U-19 World Cup 2022: వ‌రుస‌గా నాలుగోసారి ఫైన‌ల్‌కు భార‌త్‌.. ఇంగ్లండ్‌తో తుది పోరు

India in Under-19 World Cup Final - Sakshi

అండర్‌–19 ప్రపంచ కప్‌ ఫైనల్లో భారత్‌

సెమీస్‌లో 96 పరుగులతో ఆసీస్‌ చిత్తు

రేపు ఇంగ్లండ్‌తో ఫైనల్‌ పోరు  

U-19 World Cup Finals: ప్రపంచ కప్‌లో యువ భారత జట్టు తమ జోరును కొనసాగించింది. టోర్నీలో వరుసగా ఐదో విజయంతో దర్జాగా ఫైనల్లోకి అడుగు పెట్టింది. 291 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా అండర్‌–19 జట్టు 41.5 ఓవర్లలో 194 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత అండర్‌–19కు 96 పరుగుల భారీ విజయం దక్కిం ది. ఆసీస్‌ బ్యాటర్లలో లచ్‌లన్‌ షా (66 బంతుల్లో 51; 4 ఫోర్లు) అర్ధ సెం చరీ సాధించగా...కోరీ మిల్లర్‌ (38), క్యాంప్‌బెల్‌ కెల్‌అవే (30) ఫర్వాలేదనిపించారు. విక్కీ ఒస్వా ల్‌ 3 వికెట్లు పడగొట్టగా...నిశాంత్‌ సింధు, రవి కుమార్‌ చెరో 2 వికెట్లు తీశారు. శనివారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్‌ తలపడుతుంది.

లచ్‌లన్‌ షా మినహా...
రెండో ఓవర్లోనే టీగ్‌ విలీ (1) వికెట్‌ తీసి రవికుమార్‌ భారత్‌కు శుభారంభం అందించాడు. ఈ దశలో కెల్‌అవే, మిల్లర్‌ ధాటిగా ఆడుతూ రెండో వికెట్‌కు 68 పరుగులు జోడించడంతో ఆసీస్‌ నిలదొక్కుకుంది. అయితే వీరిద్దరిని రెండు పరుగుల వ్యవధిలో పెవిలియన్‌ పంపించడంతో పాటు కెప్టెన్‌ కూపర్‌ కనోలీ (3)ని కూడా వెనువెంటనే అవుట్‌ చేసి భారత్‌ పట్టు బిగించింది. మరో ఎండ్‌లో లచ్‌లన్‌ షా పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. మరో 8.1 ఓవర్లు మిగిలి ఉండగానే ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. అంతకు ముందు భారత అండర్‌–19 జట్టు 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కెప్టెన్‌ యష్‌ ధుల్‌ (110 బంతుల్లో 110; 10 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ సాధించగా...వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌ (108 బంతుల్లో 94; 8 ఫోర్లు, 1 సిక్స్‌) త్రుటిలో ఆ అవకాశం చేజార్చుకున్నాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 204 పరుగులు జోడించారు.  భారత అండర్‌–19 జట్టుకు ఇది వరుసగా నాలుగో, మొత్తంగా ఎనిమిదో  ఫైనల్‌ కావడం విశేషం. మరో వైపు 1998లో ప్రపంచ కప్‌ గెలుచుకున్న అనంతరం ఇంగ్లండ్‌ ఫైనల్‌కు రావడం ఇదే మొదటి సారి.
 
భారత అండర్‌–19 జట్టు నాలుగు సార్లు ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. 2000లో (కెప్టెన్‌ మొహమ్మద్‌ కైఫ్‌), 2008లో (కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి), 2012లో (కెప్టెన్‌ ఉన్ముక్త్‌ చంద్‌), 2018 (కెప్టెన్‌ పృథ్వీ షా) జట్టు చాంపియన్‌గా నిలిచింది. మరో మూడు సార్లు (2006, 2016, 2020) ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది.   
అండర్‌–19 ప్రపంచకప్‌లో సెంచరీ సాధించిన మూడో భారత కెప్టెన్‌గా యష్‌ ధుల్‌ నిలిచాడు. గతంలో విరాట్‌ కోహ్లి (2008), ఉన్ముక్త్‌ చంద్‌ (2012) శతకాలు నమోదు చేశారు. ఈ ముగ్గురూ ఢిల్లీకి చెందినవారే కావడం విశేషం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top