గుజరాత్‌ ఘనంగా... | IPL 2022: Gujarat Titans beat Royal Challengers Bangalore by 6 wickets | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ ఘనంగా...

May 1 2022 5:21 AM | Updated on May 1 2022 5:22 AM

IPL 2022: Gujarat Titans beat Royal Challengers Bangalore by 6 wickets - Sakshi

పటిదార్, కోహ్లి

ముంబై: ఐపీఎల్‌ మొదలైన నాటి నుంచి ఏ సీజన్‌లో కూడా ఏ జట్టయిన ఆడిన తొలి 9 మ్యాచ్‌లలో 8 విజయాలు సాధించలేదు! కానీ తొలిసారి గుజరాత్‌ టైటాన్స్‌ దానిని చేసి చూపించింది. మరోసారి సమష్టి ప్రదర్శనతో చక్కటి ఆటతీరు కనబర్చిన గుజరాత్‌ వరుసగా ఐదో విజయాన్ని అందుకుంది. తొలి మూడు మ్యాచ్‌లు గెలిచాక సన్‌రైజర్స్‌ చేతిలో ఓడిన టీమ్‌ ఆ తర్వాత మళ్లీ ఓటమి రుచి చూడకుండా సత్తా చాటుతూ ఇప్పుడు 8వ గెలుపును తమ ఖాతాలో వేసుకొని ‘ప్లే ఆఫ్స్‌’ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది.

శనివారం జరిగిన పోరులో టైటాన్స్‌ 6 వికెట్ల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)ను ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. వరుస వైఫల్యాలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ కోహ్లి (53 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించగా, రజత్‌ పటిదార్‌ (32 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా ఆకట్టుకున్నాడు.

మ్యాక్స్‌వెల్‌ (18 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. అనంతరం టైటా న్స్‌ 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రాహుల్‌ తెవా టియా (25 బంతుల్లో 43 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), డేవిడ్‌ మిల్లర్‌ (24 బంతుల్లో 39 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌), శుబ్‌మన్‌ గిల్‌ (28 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.

కోహ్లి అర్ధ సెంచరీ...
నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడిన ప్రదీప్‌ సాంగ్వాన్‌ తన తొలి ఓవర్లోనే డుప్లెసిస్‌ (0)ను వెనక్కి పంపాడు. ఈ దశలో కోహ్లి, పటిదార్‌ రెండో వికెట్‌కు 99 పరుగులు (74 బంతుల్లో) జోడించి జట్టును ఆదుకున్నారు. ఒత్తిడిలో ఉన్న కోహ్లికంటే పటిదార్‌ స్వేచ్ఛగా, వేగంగా ఆడాడు. ఈ క్రమంలో 45 బంతుల్లో కోహ్లి, 29 బంతుల్లో పటిదార్‌ అర్ధ సెంచరీలు పూర్తయ్యాయి. వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరగ్గా... షమీ ఓవర్లో రెండు సిక్స్‌లతో మ్యాక్స్‌వెల్‌ దూకుడు ప్రదర్శించాడు.  

రాణించిన ఓపెనర్లు...
ఛేదనలో గుజరాత్‌కు శుభారంభం లభించింది. వృద్ధిమాన్‌ సాహా (22 బంతుల్లో 29; 4 ఫోర్లు), గిల్‌ కలిసి తొలి వికెట్‌కు 45 బంతుల్లో 51 పరుగులు జోడించారు. అయితే బెంగళూరు బౌలర్లు రాణించడంతో తక్కువ వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయిన గుజరాత్‌ స్కోరు 95/4 వద్ద నిలిచింది. 43 బంతుల్లో 76 పరుగులు చేయాల్సిన ఈ స్థితిలో ఆర్‌సీబీ గెలుపుపై కన్నేసింది. అయితే ధాటిగా ఆడిన మిల్లర్, తెవాటియా ఆ అవకాశం ఇవ్వలేదు. ఒత్తిడిలోనూ తగ్గకుండా చక్కటి షాట్లతో ఈ ద్వయం 40 బంతుల్లోనే అభేద్యంగా 79 పరుగులు జోడించి మరో 3 బంతులు మిగిలి ఉండగానే గుజరాత్‌ను గెలిపించింది. ఈ భాగస్వామ్యంలో వీరిద్దరు కలిసి 9 ఫోర్లు, 3 సిక్సర్లు బాదడం విశేషం.

స్కోరు వివరాలు
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (బి) షమీ 58; డుప్లెసిస్‌ (సి) సాహా (బి) సాంగ్వాన్‌ 0; పటిదార్‌ (సి) గిల్‌ (బి) సాంగ్వాన్‌ 52; మ్యాక్స్‌వెల్‌ (సి) రషీద్‌ (బి) ఫెర్గూసన్‌ 33; దినేశ్‌ కార్తీక్‌ (సి) షమీ (బి) రషీద్‌ 2; షహబాజ్‌ (నాటౌట్‌) 2; లోమ్రోర్‌ (సి) మిల్లర్‌ (బి) జోసెఫ్‌ 16; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 170.
వికెట్ల పతనం: 1–11, 2–110, 3–129, 4–138, 5–150, 6–170.
బౌలింగ్‌: షమీ 4–0–39–1, సాంగ్వాన్‌ 4–0–19–2, జోసెఫ్‌ 4–0–42–1, రషీద్‌ 4–0–29–1, ఫెర్గూసన్‌ 4–0–36–1.

గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాహా (సి) పటిదార్‌ (బి) హసరంగ 29; గిల్‌ (ఎల్బీ) (బి) షహబాజ్‌ 31; సుదర్శన్‌ (సి) (సబ్‌) రావత్‌ (బి) హసరంగ 20; హార్దిక్‌ (సి) లోమ్రోర్‌ (బి) షహబాజ్‌ 3; మిల్లర్‌ (నాటౌట్‌) 39; తెవాటియా (నాటౌట్‌) 43; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.3 ఓవర్లలో 4 వికెట్లకు) 174.  
వికెట్ల పతనం: 1–51, 2–68, 3–78, 4–95.
బౌలింగ్‌: మ్యాక్స్‌వెల్‌ 1–0–10–0, సిరాజ్‌ 4–0–35–0, హాజల్‌వుడ్‌ 3.3–0–36–0, షహబాజ్‌ 3–0–26–2, హర్షల్‌ 4–0–35–0, హసరంగ 4–0–28–2.

ఐపీఎల్‌లో నేడు
ఢిల్లీ క్యాపిటల్స్‌ X లక్నో సూపర్‌ జెయింట్స్‌
వేదిక: ముంబై, మధ్యాహ్నం గం. 3:30 నుంచి
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ X చెన్నై సూపర్‌ కింగ్స్‌
వేదిక: పుణే, రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement