అహ్మదాబాద్‌లో డే–నైట్‌ టెస్టు

India Vs England Day-Night Test To Be Played In Ahmedabad From February 24 - Sakshi

భారత్‌లో ఇంగ్లండ్‌ పర్యటన షెడ్యూల్‌ విడుదల

4 టెస్టులు, 5 టి20లు, 3 వన్డేలు ఆడనున్న పర్యాటక జట్టు

మూడు వేదికల్లోనే మ్యాచ్‌ల నిర్వహణ

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో లభించిన సుదీర్ఘ విరామం తర్వాత వచ్చే ఏడాది భారత్‌లో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ మొదలుకానుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారత్‌లో ఇంగ్లండ్‌ జట్టు పర్యటించనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం విడుదల చేసింది.  

► ఫిబ్రవరి 5 నుంచి మార్చి 28 వరకు జరిగే ఈ సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య నాలుగు టెస్టులు, ఐదు టి20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు జరుగుతాయి.  
► కరోనా వైరస్‌ నేపథ్యంలో బయో సెక్యూర్‌ వాతావరణంలో ఈ సిరీస్‌ను నిర్వహిస్తారు. చెన్నై, అహ్మదాబాద్, పుణేలలో మ్యాచ్‌లు జరుగుతాయి. రొటేషన్‌ పాలసీలో భాగంగా చెన్నై, పుణే వేదికలను ఎంపిక చేశారు.  
► ఈ సిరీస్‌ సందర్భంగా భారత్‌ సొంతగడ్డపై రెండో డే–నైట్‌ టెస్టు (ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు) ఆడనుంది. ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం (ప్రేక్షకుల సామర్థ్యం 1,10,000) అయిన అహ్మదాబాద్‌లోని సర్దార్‌ పటేల్‌ మొతేరా స్టేడియంలో ఈ డే–నైట్‌ టెస్టును నిర్వహిస్తారు. గత ఏడాది కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో భారత్‌ తొలిసారి డే–నైట్‌ టెస్టు ఆడింది. కొత్తగా నిర్మించిన సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో డే–నైట్‌ టెస్టుతోపాటు మరో టెస్టు కూడా జరుగుతుంది. తొలి రెండు టెస్టులకు చెన్నై వేదిక కానుంది. తర్వాతి రెండు టెస్టులను అహ్మదాబాద్‌లో నిర్వహిస్తారు. టెస్టు సిరీస్‌ ముగిశాక అహ్మదాబాద్‌లోనే ఐదు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం పుణేలో మూడు వన్డేలతో పర్యటన ముగుస్తుంది.  
► శ్రీలంకతో రెండు టెస్టులు (జనవరి 14–18; జనవరి 22–26) ఆడాక ఇంగ్లండ్‌ జట్టు జనవరి 27న కొలంబో నుంచి చెన్నైకు చేరుకుంటుంది. అక్కడే వారంరోజులపాటు క్వారంటైన్‌లో ఉంటుంది. మరోవైపు భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన జనవరి 19న ముగుస్తుంది. ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి చేరుకున్నాక భారత క్రికెటర్లకు వారం రోజులపాటు విశ్రాంతి ఇవ్వనున్నారు. అనంతరం కరోనా వైరస్‌ నిర్ధారణ ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలు చేశాక వారిని చెన్నైలోని బయో బబుల్‌లోకి పంపిస్తారు.  

భారత్‌–ఇంగ్లండ్‌ సిరీస్‌ షెడ్యూల్‌
► తొలి టెస్టు: ఫిబ్రవరి 5–9 (చెన్నై)
► రెండో టెస్టు: ఫిబ్రవరి 13–17 (చెన్నై)
► మూడో టెస్టు: ఫిబ్రవరి 24–28

      
అహ్మదాబాద్‌ (డే/నైట్‌)

► నాలుగో టెస్టు: మార్చి 4–8 (అహ్మదాబాద్‌)
► తొలి టి20: మార్చి 12 (అహ్మదాబాద్‌)
► రెండో టి20: మార్చి 14 (అహ్మదాబాద్‌)
► మూడో టి20: మార్చి 16 (అహ్మదాబాద్‌)
► నాలుగో టి20: మార్చి 18 (అహ్మదాబాద్‌)
► ఐదో టి20: మార్చి 20 (అహ్మదాబాద్‌)
► తొలి వన్డే: మార్చి 23 (పుణే)
► రెండో వన్డే: మార్చి 26 (పుణే)
► మూడో వన్డే: మార్చి 28 (పుణే)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top