IPL 2021: కెప్టెన్సీ నుంచి తొలగించినా వార్నర్‌ మాత్రం..

IPL 2021 SRH Brad Haddin Says How David Warner Handle Loss Captaincy - Sakshi

సిడ్నీ: క్లిష్ట పరిస్థితుల్లోనూ డేవిడ్‌ వార్నర్‌ ఏమాత్రం సహనం కోల్పోకుండా ఎంతో హుందాగా వ్యవహరించాడని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అసిస్టెంట్‌ కోచ్‌ బ్రాడ్‌ హాడిన్‌ అన్నాడు. తనపై వేటు పడినా జట్టు ప్రయోజనాల గురించే ఆలోచించాడని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2021 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ వరుస పరాజయాల నేపథ్యంలో వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో కేన్‌ విలియమ్సన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించిన యాజమాన్యం... ఈ సీజన్‌లో హైదరాబాద్‌ చివరగా ఆడిన మ్యాచ్‌లో తుదిజట్టులో కూడా అతడికి స్థానం కల్పించలేదు. 

దీంతో, బెంచ్‌కే పరిమితమైన వార్నర్‌.. 12వ ఆటగాడిగా డ్రింక్స్‌  మోయడానికే పరిమితమయ్యాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులకు ఈ విషయం అస్సలు మింగుడుపడలేదు. జట్టుకు తొలి ఐపీఎల్‌ కప్‌ సాధించి పెట్టిన కెప్టెన్‌కు ఇంతటి అవమానమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, వార్నర్‌ మాత్రం ఈ విషయంపై ఒక్కసారి కూడా కామెంట్‌ చేయలేదు. అంతేకాదు డగౌట్‌లో కూర్చుని జట్టును ఉత్సాహపరుస్తూ తన అవసరం ఉన్నప్పుడల్లా సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఆసీస్‌ మాజీ ఆటగాడు బ్రాడ్‌ హాడిన్‌ మాట్లాడుతూ.. ‘‘వార్నర్‌ను తొలగించడం పట్ల ప్రతి ఒక్కరు షాక్‌కు గురయ్యారు. కానీ తను మాత్రం ఎంతో హుందాగా వ్యవహరించాడు. నిజానికి వరుస ఓటముల నేపథ్యంలో జట్టులో మార్పులు చేయాలని భావించింది.

ప్రమాణాలకు తగ్గట్టుగా ఆడటం లేదని కఠిన చర్యలు చేపట్టింది. ఈ విషయాలను డేవీ అర్థం చేసుకున్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో తను ఒకడు. బెంచ్‌ మీద కూర్చోవాల్సి వచ్చినా తనేమీ బాధపడలేదు. ప్రతి ఒక్కరికి సలహాలు ఇచ్చాడు. డ్రింక్స్‌ మోసుకుంటూ పరుగులు తీశాడు. జట్టు సమావేశాల్లో కూడా తన గొంతు బలంగా వినిపించేవాడు. కఠిన పరిస్థితులను అతడు డీల్‌ చేసిన విధానం అమోఘం’’ అంటూ వార్నర్‌ వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపించాడు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్‌-2021 వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌ ఆరింటిలో ఓడిపోయి అభిమానులను నిరాశపరిచింది.

చదవండి: BAN Vs SL: శ్రీలంక కొత్త కెప్టెన్‌గా కుశాల్‌ పెరీరా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top