Hardik Pandya: వాళ్లిద్దరిని ఎందుకు ఆడించలేదు! ఇది నా జట్టు.. బయటి వాళ్ల మాటలు పట్టించుకోను!

Ind Vs NZ: Hardik On Sanju Umran Non Selection Ye Meri Team Hai - Sakshi

New Zealand vs India- Hardik Pandya- Sanju Samson: ‘‘ముందుగా ఒక​ విషయం గురించి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా.. బయట ఎవరు ఏం మాట్లాడినా.. ఆ మాటలు మాపై ఎలాంటి ప్రభావం చూపవు. ఇది నా జట్టు. కోచ్‌తో చర్చించిన తర్వాతే ఎవరు తుది జట్టులో ఉండాలో నిర్ణయించుకుంటాం. అత్యుత్తమ జట్టునే ఎంపిక చేసుకుంటాం. 

ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి అవకాశం వస్తుంది. భవిష్యత్తులో ఆడే ఛాన్స్‌ ఉంటుంది. ఇంకా ఆడాల్సిన కీలక సిరీస్‌లు ఎన్నో ఉన్నాయి. ఈ టూర్‌లో మాకు ఇంకొన్ని మ్యాచ్‌లు మిగిలి ఉంటే వివిధ ఆటగాళ్లతో ప్రయోగం చేసేవాళ్లవేమో’’ అని టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా అన్నాడు.

సంజూ, ఉమ్రాన్‌కు మొండిచేయి
న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా కివీస్‌తో ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ నేపథ్యంలో హార్దిక్‌ భారత జట్టు సారథిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటిది వర్షార్పణం కాగా.. రెండో టీ20లో పాండ్యా సేన ఘన విజయం సాధించింది. 

ఇక మంగళవారం నాటి మూడో మ్యాచ్‌లో వర్షం ఆటంకం కారణంగా డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిలో మ్యాచ్‌  టైగా ముగిసింది. ఈ నేపథ్యంలో ట్రోఫీ భారత్‌ సొంతమైంది. కాగా ఈ సిరీస్‌కు ఎంపికైన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌, యువ ఫాస్ట్‌బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ను బెంచ్‌కే పరిమితం చేశారు.

ఈ నేపథ్యంలో మేనేజ్‌మెంట్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఎన్ని అవకాశాలు ఇస్తున్నా విఫలమవుతున్నా వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు అవకాశాలు ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్‌ చేశారు. మరోవైపు పంత్‌ కోసం సంజూకు అన్యాయం చేస్తున్నారంటూ అతడి ఫ్యాన్స్‌ మండిపడ్డారు.

ఎందుకు ఆడించలేదు?
ఈ క్రమంలో మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడిన హార్దిక్‌ పాండ్యాకు ఈ విషయం గురించి ప్రశ్న ఎదురుకాగా ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తన జట్టులో ఎవరు ఉండాలో.. ఎవరు ఉండకూడదో కోచ్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాడు.

ఇక గత మ్యాచ్‌లో బౌలింగ్‌ ఆప్షన్లు పెంచుకునే క్రమంలో దీపక్‌ హుడాను తుది జట్టులోకి తీసుకోగా అనుకున్న ఫలితం రాబట్టగలిగామంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. ఏదేమైనా సిరీస్‌ గెలవడం సంతోషాన్నిచ్చిందని.. సిరీస్‌ ముగిసిన నేపథ్యంలో ఇంటికి వెళ్తున్నానని.. విశ్రాంతి సమయాన్ని తన కొడుకుతో గడుపుతానంటూ హార్దిక్‌ పేర్కొన్నాడు. 

చదవండి: IND VS NZ 3rd T20: ఇక మారవా..? మరోసారి చెత్త షాట్‌ ఆడి వికెట్‌ పారేసుకున్న రిషబ్‌ పంత్‌
IND VS NZ 3rd T20: శభాష్‌ సిరాజ్‌.. బుమ్రా లేని లోటును తీరుస్తున్నావు..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top