Rahul vs Pant: అతడు ‘ఆల్‌రౌండర్‌’.. తుది జట్టులో తనే ఉండాలి.. బౌలింగ్‌ ఆప్షన్‌ దొరుకుతుంది: భారత దిగ్గజం

Ind Vs Ban Gavaskar On Rahul vs Pant: I Call Him All Rounder Good Finisher - Sakshi

India tour of Bangladesh, 2022: కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌.. ప్రస్తుతం టీమిండియాకు అందుబాటులో ఉన్న యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్లు. వీరిలో వైస్‌ కెప్టెన్‌గా రాహుల్‌, కీలక ఆటగాడిగా పంత్‌కు జట్టులో స్థానం సుస్థిరం కాగా.. ఇషాన్‌, సంజూకు అడపాదడపా అవకాశాలు వస్తున్నాయి. అయితే, ఇటీవలి కాలంలో రాహుల్‌ బ్యాటర్‌ రోల్‌కే పరిమితం కాగా.. రిషభ్‌ పంత్‌ వికెట్‌ కీపర్‌గా వ్యవహరిస్తున్నాడు.

అయితే, వరుస వైఫల్యాల నేపథ్యంలో బంగ్లాదేశ్‌ పర్యటనలో భాగంగా మొదటి వన్డేలో పంత్‌ తుది జట్టులో కనిపించలేదు. దీంతో రాహుల్‌కు కీపింగ్‌ బాధ్యతలు అప్పజెప్పింది మేనేజ్‌మెంట్‌. 

ఈ క్రమంలో చాన్నాళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లో వికెట్‌ కీపర్‌ అవతారమెత్తాడు రాహుల్‌. కానీ, ఈ మ్యాచ్‌లో బ్యాటర్‌గా రాణించినా.. క్యాచ్‌ జారవిడవటం ద్వారా విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ క్రమంలో... బంగ్లాతో బుధవారం రెండో వన్డే నేథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ సునిల్‌ గావస్కర్‌ రాహుల్‌, పంత్‌లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.


సునిల్‌ గావస్కర్‌

అతడు ఆల్‌రౌండర్‌
రాహుల్‌ను తాను ఆల్‌రౌండర్‌గా పరిగణిస్తానన్న గావస్కర్‌.. పంత్‌ను పక్కనపెట్టినా నష్టమేమీ లేదని అభిప్రాయపడ్డాడు. సోనీ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘ధావన్‌, రోహిత్‌ శర్మ ఓపెనర్లుగా.. కోహ్లి మూడో స్థానంలో వచ్చిన తరుణంలో.. రాహుల్‌ ఐదో బ్యాటర్‌గా బరిలోకి దిగాడు.

నాకు తెలిసినంత వరకు తను ఆ స్థానంలో బ్యాటింగ్‌కు రావడమే సరైంది. బహుశా తను కూడా అదే కోరుకుంటున్నాడేమో! రాహుల్‌ ఐదో స్థానంలో కొనసాగితే.. జట్టుకు మరో ఎక్స్‌ట్రా ఆప్షన్‌ దొరుకుతుంది. 

మిడిలార్డర్‌లో సమర్థవంతంగా బ్యాటింగ్‌ చేయగలిగిన వికెట్‌ కీపర్‌ ఉంటే.. అదనంగా మరో బౌలర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. నా దృష్టిలో రాహుల్‌ ఆల్‌రౌండర్‌,.. మెరుగైన వికెట్‌ కీపర్‌. ఓపెనర్‌గానూ.. ఐదో స్థానంలోనూ చక్కగా బ్యాటింగ్‌ చేయగలడు.

ఫినిషర్‌గానూ పనికొస్తాడు!
వికెట్‌ కీపర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించగలడు. అద్భుతమైన షాట్లు ఆడగల రాహుల్‌లాంటి అనుభవజ్ఞుడైన రాహుల్‌ ఐదో లేదంటే ఆరోస్థానంలో ఫినిషర్‌గానూ రాణించగలడు’’ అని కేఎల్‌ రాహుల్‌పై ప్రశంసలు కురిపించాడు. రాహుల్‌ ఉండగా పంత్‌ అవసరం ఉండబోదని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. ఇక బంగ్లా టూర్‌కు ఇషాన్‌ ఎంపికైనప్పటికీ సీనియర్లు ఉన్న కారణంగా తుది జట్టులో చోటు అనుమానమే!

ఇక సంజూ సంగతి చెప్పనక్కర్లేదు. ఇటీవల న్యూజిలాండ్‌ పర్యటనలో ఒకే ఒక్క మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న సంజూ.. దురదృష్టవశాత్తూ బంగ్లా టూర్‌కు ఎంపికకాలేదు. కాగా రాహుల్‌ సారథ్యంలో జింబాబ్వే పర్యటనలో సంజూ చివరిసారిగా టీమిండియా వికెట్‌ కీపర్‌గా వ్యవహరించాడు.

చదవండి: World Test Championship: పాకిస్తాన్‌కు ఊహించని షాక్‌.. ఫైనల్‌ అవకాశాలు సంక్లిష్టం! మరి టీమిండియా పరిస్థితి?
6 Cricketers Birthday: ఒకేరోజు పుట్టినరోజు జరుపుకొంటున్న ఆరుగురు క్రికెటర్లు.. ఆసక్తికర అంశాలు

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top