Ind Vs Zim: కోహ్లి, రోహిత్‌ లేరు.. టీమిండియాను 2-1తో ఓడిస్తాం: జింబాబ్వే బ్యాటర్‌! ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ వద్దు భయ్యా!

Ind Vs Zim ODIs: Innocent Kaia Predicts Zimbabwe To Win Series With 2 1 - Sakshi

India tour of Zimbabwe, 2022- 3 ODIs: స్వదేశంలో టీమిండియాను కచ్చితంగా ఓడించి తీరతామని జింబాబ్వే బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ ఇన్నోసెంట్‌ కియా అన్నాడు. కేఎల్‌ రాహుల్‌ బృందాన్ని మట్టికరిపించి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు. అదే విధంగా భారత్‌తో పోరులో తాను అత్యధిక పరుగులు సాధించి.. టాప్‌ స్కోరర్‌గా నిలవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. 

కాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని భారత జట్టు ఆగష్టు 18న మొదటి మ్యాచ్‌ ఆడనుంది. ఇక.. పర్యాటక బంగ్లాదేశ్‌ను సొంతగడ్డపై ఓడించి.. టీ20, వన్డే సిరీస్‌లలో 2-1తో గెలుపొంది జోరు మీదున్న జింబాబ్వే.. భారత్‌కు సైతం గట్టి పోటీనివ్వాలని ఉవ్విళ్లూరుతోంది.

టీమిండియాపై 2-1తో గెలుస్తాం!
ఈ నేపథ్యంలో బంగ్లాపై గెలుపులో కీలక పాత్ర పోషించిన జింబాబ్వే ఆటగాడు ఇన్నోసెంట్‌ కియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టైమ్స్‌ నౌతో ప్రత్యేకంగా ముచ్చటించిన ఈ 30 ఏళ్ల రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌... ‘‘టీమిండియాతో సిరీస్‌లో జింబాబ్వే 2-1తో గెలుస్తుంది. ఇక వ్యక్తిగతంగా.. వరుస సెంచరీలు సాధించాలని నేను కోరుకుంటున్నా. తద్వారా టాప్‌ స్కోరర్‌గా నిలవాలని భావిస్తున్నా. భారత్‌తో సిరీస్‌లో నా ప్రధాన లక్ష్యం అదే’’ అని చెప్పుకొచ్చాడు.


ఇన్నోసెంట్‌ కియా(PC: Zimbabwe Cricket)

విరాట్‌, రోహిత్‌ లేరు!... ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ వద్దు భయ్యా!
ఇక తమ దేశంలో పర్యటించనున్న భారత జట్టులో సీనియర్లు లేకపోవడం తమకు సానుకూల అంశమన్న కియా.. ‘‘మేము కచ్చితంగా గెలుస్తామని నమ్మకంగా చెప్పగలను. ఎందుకంటే.. ప్రస్తుత భారత జట్టులో విరాట్‌ లేడు.. రోహిత్‌ శర్మ, రిషభ్‌ పంత్‌ ఇలాంటి కీలక ప్లేయర్లు ఎవరూ లేరు. 

మా దేశానికి వచ్చే జట్టు పటిష్టమైనదే అని నాకు తెలుసు. వాళ్లను తక్కువగా అంచనా వేసే ఉద్దేశం మాకు లేదు. అయితే.. మేము మాత్రం పోటీనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని విశ్వాసం వ్యక్తం చేశాడు. కియా వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘అద్భుత విజయాలతో మీరు దూసుకుపోతున్న తీరు ప్రశంసనీయం.

అయితే.. కాన్ఫిడెన్స్‌ ఉంటే మంచిదే కానీ.. మరీ ఇంత ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ పనికిరాదు భయ్యా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా హరారే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి వన్డేలో కియా 110 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇప్పటి వరకు ఆడింది 6 వన్డేలు
ఇక గతేడాది స్కాట్లాండ్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన కియా.. ఈ ఏడాది జూన్‌లో అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో సిరీస్‌తో వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు జింబాబ్వే తరఫున 6 వన్డేలు ఆడి 245 పరుగులు సాధించాడు. అత్యధి​క స్కోరు 110. ఇక టీ20 ఫార్మాట్‌లో 8 మ్యాచ్‌లు ఆడి 119 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 54.

ఇదిలా ఉంటే.. జింబాబ్వే కోచ్‌ డేవిడ్‌ హౌన్‌, టెక్నికల్‌ డైరెక్టర్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ సైతం భారత్‌కు తాము పోటీనివ్వగలమని పేర్కొన్న సంగతి తెలిసిందే.

చదవండి: Asia Cup 2022 : కోహ్లి ఫామ్‌లోకి వస్తే అంతే సంగతులు.. పాకిస్తాన్‌కు ఆ దేశ మాజీ కెప్టెన్‌ వార్నింగ్‌!
India Tour Of Zimbabwe: స్టార్‌ ఆల్‌రౌండర్‌ దూరం..!
IND vs ZIM: 6 ఏళ్ల తర్వాత భారత్‌తో సిరీస్‌.. జట్టును ప్రకటించిన జింబాబ్వే! కెప్టెన్‌ దూరం!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top