IND Vs NZ: ఐదు పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు.. భారత్‌ ఘన విజయం

India Massive Win Over New Zealand In Mumbai Test - Sakshi

కేవలం 43 నిమిషాలు... 11.3 ఓవర్లు... ప్రపంచ టెస్టు చాంపియన్‌ న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చడానికి నాలుగో రోజు ఆట తొలి సెషన్‌లో భారత బౌలర్లు తీసుకున్న సమయం. నాలుగేళ్ల తర్వాత మళ్లీ టెస్టు ఆడిన ఆఫ్‌ స్పిన్నర్‌ జయంత్‌ యాదవ్‌ నాలుగో రోజు మొదటి సెషన్‌లో నాలుగు వికెట్ల తీయగా... నికోల్స్‌ను అవుట్‌ చేసి అశ్విన్‌ భారత జట్టుకు తమ టెస్టు చరిత్రలోనే పరుగుల పరంగా అతి పెద్ద విజయాన్ని ఖరారు చేశాడు. ఈ సిరీస్‌ గెలుపుతో భారత్‌ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌ను రెండో స్థానానికి వెనక్కి నెట్టి నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకుంది.

ముంబై: సొంతగడ్డపై మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ భారత క్రికెట్‌ జట్టు వరుసగా 14వ టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌ జట్టుతో జరిగిన రెండో టెస్టులో భారత్‌ 372 పరుగుల తేడాతో బ్రహ్మాండమైన విజయం సాధించింది. 540 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 56.3 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. ఓవర్‌నైట్‌ స్కోరుకు మరో 27 పరుగులు జతచేసి న్యూజిలాండ్‌ మిగతా ఐదు వికెట్లను కోల్పోయింది. స్పిన్నర్లు అశ్విన్, జయంత్‌ యాదవ్‌ నాలుగు వికెట్ల చొప్పున తీయగా... మరో వికెట్‌ ఎడంచేతి వాటం స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ ఖాతాలోకి వెళ్లింది.

ఈ గెలుపుతో భారత్‌ రెండు టెస్టుల సిరీస్‌ను 1–0తో కైవసం చేసుకుంది. కాన్పూర్‌లో జరిగిన తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ చేసిన భారత ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డుతోపాటు రూ. 1 లక్ష ప్రైజ్‌మనీ... రెండు టెస్టుల్లో పొదుపుగా బౌలింగ్‌ చేసి మొత్తం 14 వికెట్లు తీసిన భారత ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ పురస్కారంతోపాటు రూ. 2 లక్షల 50 వేలు ప్రైజ్‌మనీ లభించాయి. కొత్త హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పర్యవేక్షణలో భారత్‌ రెండో సిరీస్‌ను దక్కించుకుంది. టి20 సిరీస్‌ను టీమిండియా 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే.  

5 పరుగులు... 5 వికెట్లు
ఓవర్‌నైట్‌ స్కోరు 140/5తో ఆట నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన న్యూజిలాండ్‌ బ్యాటర్లు నికోల్స్‌ (44; 8 ఫోర్లు), రచిన్‌ రవీంద్ర (18; 4 ఫోర్లు) తొలి ఆరు ఓవర్లపాటు వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడి 22 పరుగులు జోడించారు. అయితే ఇన్నింగ్స్‌ 52వ ఓవర్లో జయంత్‌ బౌలింగ్‌లో రచిన్‌ రెండో స్లిప్‌లో పుజారాకు క్యాచ్‌ ఇవ్వడంతో కివీస్‌ 162 పరుగులవద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత జయంత్‌ ఐదు బంతుల వ్యవధిలో జేమీసన్‌ (0), సౌతీ (0), సోమర్‌విల్లే (1)లను అవుట్‌ చేశాడు. చివరగా అశ్విన్‌ బౌలింగ్‌లో నికోల్స్‌ స్టంపౌట్‌ కావడంతో న్యూజిలాండ్‌ ఓటమి ఖరారైంది. కివీస్‌ చివరి ఐదు వికెట్లను ఐదు పరుగుల వ్యవధిలో కోల్పోవడం గమనార్హం.

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 325; న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 62; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 276/7 డిక్లేర్డ్‌; న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: లాథమ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్‌ 6; విల్‌ యంగ్‌ (సి) సూర్యకుమార్‌–సబ్‌ (బి) అశ్విన్‌ 20; డరైల్‌ మిచెల్‌ (సి) జయంత్‌ యాదవ్‌ (బి) అక్షర్‌ పటేల్‌ 60; రాస్‌ టేలర్‌ (సి) పుజారా (బి) అశ్విన్‌ 6; నికోల్స్‌ (స్టంప్డ్‌) సాహా (బి) అశ్విన్‌ 44; బ్లన్‌డెల్‌ (రనౌట్‌) 0; రచిన్‌ రవీంద్ర (సి) పుజారా (బి) జయంత్‌ యాదవ్‌ 18; జేమీసన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) జయంత్‌ యాదవ్‌ 0; టిమ్‌ సౌతీ (బి) జయంత్‌ యాదవ్‌ 0; సోమర్‌విల్లే (సి) మయాంక్‌ అగర్వాల్‌ (బి) జయంత్‌ యాదవ్‌ 1; ఎజాజ్‌ పటేల్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (56.3 ఓవర్లలో ఆలౌట్‌) 167. 
వికెట్ల పతనం: 1–13, 2–45, 3–55, 128, 5–129, 6–162, 7–165, 8–165, 9–167, 10–167. బౌలింగ్‌: సిరాజ్‌ 5–2–13–0, అశ్విన్‌ 22.3–9–34–4, అక్షర్‌ పటేల్‌ 10–2–42–1, జయంత్‌ యాదవ్‌ 14–4–49–4, ఉమేశ్‌ యాదవ్‌ 5–1–19–0.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top