
పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతకం జీవితాన్ని మార్చింది
ఆర్థిక వెసులుబాటుతో పాటు భవిష్యత్తుపై భరోసా ఇచ్చింది
దాన్ని పక్కన పెట్టి మరింత మెరుగయ్యే దిశగా అడుగులు
భారత స్టార్ రెజ్లర్ అమన్ సెహ్రావత్ మనోగతం
లక్నో: గత ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో సాధించిన కాంస్య పతకం తన జీవితాన్ని సమూలంగా మార్చివేసిందని భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ అన్నాడు. అదే సమయంలో నిలకడగా రాణించాలనే బాధ్యతను పెంచిందని వెల్లడించాడు. ఒకప్పుడు ఆర్థికంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న అమన్... ఒలింపిక్స్‌లో పతకం నెగ్గిన అనంతరం డబ్బుకు కొదవ లేకుండా పోయిందని అన్నాడు.
పురుషుల 57 కేజీల విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్ ట్రయల్స్‌లో విజయం సాధించిన అనంతరం అమన్ తన సాధన తీరును వివరించాడు. విశ్వక్రీడల్లో కాంస్య పతకం గెలిచిన విషయాన్ని మరిచి ప్రపంచ చాంపియన్‌షిప్, లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో పసిడి పతకమే లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు పేర్కొన్నాడు. పారిస్ పతకంతో అమన్ జీవితంలో వచ్చిన మార్పుల వివరాలు అతడి మాటల్లోనే...
విదేశీ టోర్నీల్లో పాల్గొంటా...
ఒలింపిక్స్ తర్వాత విదేశాల్లో శిక్షణ పొందాలని అనుకున్నా... కానీ మనం కోరుకున్నవన్నీ జరగవు కదా. అదే సమయంలో గాయం కావడంతో ఇక ఆ ప్రయత్నాలు విరమించుకున్నా. పారిస్ ఒలింపిక్స్ పతకం నా భుజాలపై అదనపు భారాన్ని మోపింది. ఒకవేళ నేను పరాజయం పాలైతే... పారిస్ పతకంతో వచ్చిన కీర్తి నన్ను చెడగొట్టిందనే విమర్శలు వస్తాయనే ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి.
ఇటీవల పాల్గొన్న రెండు టోర్నీలో ఒక దాంట్లో పతకం సాధించా మరో దాంట్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయా. దాదాపు ఏడాది తర్వాత బరిలోకి దిగడం కూడా అందుకు ఒక కారణం. అయినా నా కోచ్‌లు నమ్మకాన్ని కోల్పోవద్దని సూచించారు. మరింత కఠోర సాధన చేస్తున్నా. విదేశీ రెజ్లర్లను పడగొట్టడం అంత తేలికైన పనేం కాదు. ఆ అంశంపై దృష్టి సారించా.
వచ్చే నెలలో క్రొయేషియా రాజధాని జాగ్రెబ్‌లో జరగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు సన్నద్ధమవుతున్నా. ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నా. అయితే బలమైన ప్రత్యర్థులతో తలపడాలంటే... విదేశాలకు వెళ్లక తప్పదు. రష్యా, అమెరికాలో జరిగే టోర్నమెంట్‌లలో పాల్గొని మరింత రాటుదేలాలని భావిస్తున్నా.
శ్రమకు దక్కిన ఫలితమిది
విశ్వక్రీడల్లో పతకం సాధించిన తర్వాత నా జీవితం 90 శాతం మారిపోయింది. అంతకుముందు నన్ను ఎవరూ గుర్తించేవారు కాదు. కనీసం మా పక్క వీధిలో వారికి కూడా నేనెవరో తెలియదు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. పారిస్ ప్రదర్శనతో ప్రతి ఒక్కరూ నన్ను గుర్తిస్తున్నారు, గౌరవిస్తున్నారు. అవన్నీ చూస్తుంటే... నేను దేశం కోసం ఏదో సాధించాననే సంతృప్తి కలుగుతోంది. అయితే అది ఒక్క రోజులో సాధ్యమైంది కాదు. ఏళ్ల తరబడి పడ్డ కష్టానికి దక్కిన ఫలితమది.
పారిస్ ఒలింపిక్స్‌కు ముందు పతకం సాధిస్తానని అసలు ఊహించలేదు. ఆ సమయంలో భారత మహిళా రెజ్లర్లపై ఎక్కువ అంచనాలు ఉన్నాయి. భగవంతుడి దయతో నేను పతకం సాధించగలిగా. అయితే ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు నాపై అంచనాలు ఎక్కువయ్యాయి. ఎలాంటి ఒత్తిడి లేని సమయంలో కాంస్యం గెలిచిన నేను... ఇప్పుడు స్వర్ణం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. పారిస్‌లో సాధించిన కాంస్య పతకాన్ని నా మనసులో నుంచి తీసేసి తిరిగి కఠోర సాధనపై దృష్టి పెట్టాను.
కష్టనష్టాలకు ఓర్చి...
ఒకప్పుడు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఎవరూ లేరు అనుకున్న సమయంలో బంధువుల అండతో సాధన కొనసాగించా. సోదరి గురించి ఎక్కువగా ఆలోచించేవాడిని... ఒక అన్నగా తన బాగోగులు ఎలా చూసుకోవాలని మదన పడుతుండే వాడిని. ఇప్పుడా చింత లేదు. ఆమె బంగారు భవిష్యత్తుకు కావాల్సినంత సాధించా. ఇప్పుడిక ప్రశాంతంగా ప్రాక్టీస్‌పై దృష్టి సారించొచ్చు. అయితే విజయాన్ని తలకెక్కించుకొని గతాన్ని మర్చిపోయే వ్యక్తిని కాదు నేను. అప్పటికి ఇప్పటికీ నాలో పెద్దగా మార్పు ఏమీ రాలేదు.
కాకపోతే నిర్ణయాలు తీసుకునే విషయంలో ఇప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా. ఎందుకంటే ఒలింపిక్ పతక విజేతగా ఇప్పుడు అందరి దృష్టి నాపై ఉంటుంది కాబట్టి జాగరుకత అవసరం. ఒలింపిక్స్ అనంతరం చాన్నాళ్ల వరకు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దానికి గాయంతో పాటు అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నా.