
రోహిత్ శర్మ.. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. హిట్‌మ్యాన్ గత 18 ఏళ్ల నుంచి ఆటగాడిగా, కెప్టెన్‌గా తన సేవలను భారత జట్టుకు అందిస్తున్నాడు. భారత్‌కు రెండు ఐసీసీ టైటిల్స్‌ను అందించిన ఘనత అతడిది.
రోహిత్ సారథ్యంలోనే టీమిండియా టీ20 వరల్డ్‌కప్-2024, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025ని సొంతం చేసుకుంది. అదేవిధంగా వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్‌గా, సింగిల్ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రోహిత్ కొనసాగుతున్నాడు.
అయితే ఇన్ని ఘనతలు సాధించిన రోహిత్.. ఇండియన్ ఆల్ టైమ్ గ్రెటెస్ట్ క్రికెటర్లలో ఒకడు కాదంట. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లిల కంటే రోహిత్ వెనకబడి ఉన్నాడని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
అయితే వైట్‌బాల్ క్రికెట్‌లో మాత్రం రోహిత్ గొప్ప ప్లేయర్ అని అతడు కొనియాడాడు. టెస్టుల్లో రోహిత్‌కు మంచి ట్రాక్ రికార్డు లేకపోవడంతో ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్ల సరసన చోటు ఇవ్వడం లేదని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ టెస్టుల్లో కేవలం 12 సెంచరీలు మాత్రమే సాధించాడు.
అందులో రెండు సెంచరీలు విదేశీ గడ్డపై వచ్చినవి. అదే టెండూల్కర్ సేనా దేశాలలో (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) 17 సెంచరీలు నమోదు చేయగా.. కోహ్లి, ద్రవిడ్ వరుసగా 12, 10 సెంచరీలు సాధించారు.
"ఆల్-టైమ్ ఇండియన్ బ్యాటింగ్ దిగ్గజాల జాబితాలోకి రోహిత్ సరిపోడు. ఎందుకంటే సచిన్, గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ వంటి దిగ్గజాలతో పోలిస్తే రోహిత్ వెనకబడి ఉన్నాడు. రోహిత్ వారి స్ధాయికి చేరుకోలేకపోయాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్ అద్భుతమైన ప్లేయర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.
అతడు ప్రతీ జట్టుపై అధిపత్యం చెలాయించాడు. ఒక వన్డే ఇన్నింగ్స్‌లో దాదాపు మూడు వందల పరుగుల(264) వరకు సాధించాడు. కానీ ఆల్ టైమ్ గ్రేట్ జాబితా గురించి మాట్లేడప్పుడు టెస్ట్ క్రికెట్‌కు ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. రెడ్ బాల్ ఫార్మాట్‌లో రోహిత్ తన మార్క్ చూపించలేకపోయాడు.
వైట్ బాల్ క్రికెట్ గ్రేట్..
అయితే భారత క్రికెట్‌లో స్వార్ధం లేని ఆటగాళ్ల లిస్ట్‌లో రోహిత్ ముందుంజలో ఉంటాడు. అంతే కాకుండా అతడి కెప్టెన్సీ కూడా గురుంచి కూడా మాట్లాడుకోవాలి. నిజంగా అతడొక అద్బుతమైన నాయకుడు. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత అతడిపై గౌరవం, ప్రేమ మరింత పెరిగిపోయింది. జట్టు కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. సెల్ప్‌లెస్ క్రికెటర్. వన్డే క్రికెట్‌లో అతడొక లెజెండ్ అని దూరదర్శన్ ది గ్రేట్ ఇండియన్ క్రికెట్ షోలో పేర్కొన్నాడు.
చదవండి: మైదానంలో వాళ్లను ఆపను.. ఈసారి ఫేవరెట్ జట్టు ఏదీ లేదు: పాక్ కెప్టెన్