గిల్‌ గెలిపించాడు...

IPL 2022: Gujarat Titans beat Delhi Capitals by 14 runs - Sakshi

గుజరాత్‌ టైటాన్స్‌కు వరుసగా రెండో విజయం

14 పరుగులతో ఢిల్లీ పరాజయం

శుబ్‌మన్‌ గిల్‌ అర్ధసెంచరీ

ఫెర్గూసన్‌కు 4 వికెట్లు

పుణే: ఐపీఎల్‌లో కొత్త టీమ్‌ గుజరాత్‌ టైటాన్స్‌ మరో విజయంతో సత్తా చాటింది. శనివారం జరిగిన పోరులో టైటాన్స్‌ 14 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. శుబ్‌మన్‌ గిల్‌ (46 బంతుల్లో 84; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చగా... కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (27 బంతుల్లో 31; 4 ఫోర్లు) రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో ముస్తఫిజుర్‌ రహమాన్‌ 3, ఖలీల్‌ అహ్మద్‌ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులు చేసి ఓడిపోయింది. కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (29 బంతుల్లో 43; 7 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ లోకీ ఫెర్గూసన్‌ (4/28) నాలుగు వికెట్లతో క్యాపిటల్స్‌ పని పట్టగా, షమీకి 2 వికెట్లు దక్కాయి.  

గుజరాత్‌ బ్యాటింగ్‌లో గిల్‌ ఇన్నింగ్సే హైలైట్‌గా నిలిచింది. ప్రతీ బౌలర్‌ను సమర్థంగా ఎదుర్కొని పరుగులు రాబట్టిన అతను 32 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అక్షర్‌ పటేల్‌ ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో దూకుడు కనబర్చిన గిల్‌... ఖలీల్‌ ఓవర్లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి సెంచరీ అవకాశం చేజార్చుకున్నాడు. తొలి 10 ఓవర్లలో 66 పరుగులే చేయగలిగిన గుజరాత్‌... తర్వాతి 10 ఓవర్లలో 105 పరుగులు రాబట్టింది. అనంతరం హార్దిక్‌ తొలి బంతికే సీఫెర్ట్‌ (3) వికెట్‌ తీసి ఢిల్లీని దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత ఫెర్గూసన్‌ ఒకే ఓవర్లో పృథ్వీ షా (10), మన్‌దీప్‌ (18)లను అవుట్‌ చేయడంతో ఢిల్లీ కష్టాలు పెరిగాయి. ఈ దశలో లలిత్‌ యాదవ్‌ (22 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్‌),  పంత్‌ కలిసి జట్టు ఇన్నింగ్స్‌ను నడిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 41 బంతుల్లోనే 61 పరుగులు జోడించారు. అయితే లలిత్‌ అనూహ్యంగా రనౌట్‌ కావడంతో క్యాపిటల్స్‌ పతనం మొదలైంది. 6 ఓవర్లలో 54 పరుగులు చేయాల్సిన స్థితిలో పంత్‌ వెనుదిరగడంతో ఢిల్లీ గెలుపుపై ఆశలు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన అక్షర్‌ పటేల్, శార్దుల్‌ కూడా  అవుటవ్వ డంతో ఢిల్లీ లక్ష్యానికి దూరంగా నిలిచింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top