మళ్లీ కొత్తగా మొదలు...

India and Australia T20 series from today - Sakshi

నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియా టి20 సిరీస్‌

విశాఖలో తొలి పోరు

టీమిండియా కుర్రాళ్ల సత్తాకు పరీక్ష

రాత్రి 7 గంటల నుంచి స్పోర్ట్స్‌–18,జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం

వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఓటమి తర్వాత నాలుగు రోజులకే ఆ్రస్టేలియాతో మరో పోరులో భారత్‌ ఆడాల్సి వస్తుందని ఎవరైనా ఊహించారా? కానీ ఇప్పుడు ఇరు జట్లు మళ్లీ తలపడేందుకు సిద్ధమయ్యాయి. 2023లో భారత గడ్డపై ఆ్రస్టేలియా రెండు వేర్వేరు సందర్భాల్లో రెండు వన్డే సిరీస్‌లు, ఒక టెస్టు సిరీస్‌ ఆడగా... వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి ప్‌ ఫైనల్లో, ఇటీవల వన్డే వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్, చివరి మ్యాచ్‌లో ఈ రెండు టీమ్‌లు ‘ఢీ’కొన్నాయి. ఈ నేపథ్యంలో ఏకంగా ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ జరగబోతోంది. స్టార్‌ ఆటగాళ్లు కాకుండా ఎక్కువ మంది కుర్రాళ్లతోనే టీమిండియా బరిలోకి దిగుతుండగా, ఆసీస్‌ కూడా పలువురు కీలక ఆటగాళ్లకు విశ్రాంతిచ్చింది.

సాక్షి, విశాఖపట్నం: వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత భారత్, ఆ్రస్టేలియా టి20 సమరానికి సన్నద్ధమయ్యాయి. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు వైఎస్‌ఆర్‌–ఏసీఏ–వీడీసీఏ మైదానంలో జరిగే తొలి టి20లో ఇరు జట్లు తలపడనున్నాయి. మామూలుగా అయితే ఈ టి20 సిరీస్‌కు పెద్దగా ప్రాధాన్యత లేదు.

అయితే వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్‌కు ముందు ఈ ఫార్మాట్‌లో ఇరు జట్లు మొత్తం 11 టి20 మ్యాచ్‌లు మాత్రమే ఆడనున్నాయి. ఈ సిరీస్‌ మ్యాచ్‌లు కూడా అందులో భాగమే కాబట్టి రెండు టీమ్‌లూ తుది కూర్పులపై దృష్టి పెట్టాయి. మాజీ క్రికెటర్, జాతీయ క్రికెట్‌ అకాడమీ హెడ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఈ సిరీస్‌కు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించనున్నాడు.  

కొత్త కెప్టెన్ ఆధ్వర్యంలో... 
ప్రస్తుత సిరీస్‌కు ముందు భారత జట్టు బలహీన వెస్టిండీస్, ఐర్లాండ్‌లతోనే టి20 సిరీస్‌లు ఆడింది. మరోవైపు ఏమాత్రం పోటీ లేని ఆసియా క్రీడల్లో కూడా పాల్గొని స్వర్ణం సాధించింది. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్‌ ఆడిన ఆటగాళ్లలో ముగ్గురినే భారత్‌ ఈ సిరీస్‌ కోసం ఎంపిక చేసింది. కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ తొలిసారి బాధ్యతలు చేపట్టగా... ఇషాన్‌ కిషన్, వన్డే ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని ప్రసిధ్‌ కృష్ణ టీమ్‌లో ఉన్నారు.

ఓపెనర్‌గా ఇషాన్‌ కిషన్‌ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నా... ఇప్పటికే యశస్వి జైస్వాల్, రుతురాజ్‌ గైక్వాడ్‌ రూపంలో ఇద్దరు ఓపెనర్లు ఉన్నారు. వీరిలో ఎవరిని పక్కన పెడతారనేది చూడాలి. మిడిలార్డర్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ ఠాకూర్‌ తిలక్‌ వర్మ, శివమ్‌ దూబే, రింకూ సింగ్‌ చెలరేగాలని పట్టుదలగా ఉన్నారు. చివరి నిమిషంలో గాయంతో  అనూహ్యంగా ప్రపంచకప్‌కు దూరమైన అక్షర్‌ పటేల్‌ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ఖాయం. రవి బిష్ణోయ్‌ రూపంలో లెగ్‌స్పిన్నర్‌ జట్టుకు  అందుబాటులో ఉన్నాడు.  

సీనియర్లు అండగా... 
కమిన్స్, వార్నర్‌ వంటి స్టార్లకు ఆ్రస్టేలియా విశ్రాంతినిస్తూ ఈ సిరీస్‌ నుంచి తప్పించినా... ప్రస్తుతం ఆసీస్‌ టీమ్‌ కూడా బలంగానే ఉంది. వన్డే వరల్డ్‌ కప్‌ టీమ్‌లో ఉన్న ఏడుగురు ఈ సిరీస్‌ కోసం భారత్‌లోనే ఆగిపోయారు. ఫైనల్‌ ఆడిన స్మిత్, ఇన్‌గ్లిస్‌ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉండగా...ట్రవిస్‌ హెడ్, మ్యాక్స్‌వెల్, ఆడమ్‌ జంపా విశ్రాంతి తీసుకోనున్నారు. స్మిత్‌ ఓపెనింగ్‌ చేసే అవకాశం ఉంది. టిమ్‌ డేవిడ్, స్టొయినిస్‌ చూపించే విధ్వంసం భారత జట్టుకు అనుభవమే. బౌలింగ్‌లో బెహ్రాన్‌ డార్‌్ఫకు భారత గడ్డపై అనుభవం ఉంది. తన్విర్‌ సంఘా ఏకైక స్పిన్నర్‌గా ఆడతాడు. 

పిచ్, వాతావరణం 
వైజాగ్‌ పిచ్‌ సాధారణంగా బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. ఇక్కడ జరిగిన 3 టి20ల్లోనూ చెప్పుకోతగ్గ స్కోర్లు నమోదయ్యాయి. మ్యాచ్‌ రోజు కొన్ని చిరుజల్లులకు అవకాశం ఉన్నా... ఆటకు ఇబ్బంది ఉండకపోవచ్చు.  

తుది జట్లు (అంచనా) 
భారత్‌: సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్ ), ఇషాన్‌ కిషన్, యశస్వి/రుతురాజ్, తిలక్‌ వర్మ, శివమ్‌ దూబే, రింకూ సింగ్, అక్షర్‌ పటేల్, రవి బిష్ణోయ్, అర్‌‡్షదీప్‌ సింగ్, ప్రసిధ్‌ కృష్ణ, ముకేశ్‌ కుమార్‌.  
ఆస్ట్రేలియా: మాథ్యూ వేడ్‌ (కెప్టెన్ ), స్మిత్, షార్ట్, హార్డీ, ఇన్‌గ్లిస్, స్టొయినిస్, టిమ్‌ డేవిడ్, సీన్‌ అబాట్, ఎలిస్, బెహ్రన్‌డార్‌్ఫ, తన్విర్‌ సంఘా.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top