IPL 2021 Second Phase: ఐపీఎల్‌ ప్యానెల్‌లో వివాదాస్పద వ్యాఖ్యాతకు నో ప్లేస్‌..

IPL 2021: Star Sports Announces Commentary Panel For UAE Leg - Sakshi

దుబాయ్‌: ఐపీఎల్​ 2021 రెండో దశలో వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్న వారి పేర్లను స్టార్​ స్పోర్ట్స్​ ఆదివారం ప్రకటించింది. ఈ జాబితాలో స్థానం ఆశించిన టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచ్‌లకు ప్రసారదారు స్టార్​ స్పోర్ట్స్​ ఎంపిక చేసిన వ్యాఖ్యాతల బృందంలో మంజ్రేకర్‌కు చోటు దక్కలేదు. దీంతో యూఏఈ వేదికగా జరగనున్న కాష్ రిష్ లీగ్‌లో పాల్గొనే అవకాశాన్ని అతను మరోసారి కోల్పోయాడు. కాగా, మంజ్రేకర్‌ తన నోటి దురుసు కారణంగా 2019లో బీసీసీఐ కామెంట్రీ ప్యానెల్‌ నుంచి తప్పించబడ్డాడు. 

మంచి క్రికెట్‌ పరిజ్ఞానం.. అంతకుమించి ఇంగ్లీష్, హిందీ భాషలు అనర్గలంగా మాట్లాడగల సత్తా ఉన్న మంజ్రేకర్‌.. చాలా సందర్భాల్లో ఆటగాళ్లు, సహచర వ్యాఖ్యాతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో చిక్కుకున్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ పొలార్డ్‌‌ని 'మతిలేని క్రికెటర్' అంటూ, 2019 వన్డే ప్రపంచకప్‌లో రవీంద్ర జడేజాను 'బిట్స్‌ అండ్‌ పీసెస్‌ క్రికెటర్‌' అంటూ సంబోధించి వివాదాలకు కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌ అయ్యాడు. ఒకానొక సందర్భంలో సహచర కామెంటేటర్ హర్షా భోగ్లేని హేళన చేస్తూ మాట్లాడినప్పుడు పెద్ద దుమారమే రేగింది. అతనికున్న నోటి దురుసు కారణంగా బీసీసీఐ వేటు వేసింది. తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరినప్పటికీ బీసీసీఐ అతడిని పరిగణలోకి తీసుకోలేదు. 

ఇదిలా ఉంటే, స్టార్​ స్పోర్ట్స్ తాజాగా ప్రకటించిన ఐపీఎల్‌ వ్యాఖ్యాతల ప్యానెల్‌లో హర్షా భోగ్లే, సునీల్​ గవాస్కర్​, నిక్​ నైట్​, లక్ష్మణ్​ శివరామకృష్ణన్​, ఇయాన్​ బిషప్(ఇంగ్లీష్‌)​ ఉన్నారు. ఇక హిందీ కామెంటేటర్స్​ ప్యానెల్​లో గౌతమ్ గంభీర్​, పార్థివ్​ పటేల్​, ఇర్ఫాన్​ పఠాన్​, ఆకాశ్​ చోప్రాలకు చోటు దక్కింది. ఇక ఇటీవల వ్యాఖ్యాతగా మారిన దినేష్ కార్తీక్ మ్యాచ్‌లు ఆడనుండడంతో అతడికి ఈ జాబితాలో చోటు దక్కలేదు. 

ఇంగ్లీష్​ కామెంటేటర్స్​ ప్యానెల్​: హర్షా భోగ్లే, సునీల్​ గావాస్కర్​, లక్ష్మణ్​ శివరామకృష్ణన్​, మురళీ కార్తిక్​, దీప్​ దాస్​గుప్తా, అంజుమ్​ చోప్రా, ఇయాన్​ బిషప్‌​, అలన్​ విల్కిన్స్​, ఎంపుమలెలో ఎంబాంగ్వా, నిక్‌​ నైట్​, డానీ మోరిసన్​, సైమన్​ డౌల్​, మ్యాథ్యూ హేడెన్​, కెవిన్​ పీటర్సన్​.

హిందీ కామెంటేటర్స్​ ప్యానెల్​: జతిన్​ సప్రు, సురెన్​ సుందరమ్​, ఆకాశ్​ చోప్రా, నిఖిల్​ చోప్రా, తన్యా పురోహిత్​, ఇర్ఫాన్​ పఠాన్, గౌతమ్​ గంభీర్​, పార్థివ్​ పటేల్​, కిరణ్​ మోరే.

చదవండి: సిరీస్‌ ఇలా ముగియడం సిగ్గుచేటు.. ఆఖరి టెస్ట్‌ రద్దుపై ఆండర్సన్‌ భావోద్వేగం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top