20 లక్షలు)
ప్రియమ్‌ గార్గ్‌(20 లక్షలు)
ఆర్‌ సమర్థ్‌(20 లక్షలు)
శశాంక్‌ సింగ్‌(20 లక్షలు)
సౌరభ్‌ దూబే(20 లక్షలు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top