
భారత్‌లో మెగా టీ20 క్రికెట్ లీగ్ 2008లో పురుడుపోసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పేరుతో మొదలై.. పద్దెనిమిదేళ్లుగా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపిస్తూ క్యాష్ రిచ్ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్.. ఎంతో మంది దేశీ, విదేశీ ఆటగాళ్ల ప్రతిభకు వేదికై.. అంతర్జాతీయ స్థాయికి చేరుకునే వీలు కల్పించింది.
ఈ మెగా లీగ్ వ్యవస్థాపకుడు, తొలి చైర్మన్ లలిత్ మోదీ (Lalit Modi). మనీలాండరింగ్ కేసులో బుక్కైన ఈ వ్యాపారవేత్త ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్నాడు. తాజాగా అతడు ఓ షాకింగ్ వీడియో విడుదల చేశాడు. ఐపీఎల్ చరిత్రలో మచ్చలా మిగిలిపోయిన ‘‘స్లాప్‌గేట్’’కు సంబంధించిన దృశ్యాలను బయటపెట్టాడు.
శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టిన భజ్జీ
ఐపీఎల్ అరంగేట్ర సీజన్ 2008లో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. మరోవైపు.. భారత మాజీ పేసర్ శ్రీశాంత్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్)కు ఆడేవాడు. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య నాడు మ్యాచ్ ముగిసిన తర్వాత.. ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో భజ్జీ.. శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టాడు.
ఇరువురి మధ్య వాగ్వాదం తలెత్తిన క్రమంలో భజ్జీ ఈపని చేయగా.. తదుపరి మ్యాచ్‌లలో ఆడకుండా అతడిపై నిషేధం పడింది. ఇక లలిత్ మోదీ తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ పాడ్‌కాస్ట్ సందర్భంగా భజ్జీ- శ్రీశాంత్‌ను కొట్టిన వీడియోను విడుదల చేశాడు.
‘‘ఆరోజు మ్యాచ్ ముగిసింది. కెమెరాలన్నీ ఆఫ్ చేశారు. అయితే, నా దగ్గర ఉన్న సెక్యూరిటీ కెమెరా మాత్రం ఆన్‌లో ఉంది. శ్రీశాంత్, భజ్జీ మధ్య జరిగిన ఘటన అందులో రికార్డైంది. ఇదిగో ఇదే ఆ వీడియో. చాలా కాలంగా నేను దీనిని దాచి ఉంచాను’’ అని లలిత్ మోదీ పేర్కొన్నాడు.
నన్ను నేనే క్షమించుకోలేను
కాగా శ్రీశాంత్‌ను చెంపదెబ్బకొట్టడం గురించి భజ్జీ ఇటీవల పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. రవిచంద్రన్ అశ్విన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్ నుంచి దేన్నైనా తొలగించుకునే అవకాశం వస్తే.. దానిని లిస్టు నుంచి తుడిచేస్తా. ఆరోజు నేను అలా చేయకుండా ఉండాల్సింది.
ఇప్పటికి 200 సార్లు క్షమాపణ చెప్పి ఉంటా. అవకాశం దొరికినప్పుడల్లా ఏ వేదిక మీదైనా సరే సారీ చెబుతూనే ఉన్నా. నిజంగా ఆరోజు నేను తప్పుచేశాను. ఆరోజు కంటే నేను హర్ట్ అయిన విషయం మరొకటి ఉంది.
కొన్నేళ్ల క్రితం శ్రీశాంత్ కూతురిని నేను కలిశాను. ఆమెతో ప్రేమగా మాట్లాడుతూ ఉండగా.. ‘నేను నీతో మాట్లాడను. నువ్వు మా నాన్నను కొట్టావు’ అంది. ఆ మాటతో నా మనసు ముక్కలైపోయింది. ఆ చిన్నారి మనసులో నాపై అలాంటి ముద్ర ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయాను.
తన తండ్రిని చెంపదెబ్బ కొట్టిన వ్యక్తిగా మాత్రమే తను నన్ను గుర్తుపెట్టుకుంటుంది. ఆమెకు కూడా క్షమాపణలు చెప్పాను’’ అంటూ హర్భజన్ సింగ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. అయితే, లలిత్ మోదీ మాత్రం పాత గాయాన్ని రేపుతూ వీడియోను బయటకు తేవడం గమనార్హం.
చదవండి: భారత క్రికెట్‌లో అనూహ్య పరిణామం.. బీసీసీఐ అధ్యక్షుడి రాజీనామా