IPL 2022 DC Vs PBKS: ఢిల్లీ అలవోకగా...

IPL 2022: Delhi Capitals beat Punjab Kings by nine wickets - Sakshi

పంజాబ్‌పై 9 వికెట్లతో సునాయాస విజయం

రాణించిన క్యాపిటల్స్‌ బౌలర్లు

వార్నర్‌ అర్ధ సెంచరీ

ముంబై: గత మ్యాచ్‌లో భారీ స్కోరుతో కోల్‌కతాను చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈసారి బౌలర్ల ప్రదర్శనతో మరో కీలక విజయాన్ని అందుకుంది. బుధవారం జరిగిన పోరులో క్యాపిటల్స్‌ 9 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించింది. ముందుగా పంజాబ్‌ 20 ఓవర్లలో 115 పరుగులకే కుప్పకూలింది. ఈ సీజన్‌లో ఏ జట్టుకైనా ఇదే అత్యల్ప స్కోరు.  ఢిల్లీ బౌలర్లు కుల్దీప్‌ యాదవ్‌ (2/24), ఖలీల్‌ అహ్మద్‌ (2/21), అక్షర్‌ పటేల్‌ (2/10), లలిత్‌ యాదవ్‌ (2/11) పంజాబ్‌ను దెబ్బ తీశారు.

పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో జితేశ్‌ శర్మ (23 బంతుల్లో 32; 5 ఫోర్లు) జట్టు టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం ఢిల్లీ 10.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 119 పరుగులు చేసింది. వార్నర్‌ (30 బంతుల్లో 60 నాటౌట్‌; 10 ఫోర్లు, 1 సిక్స్‌), పృథ్వీ షా (20 బంతుల్లో 41; 7 ఫోర్లు, 1 సిక్స్‌) తొలి వికెట్‌కు 39 బంతుల్లోనే 83 పరుగులు జోడించి జట్టు విజ యాన్ని సునాయాసం చేశారు. మరో 57 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. కుల్దీప్‌ కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

రాణించిన జితేశ్‌...
ఓపెనర్‌గా మయాంక్‌ అగర్వాల్‌ (15 బంతుల్లో 24; 4 ఫోర్లు), మిడిలార్డర్‌లో జితేశ్‌ మినహా పంజాబ్‌ బ్యాటింగ్‌ అంతా పేలవంగా సాగింది. శార్దుల్‌ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి దూకుడు ప్రదర్శించిన మయాంక్‌ను ముస్తఫిజుర్‌ క్లీన్‌బౌల్డ్‌ చేయగా, అంతకుముందు ఓవర్లోనే ధావన్‌ (9) అవుటయ్యాడు. లివింగ్‌స్టోన్‌ (2), బెయిర్‌స్టో (9) ఎనిమిది పరుగుల వ్యవధిలోనే వెనుదిరగడంతో పంజాబ్‌ కష్టాలు పెరిగాయి.

ఈ దశలోనే జితేశ్‌ కొన్ని చక్కటి షాట్లతో జట్టును ఆదుకున్నాడు. అయితే అక్షర్‌ బౌలింగ్‌లో అతను వికెట్ల ముందు దొరికిపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. జితేశ్‌ రివ్యూ కోరినా లాభం లేకపోయింది. ఈ వికెట్‌ తర్వాత మిగిలిన 47 బంతుల్లో మరో 30 పరుగులు మాత్రమే జోడించి పంజాబ్‌ ఆఖరి ఐదు వికెట్లు కోల్పోయింది. పంజాబ్‌ ఇన్నింగ్స్‌ మొత్తం లో ఒకే ఒక సిక్స్‌ ఉండగా... అదీ 17వ ఓవర్‌ నాలుగో బంతికి (రాహుల్‌ చహర్‌ కొట్టాడు) రావడం జట్టు ఆటతీరుకు ఉదాహరణ.   

ఆడుతూ పాడుతూ...
సునాయాస లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీకి ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. పృథ్వీ షా, వార్నర్‌ పోటీపడి పరుగులు సాధించారు. తక్కువ స్కోరును కాపాడుకోలేమనే ఉదాసీనతను ఆరంభంలోనే ప్రదర్శించిన పంజాబ్‌ బౌలర్లు కూడా పేలవంగా బంతులు వేశారు. వైభవ్‌ తొలి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టగా... మరోవైపు రబడ ఓవర్లో వార్నర్‌ మూడు ఫోర్లతో చెలరేగాడు. అర్ష్‌దీప్‌ ఓవర్లోనూ 17 పరుగులు రాబట్టిన ఢిల్లీ తొలి 6 ఓవర్లలోనే 81 పరుగులు చేసేసింది.

ఐపీఎల్‌ చరిత్రలోనే ఆ జట్టుకు పవర్‌ప్లేలో ఇదే అత్యధిక స్కోరు. తర్వాతి ఓవర్లో షా అవుటైనా జట్టుపై ప్రభావం పడలేదు. మరోవైపు 26 బంతుల్లోనే వార్నర్‌ వరుసగా మూడో అర్ధ సెంచరీని అందుకున్నాడు. వార్నర్, సర్ఫరాజ్‌ (12 నాటౌట్‌) రెండో వికెట్‌కు 36 పరుగులు జోడించి మ్యాచ్‌ను ముగించారు.

ఐపీఎల్‌లో నేడు
చెన్నై సూపర్‌ కింగ్స్‌ X ముంబై ఇండియన్స్‌
వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top