
వెస్టిండీస్‌తో తొలి టెస్టులో టీమిండియా (IND vs WI 1st Test) తమ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఊహించని రీతిలో శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుకాగానే ఈ మేరకు తమ నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో విండీస్ బ్యాటింగ్‌కు దిగింది.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 సీజన్‌లో భాగంగా సొంతగడ్డపై టీమిండియా.. విండీస్‌తో రెండు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గురువారం మొదటి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన పర్యాటక విండీస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది.
భారత బౌలర్ల విజృంభణ
భారత బౌలర్ల ధాటికి.. తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా 44.1 ఓవర్లలో కేవలం 162 పరుగులు మాత్రమే చేసి వెస్టిండీస్ జట్టు కుప్పకూలింది. ఓపెనర్లు జాన్ కాంప్‌బెల్ (8), తగ్‌నరైన్ చందర్‌పాల్ (0)లతో పాటు.. వన్‌డౌన్ బ్యాటర్ అలిక్ అథనాజ్ (12) కూడా పూర్తిగా విఫలమయ్యాడు.
మిగతా వారిలో బ్రాండన్ కింగ్ (13), ఖరీ పియరీ (11) రెండంకెల స్కోరు చేయగా.. కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయీ హోప్ (26) ఫర్వాలేదనిపించారు. ఆల్‌రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ 32 పరుగులతో విండీస్ ఇన్నింగ్స్‌లో టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.
టీమిండియా బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) నాలుగు వికెట్లతో చెలరేగగా.. బుమ్రా మూడు, కుల్దీప్ యాదవ్ రెండు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ దక్కించుకున్నారు. బౌలర్లు ఇలా తమ పనిని సమర్థవంతంగా పూర్తి చేసి ప్రత్యర్థిని కట్టడి చేయగా.. బ్యాటర్లు కూడా విజృంభించారు.
ముగ్గురు మొనగాళ్లు
ఓపెనర్ కేఎల్ రాహుల్ (100)తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (125), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (104 నాటౌట్) శతకాలతో ఆకట్టుకున్నారు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 50 పరుగులు చేయగా.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (36) నిరాశపరిచాడు. ఇటీవల సూపర్ ఫామ్ కనబరిచిన సాయి సుదర్శన్ (7) మాత్రం ఈసారి పూర్తిగా విఫలమయ్యాడు.
ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి.. విండీస్‌పై మొదటి ఇన్నింగ్స్‌లో 286 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అయితే, శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుకాగానే తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
వేట మొదలుపెట్టిన సిరాజ్
ఫలితంగా విండీస్ తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. తొమ్మిది ఓవర్ల ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. ఓపెనర్ తగ్‌నరైన్ చందర్‌పాల్ (8) మరోసారి విఫలం అయ్యాడు. సిరాజ్ బౌలింగ్‌లో నితీశ్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక మరో ఓపెనర్ జాన్ కాంప్‌బెల్ 12, అలిక్ అథనాజ్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.
చదవండి: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే ఏకైక ఆటగాడిగా..