‘నేనేమీ యంత్రాన్ని కాదు.. వాళ్లు మాత్రం పట్టించుకోరు’ | Im not a machine People Not noticed: Shami On most economical spell | Sakshi
Sakshi News home page

‘నేనేమీ యంత్రాన్ని కాదు.. వాళ్లు మాత్రం పట్టించుకోరు’

Apr 6 2026 11:34 AM | Updated on Apr 6 2026 1:40 PM

Im not a machine People Not noticed: Shami On most economical spell

క్రికెట్‌లో కొనసాగాలంటే... ఆటతో సంబంధం కలిగి ఉండాల్సిందేనని టీమిండియా వెటరన్‌ బౌలర్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ అన్నాడు. శారీరకంగా ఫిట్‌గా ఉన్నప్పుడే నైపుణ్యాలను మెరుగు పరుచుకోగలమని పేర్కొన్నాడు. అందుకే తాను దేశవాళీల్లో అన్నీ మ్యాచ్‌లు ఆడుతున్నానని తెలిపాడు.

కాగా 2025 మార్చి నుంచి షమీ (Mohammed Shami) టీమిండియాకు దూరమైన సంగతి తెలిసిందే. దేశీ క్రికెట్‌లో సత్తా చాటినా సెలక్టర్లు మాత్రం అతడిని పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2026లో తనను తాను నిరూపించుకుని మరోసారి ఆటతోనే సెలక్టర్లకు సందేశం పంపాలని షమీ పట్టుదలగా ఉన్నాడు.

అత్యంత పొదుపుగా
ఇక ఈసారి లక్నో తరఫున బరిలోకి దిగిన షమీ.. తొలుత ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఒక వికెట్‌ తీయగలిగాడు. ఇక తాజాగా ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేసి లక్నో గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

కేవలం తొమ్మిది పరుగులే ఇచ్చి
సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన షమీ.. కేవలం తొమ్మిది పరుగులే ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు. సన్‌రైజర్స్‌ డేంజరస్‌ ఓపెనర్లు ట్రవిస్‌ హెడ్‌ (7), అభిషేక్‌ శర్మ (0) వికెట్లు కూల్చాడు. తద్వారా లక్నో విజయంలో ముఖ్య భూమిక పోషించిన ఈ రైటార్మ్‌ పేసర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

నేనేమీ యంత్రాన్ని కాదు
ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ టీమిండియా సెలక్టర్ల తీరును పరోక్షంగా విమర్శించాడు. ‘‘నేనేమీ యంత్రాన్ని కాదు. కెరీర్‌లో ఎత్తుపళ్లాలు సహజం. అయితే, గత కొన్నేళ్లుగా నేను బాగానే ఆడుతున్నా. అయినప్పటికీ వాళ్లు నన్ను పట్టించుకోవడం లేదు.

అది వేరే విషయం అనుకోండి. నేను మాత్రం నిరంతరం శ్రమిస్తూ మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. అభిషేక్, హెడ్‌ వంటి వాళ్లకు ఏమాత్రం అవకాశం ఇచ్చినా మ్యాచ్‌ను లాగేసుకుంటారు. అందుకే ఆ రెండు వికెట్లు ఎంతో కీలకం.  టీమిండియా తరఫున ఆడుతున్న సమయం నుంచే బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌తో చక్కటి అనుబంధం ఉంది.

స్లో బంతులతో ఫలితం 
అదే ఇప్పుడూ కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో మేం ఓడిపోయాం. అందుకే ఈ మ్యాచ్‌ కీలకమైంది. నైపుణ్యం లేకుండా ఏదీ సాధ్యం కాదు. గతంలో ఇక్కడ స్లో బంతులతో ఫలితం సాధించిన అనుభవాన్ని ఇప్పుడు ఉపయోగించా. కొత్త బంతితో బౌలింగ్‌ చేయడాన్ని ఆస్వాదిస్తా’’ అని షమీ పేర్కొన్నాడు.

కాగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో షమీ 18 డాట్‌ బాల్స్‌ వేశాడు. దీంతో అతడి ప్రదర్శనకుగానూ‘డాట్‌ బాల్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు చాముండేశ్వరీనాథ్‌ చేతుల మీదుగా షమీ ఈ పురస్కారం అందుకున్నాడు.

చదవండి: ఆర్సీబీతో మ్యాచ్‌.. ఓట‌మికి పూర్తి బాధ్యత నాదే!

Advertisement
 
Advertisement
Advertisement