డబ్ల్యూటీసీ ఫైనల్‌: చీకటి కమ్మేసింది

India 146 for 3 as bad light forces early stumps on Day 2 - Sakshi

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు పదే పదే అంతరాయం

రెండో రోజు భారత్‌ 146/3  

సౌతాంప్టన్‌: భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు విఘ్నాలు తప్పడం లేదు. తొలి రోజు వర్షం కారణంగా ఒక్క బంతి పడకపోగా, రెండో రోజు శనివారం వెలుతురులేమితో 66.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (124 బంతుల్లో 44 బ్యాటింగ్‌; 1 ఫోర్‌), అజింక్య రహానే (79 బంతుల్లో 29 బ్యాటింగ్‌; 4 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. టాస్, మ్యాచ్‌ షెడ్యూల్‌ ప్రకారమే సాగినా... మొత్తంగా మూడుసార్లు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. వెలుతురు తగ్గడంతో టీ విరామాన్ని అంపైర్లు ముందే ప్రకటించగా... ఆ తర్వాత మరో 19 బంతులకే ఆట ఆగింది. మరో 6 ఓవర్ల తర్వాత మళ్లీ ఆగిపోయిన మ్యాచ్‌ను ఆపై కొనసాగించే అవకాశం లేకపోయింది.  

అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు...
న్యూజిలాండ్‌ పేసర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఓపెనర్లు రోహిత్‌ శర్మ (68 బంతుల్లో 34; 6 ఫోర్లు), శుబ్‌మన్‌ గిల్‌ (64 బంతుల్లో 28; 3 ఫోర్లు) జట్టుకు శుభారంభం అందించారు. రెండో ఓవర్లోనే సమన్వయలోపంతో రనౌట్‌ అయ్యే ప్రమాదం తప్పిన తర్వాత ఈ జోడీ మరింత జాగ్రత్తగా ఆడింది. అయితే అర్ధ సెంచరీ భాగస్వామ్యం తర్వాత స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ అవుట్‌ కావడంతో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ వెంటనే గిల్‌ను వాగ్నర్‌ పెవిలియన్‌ పంపించాడు. ఈ దశలో కోహ్లి, పుజారా (54 బంతుల్లో 8; 2 ఫోర్లు) పరుగులు రాబట్టడంకంటే క్రీజ్‌లో నిలదొక్కుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టారు.

తన తొలి పరుగు కోసం పుజారా ఏకంగా 36 బంతులు తీసుకోగా, ఒక దశలో కోహ్లి కూడా వరుసగా 19 బంతుల పాటు పరుగు తీయలేదు. అయితే బౌల్ట్‌ చక్కటి బంతికి వికెట్ల ముందు దొరికిపోయిన పుజారా ‘రివ్యూ’ కూడా కోరకుండానే వెనుదిరిగాడు. ఈ దశలో కోహ్లి, రహానే కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. కొన్ని చూడచక్కటి షాట్లతో వీరిద్దరు పరుగులు రాబట్టారు. కివీస్‌ పేసర్లు చాలా సార్లు అద్భుతమైన బంతులు వేసినా...చివరకు ఈ జోడీని విడదీయడంలో మాత్రం విఫలమయ్యారు. శుక్రవారం కన్నుమూసిన అథ్లెటిక్‌ దిగ్గజం మిల్కా సింగ్‌కు నివాళిగా భారత క్రికెటర్లు మ్యాచ్‌లో నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు.  

కొంత డ్రామా...
ఇన్నింగ్స్‌ 41వ ఓవర్‌ చివరి బంతికి జరిగిన ఘటన మైదానంలో చర్చకు దారి తీసింది. బౌల్ట్‌ బౌలింగ్‌లో కోహ్లి లెగ్‌సైడ్‌ ఆడగా కీపర్‌ వాట్లింగ్‌ అందుకొని అప్పీల్‌ చేశాడు. విలియమ్సన్‌ కూడా రివ్యూ కోరేందుకు సిద్ధమైనా అంపైర్‌ను అడిగి ఆగిపోయాడు. ఎందుకంటే అప్పటికే అంపైర్‌ ఇల్లింగ్‌వర్త్‌ మూడో అంపైర్‌తో చర్చిస్తున్నాడు. రీప్లేలో కీపర్‌ క్యాచ్‌ సరిగా అందుకున్నా... అల్ట్రా ఎడ్జ్‌లో బంతి కోహ్లి బ్యాట్‌కు తాకలేదని తేలింది. దాంతో అతను నాటౌట్‌గా తేలాడు.

కివీస్‌ రివ్యూ కోరకుండానే అంపైర్లు టీవీ రీప్లే కోసం వెళ్లడాన్నే కోహ్లి ప్రశ్నించాడు. అయితే నిబంధల ప్రకారం అంపైర్లు తప్పు చేయలేదు. కోహ్లిని అవుట్‌గా భావించి సాఫ్ట్‌ సిగ్నల్‌ అవుట్‌ ఇచ్చిన అంపైర్‌ (ఇది టీవీ ప్రసారంలో కనిపించలేదు) బంతిని కీపర్‌ సరిగా అందుకున్నాడా లేదా అని, ఆపై కోహ్లి బ్యాట్‌కు తాకిందా లేదా తెలుసుకోవడానికి రీప్లే కోరాడు. కాబట్టి న్యూజిలాండ్‌ ‘రివ్యూ’లో కోత పడలేదు.

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి) సౌతీ (బి) జేమీసన్‌ 34; గిల్‌ (సి) వాట్లింగ్‌ (బి) వాగ్నర్‌ 28; పుజారా (ఎల్బీ) (బి) బౌల్ట్‌ 8; కోహ్లి (బ్యాటింగ్‌) 44; రహానే (బ్యాటింగ్‌) 29; ఎక్స్‌ట్రాలు 3, మొత్తం (64.4 ఓవర్లలో 3 వికెట్లకు) 146.

వికెట్ల పతనం: 1–62, 2–63, 3–88.

బౌలింగ్‌: సౌతీ 17–4–47–0, బౌల్ట్‌ 12.4–2–32–1, జేమీసన్‌ 14–9–14–1, గ్రాండ్‌హోమ్‌ 11–6–23–0, వాగ్నర్‌ 10–3–28–1.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top