Ind Vs Sl- Rishabh Pant: ఫార్మాట్‌ ఏదైతే నాకేంటి! పంత్‌ అరుదైన రికార్డు.. ధోని, గిల్‌క్రిస్ట్‌లను ‘దాటేశాడు’! ఇంకా..

Ind Vs Sl: Rishabh Pant Becomes Wicketkeeper With Most Sixes After 50 Test innings - Sakshi

Rishabh Pant Stats: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా రెండో రోజు ఆటలో టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆడేది టెస్టు మ్యాచ్‌ అని నాకు తెలుసు కానీ నా బ్యాట్‌కు తెలియదన్నట్లుగా షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. బోర్‌ అనే మ్యాచ్‌కు బోలెడంత జోష్‌ తన మెరుపు ఇన్నింగ్స్‌తో అందివ్వగల సమర్థుడు పంత్‌. భారత బ్యాటర్‌ హనుమ విహారి అవుటైన 34 ఓవర్లో క్రీజులోకి వచ్చిన పంత్‌ ఐదో బంతిని డీప్‌మిడ్‌ వికెట్‌ మీదుగా సిక్సర్‌గా తరలించాడు.

మరుసటి ఓవర్‌ వేసిన ధనంజయ డిసిల్వాకు వరుస 4, 6లతో తన ధాటిని చూపించాడు. తర్వాత ఓవర్లోనే విరాట్‌ కోహ్లి అవుటైనా పంత్‌ జోరు మాత్రం తగ్గలేదు. లంక స్పిన్‌ బౌలింగ్‌ కొనసాగించినంత సేపు ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో మెరిపించాడు.  పది ఓవర్లయినా క్రీజులో నిలువని రిషభ్‌ కేవలం 28 బంతుల్లోనే (7 ఫోర్లు, 2 సిక్స్‌లు) బౌండరీ కొట్టి మరీ ఫిఫ్టీ పూర్తి చేయడం విశేషం.

ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ మాత్రమే కాదు. ఇది కూడా!
ఈ క్రమంలో పంత్‌ పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యంత వేగంగా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. కేవలం 28 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఈ ఫీట్‌ నమోదు చేశాడు. తద్వారా టీమిండియా లెజెండ్‌  కపిల్‌ దేవ్‌ (1982లో పాక్‌పై 30 బంతుల్లో) రికార్డును బద్దలుకొట్టాడు.

సిక్సర్ల వీరుడు!
అంతేగాకుండా.. టెస్టుల్లో ఆడిన 50 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు(42) బాదిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా పంత్‌ రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు  (51 ఇన్నింగ్స్‌)తో కలిపి మొత్తంగా 44 సిక్సర్లు బాదాడు. ఇక ఈ జాబితాలో పంత్‌ తర్వాతి స్థానంలో టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోని(31 సిక్సర్లు), ఆసీస్‌ మాజీ ఆటగాడు బ్రాడ్‌ హాడిన్‌(31), ఆడం గిల్‌క్రిస్ట్‌(30), ఇంగ్లండ్‌ ప్లేయర్‌ జోస్‌ బట్లర్‌(21) ఉన్నారు.

కాగా ధోని తన టెస్టు కెరీర్‌లో భాగంగా 90 టెస్టుల్లో 78 సిక్సర్లు కొట్టాడు. యువ సంచలనం పంత్‌ మాత్రం 30 మ్యాచ్‌లలోనే 44 సిక్స్‌లు బాదడం గమనార్హం. ఇక మొత్తంగా టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వికెట్‌ కీపర్ల జాబితాలో గిల్‌క్రిస్ట్‌ 100 మాక్సిమమ్స్‌తో టాప్‌లో ఉన్నాడు. ధోని 79, బ్రాడ్‌  హాడిన్‌ 54 సిక్స్‌లు కొట్టారు. ఇదిలా ఉండగా.. శ్రీలంకతో మ్యాచ్‌లో 42వ ఓవర్‌ ఆఖరి బంతికి జయవిక్రమ రిటర్న్‌ క్యాచ్‌తో పంత్‌ మెరుపు ఇన్నింగ్స్‌కు తెరపడింది. 

చదవండి: IPL 2022- Gujarat Titans: గుజరాత్‌ టైటాన్స్‌ జెర్సీ ఆవిష్కరణ.. సర్‌ప్రైజ్‌కు సిద్ధంగా ఉండాలన్న కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top