
టీమిండియాకు ఎంతో మంది ఇప్పటి వరకు కెప్టెన్లుగా పనిచేశారు. అయితే, వీరిలో ప్రపంచకప్ టైటిల్స్ అందించిన సారథులు మాత్రం ప్రత్యేకం. 1983లో కపిల్ దేవ్ (Kapil Dev) తొలిసారి భారత్‌ను వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో గెలిపించి ఐసీసీ ట్రోఫీని అందించగా.. 2007లో మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) తొట్టతొలి టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాను చాంపియన్‌గా నిలిపాడు.
జట్టు పరివర్తన దశలో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న ధోని.. 2011లో సొంతగడ్డపై భారత్‌కు వన్డే వరల్డ్‌కప్ కూడా అందించాడు. ఆ తర్వాత రెండేళ్లకు అంటే.. 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కూడా గెలిచాడు.
ఇక ధోని తర్వాత మళ్లీ రోహిత్ శర్మ (Rohit Sharma) భారత్‌కు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్‌గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్-2024తో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ట్రోఫీని రోహిత్ సేన గెలిచింది. ఇలా ఈ ముగ్గురు మేజర్ టైటిళ్లు గెలిచినా.. ధోని మాత్రం మూడు ట్రోఫీలతో వీరిద్దరి కంటే ఓ అడుగు ముందే ఉన్నాడు.
అత్యుత్తమ కెప్టెన్ ధోని
ఈ నేపథ్యంలో ధోనిని ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘పాత రోజుల్లో ఇమ్రాన్ ఖాన్ (పాకిస్తాన్).. అతడి తర్వాత అత్యుత్తమ కెప్టెన్ అంటే మహేంద్ర సింగ్ ధోని. సారథిగా తానెంత చేయగలడో అంతా చేశాడు.
అంతా తానై ముందుండి నడిపించాడు. ఒంటిచేత్తో భారాన్ని మోశాడు. అనుభవం లేని.. ఓ సాధారణ జట్టును ప్రపంచకప్ విజేతగా నిలిపాడు. అందుకు టీ20 ప్రపంచకప్-2007 చక్కటి ఉదాహరణ.
అందరికీ ఇది సాధ్యం కాదు
ముఖ్యంగా మెగా టోర్నీ ఫైనల్స్‌లో అతడి ఆత్మవిశ్వాసం చూస్తే ముచ్చటేసేది. సాధారణ లీగ్ మ్యాచ్‌లాగే ఫైనల్లోనూ కూల్‌గా పనిచేసుకుంటూ పోతాడు. అందరికీ ఇది సాధ్యం కాదు. ఆటగాళ్లలోని అత్యుత్తమ ప్రతిభను వెలికితీసి సునాయాసంగా గెలిచేస్తాడు.
కీలక సమయాల్లో రాణించగల ఆటగాళ్లు దొరుకుతూనే ఉంటారు. కానీ వారి సేవలను సద్వినియోగం చేసుకోగల కెప్టెన్లు అరుదు. అందుకే నా దృష్టిలో ఎంఎస్ అత్యుత్తమ, విభిన్న కెప్టెన్’’ అని సంజయ్ మంజ్రేకర్ స్టాలిన్ మథియాస్ పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నాడు.
చదవండి: ఆ మాటతో నా మనసు ముక్కలు.. పాత గాయాన్ని మళ్లీ రేపాడు.. షాకింగ్ వీడియో