నాకు విసుగు తెప్పించారు: వార్నర్‌

IPL 2021: Found A Lot Of Fielders And I Got Frustrated, Warner - Sakshi

ఢిల్లీ: సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో తమ జట్టు ఓటమిలో తాను పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్లు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ స్పష్టం చేశాడు. ఈ వికెట్‌ చాలా స్లోగా ఉందన్న వార్నర్‌.. సీఎస్‌కే ఫీల్డర్లు తనను పదే పదే విసిగించారన్నాడు. తాను బహుశా 15 షాట్లను ఫీల్డర్లు ఉన్న ఏరియాలోకే కొట్టానని, దాంతోనే జట్టు కోసం ఇంకా అదనంగా ఏమీ చేయలేకపోయానన్నాడు. తాను షాట్‌ కొట్టడం అక్కడ ఫీల్డర్‌ ఉండటం తనకు విసుగుపుట్టించిందన్నాడు.

మ్యాచ్‌ తర్వాత అవార్డుల కార్యక్రమంలో వార్నర్‌ మాట్లాడుతూ.. ‘మేము 171 పరుగులు చేశాం. కానీ పవర్‌ ప్లేలో వికెట్లు తీయలేకపోయాం. ఈ తరహా వికెట్‌పై పవర్‌ ప్లేలో వికెట్లు తీయకపోతే లక్ష్యాన్ని కాపాడుకోవడం కష్టంగానే ఉంటుంది. ఆ జట్టు ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. వారి వికెట్లు పడేటప్పటికే వారు పైచేయి సాధించారు. మా జట్టులో మనీష్‌ పాండే సొగసైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక కేన్‌ విలియమ్సన్‌ చివర్లో ధాటిగా ఆడటంతో మంచి స్కోరు చేయగలిగాం. కేన్‌ నాల్గో స్థానంలో బ్యాటింగ్‌ రావడంలో ఎటువంటి సమస్య లేదు. అతను ఎక్కడైనా బ్యాటింగ్‌ చేయగలడు. ఇది మంచి బ్యాటింగ్‌ వికెట్‌. ఇది. మా బ్యాటింగ్‌ లోటును పూడ్చుకోవాలి. మేము పోరాట యోధులం. తిరిగి పుంజుకుంటాం. ఈ మ్యాచ్‌లో ఓటమి మా జట్టులోని సభ్యుల్ని గాయపరిచి ఉంటుంది’ అని తెలిపాడు. 

సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ముందుగా బ్యాటింగ్‌ చేసి 172 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. వార్నర్‌ (57; 55 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు),  మనీష్‌ పాండే (61; 46 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీలు సాధించగా, విలియమ్సన్‌ (26 నాటౌట్‌; 10 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) బ్యాట్‌ ఝుళిపించాడు. అనంతరం సీఎస్‌కే ఇంకా 9 బంతులు మిగిలి ఉండగా విజయాన్ని అందుకుంది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (75; 44 బంతుల్లో 12 ఫోర్లు),  డుప్లెసిస్‌ (56; 38 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించడంతో సీఎస్‌కే అవలీలగా విజయాన్ని సాధించింది. ఇది సీఎస్‌కేకు వరుసగా ఐదో విజయం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top