భారత్‌కు ఫాలోఆన్‌ గండం తప్పేనా!

India Lost 5th Wicket As Chateswar Pujara In First Test - Sakshi

చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు ఫాలోఆన్‌ గండం తప్పేలా లేదు. నిలకడగా ఆడుతున్న చతేశ్వర్‌ పుజారా(73 పరుగులు) డామ్‌ బెస్‌ బౌలింగ్‌లో రోరీ బర్న్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 192 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయి మరింత కష్టాల్లో పడింది. ప్రస్తుతం పంత్‌ 76 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 82 పరుగులు, సుందర్‌ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్‌ ఇంకా 357 పరుగులు వెనుకబడి ఉంది. టీమిండియా ఫాలోఆన్‌ గండం తప్పించుకోవాలంటే కనీసం 300 పరుగులు దాటాల్సి ఉంటుంది.

రిషబ్‌ పంత్‌ వన్డే తరహాలో ఆడుతున్న అతని తర్వాత మరో స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ లేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది. బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు వాషింగ్టన్‌ సుందర్‌, అశ్విన్‌లు ఉన్నా వారు ఏ మేరకు ఇంగ్లీష్‌ బౌలర్లను ఎదుర్కొంటారనేది సందేహంగా మారింది. ఇక 73 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన దశలో పుజారా, రిషబ్‌ పంత్‌లు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇద్దరు కలిసి 5వ వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సీనియర్‌ ఆటగాడు పుజారా నుంచి పూర్తి సహకారం అందడంతో పంత్‌ బౌండరీలతో చెలరేగిపోయాడు. 40 బంతుల్లో 50 పరుగులు చేసి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పుజారా సైతం బాధ్యతాయుతంగా ఆడుతూ 29వ హాఫ్‌ సెంచరీ సాధించాడు. దీంతో టీమిండియా 154/4 స్కోరుతో టీ విరామానికి వెళ్లింది.

కాగా అంతకుముందు పర్యటక ఇంగ్లాండ్‌ జట్టు 578 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఆదివారం 555/8తో మూడో రోజు ఆటను ఆరంభించిన ఇంగ్లీష్‌ జట్టు మరో 23 పరుగులు జోడించి తొలి ఇన్సింగ్స్‌ను ముగించింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్స్‌లో రూట్‌ 218, సిబ్లీ 87, స్టోక్స్‌ 82 పరుగులు పోప్‌ 34, డొమినిక్‌ 34, బర్న్స్‌ 33, బట్లర్‌ 30 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్‌కు చెరో 3 వికెట్లు, ఇషాంత్, షాబాజ్‌ నదీమ్‌కు తలో 2 వికెట్లు దక్కాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top