Ind Vs SA T20 Series: బుమ్రా స్థానంలో జట్టులోకి సిరాజ్‌: బీసీసీఐ

Ind Vs SA T20 Series: Mohammed Siraj Replaces Jasprit Bumrah Says BCCI - Sakshi

India Vs South Africa T20 Series 2022: హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ తిరిగి భారత టీ20 జట్టులో చోటుదక్కించుకున్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా అతడు రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వెన్నునొప్పి కారణంగా మొదటి టీ20కి దూరమైన సంగతి తెలిసిందే. 

అయితే, బుమ్రా ఇంకా కోలుకోకపోవడంతో అతడి స్థానాన్ని సిరాజ్‌తో భర్తీ చేస్తున్నట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి శుక్రవారం వెల్లడించింది. ఇక మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రోహిత్‌ సేన మొదటి టీ20లో గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉంది. గువాహటి వేదికగా ఆదివారం(అక్టోబరు 2) రెండో టీ20, ఇండోర్‌ వేదికగా మంగళవారం(అక్టోబరు 4) మూడో టీ20 జరుగనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లకు సిరాజ్‌ అందుబాటులో ఉండనున్నాడు.

జింబాబ్వేలో అదరగొట్టిన సిరాజ్‌
కాగా శ్రీలంకతో స్వదేశంలో చివరి సారిగా సిరాజ్‌ టీమిండియా తరఫున టీ20 మ్యాచ్‌ ఆడాడు. ధర్మశాల వేదికగా జరిగిన ఫిబ్రవరిలో జరిగిన ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసిన సిరాజ్‌.. 22 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. ఇక ఆగష్టులో జింబాబ్వే పర్యటనలో భాగంగా సిరాజ్‌ చివరి వన్డే మ్యాచ్ ఆడాడు.

కౌంటీల్లో అరంగేట్రంలోనే
రెండో మ్యాచ్‌లో 8 ఓవర్లు బౌలింగ్‌ చేసి కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్‌ పడగొట్టాడు. ఆ తర్వాత సిరాజ్‌కు జట్టులో చోటు దక్కలేదు. ఈ క్రమంలో వార్విక్‌షైర్‌ తరపున కౌంటీల్లో అరంగేట్రం చేసిన సిరాజ్‌.. మొదటి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. బుమ్రా వెన్నునొప్పి తిరగబెట్టడంతో టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీకి అతడు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఐసీసీ మెగా టోర్నీకి ముందు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. 

దక్షిణాఫ్రికాతో మిగిలిన రెండు టీ20లకు భారత జట్టు:
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌(వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌, దినేశ్‌ కార్తిక్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, యజువేంద్ర చహల్‌, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షల్‌ పటేల్‌, దీపక్‌ చహర్‌, ఉమేశ్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, షాబాజ్‌ అహ్మద్‌, మహ్మద్‌ సిరాజ్‌

చదవండి: T20 World Cup: అయ్యో బుమ్రా..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top