Rohit Sharma: రోహిత్‌కు షేక్‌హ్యాండ్‌ ఇచ్చేటపుడు జాగ్రత్త.. పట్టిందల్లా బంగారమే: టీమిండియా మాజీ క్రికెటర్‌

Ind Vs Sl: Mohd Kaif Praises Rohit Sharma Whatever He Touches Turns Into Gold - Sakshi

India Vs Sri Lanka T20 Series: భారత మాజీ బ్యాటర్‌ మహ్మద్‌ కైఫ్‌ టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై ప్రశంసల జల్లు కురిపించాడు. రోహిత్‌ పట్టిందల్లా బంగారమే అవుతోందంటూ కొనియాడాడు. తన అద్భుతమైన కెప్టెన్సీతో జట్టుకు విజయాలు అందిస్తున్నాడని కితాబిచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2021 తర్వాత పొట్టి ఫార్మాట్‌ సారథ్య బాధ్యతలు చేపట్టిన రోహిత్‌ శర్మ ఖాతాలో వరుస విజయాలు చేరుతున్నాయి.

ఇప్పటికే హిట్‌మ్యాన్‌ నేతృత్వంలో న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసి.. శ్రీలంకతో సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఇక ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే నామమాత్రపు మూడో టీ20లోనూ విజయం సాధించడం పక్కాగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మకు సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసలు వెల్లువెత్తుతుతున్నాయి. ఈ క్రమంలో మహ్మద్‌ కైఫ్‌ హిట్‌మ్యాన్‌ది గోల్డెన్‌ టచ్‌ అంటూ ఆకాశానికెత్తడం విశేషం.

ఈ మేరకు... ‘‘రోహిత్‌ శర్మకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేటపుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు అతడు పట్టిందల్లా బంగారమే అవుతోంది. శ్రేయస్‌ను మూడో స్థానంలో పంపడం, ఆటగాళ్లను రొటేట్‌ చేయడం, బౌలింగ్‌ విభాగంలో మార్పులు. ప్రతి అడుగు వ్యూహాత్మకమే! మాస్టర్‌ స్ట్రోక్‌’’ అంటూ కైఫ్‌ ట్వీట్‌ చేశాడు. ఇక ఇందుకు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ బ్యాట్‌ ఝలిపిస్తే ఇంకా బాగుండేది అని కామెంట్లు చేస్తున్నారు.

కాగా లంకతో రెండో టీ20 మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ కేవలం ఒకే ఒక్క పరుగు చేసి అవుటైన సంగతి తెలిసిందే. అతడికి జోడీగా ఓపెనింగ్‌కు దిగిన ఇషాన్‌ కిషన్‌ కూడా 16 పరుగులు మాత్రమే చేశాడు. ఇక వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ 44 బంతుల్లోనే 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సంజూ శాంసన్‌ ఫర్వాలేదనిపించగా... ఆఖర్లో జడేజా కేవలం 18 బంతుల్లోనే 45 పరుగులు(నాటౌట్‌) సాధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఇండియా వర్సెస్‌ శ్రీలంక
స్కోర్లు:
శ్రీలంక- 183/5 (20)
ఇండియా- 186/3 (17.1)

చదవండి: IND vs SL: ఏ ముహుర్తానా సిరీస్‌ ప్రారంభమయిందో.. ఇషాన్‌ కిషన్‌ తలకు గాయం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top