వన్డే వరల్డ్‌కప్‌ ఆడటంపై కోహ్లి కీలక వ్యాఖ్యలు | If Still I have to Prove: Kohli Breaks Silence On ODI WC Participation | Sakshi
Sakshi News home page

వన్డే వరల్డ్‌కప్‌ ఆడటంపై కోహ్లి కీలక వ్యాఖ్యలు

May 15 2026 2:50 PM | Updated on May 15 2026 3:51 PM

If Still I have to Prove: Kohli Breaks Silence On ODI WC Participation

భారత బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి.. వన్డే వరల్డ్‌కప్‌-2027 టోర్నీలో ఆడతాడా? లేదా?.. చాన్నాళ్లుగా క్రికెట్‌ వర్గాల్లో ఈ చర్చ నడుస్తోంది. ‘సూపర్‌ స్టార్లు’ అయినా సరే తమను తాము ఎప్పటికప్పుడు నిరూపించుకోవాలని హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ గట్టిగానే చెబుతున్నారు.

తమ దృష్టిలో దిగ్గజాలు, యువ ఆటగాళ్లు సమానమనే సంకేతాలు ఇస్తున్నారు. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భారత్‌ను విజేతగా నిలిపిన తర్వాత కెప్టెన్‌ పదవి నుంచి రోహిత్‌ శర్మను తప్పించడం ఇందుకు నిదర్శనం. అంతేకాదు రో-కోలను మేనేజ్‌మెంట్‌ దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో తప్పక ఆడాలని ఆదేశించింది.

మౌనం వీడిన కోహ్లి
ఈ ఇద్దరూ అక్కడా సత్తా చాటి తమను తాము నిరూపించుకున్నారు. అయినప్పటికీ వయసు రిత్యా రో-కోను వరల్డ్‌కప్‌ ఆడిస్తారా? లేదా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో విరాట్‌ కోహ్లి (Virat Kohli) తన భవిష్యత్తుపై మౌనం వీడాడు.

వన్డే వరల్డ్‌కప్‌-2027లో ఆడతారా? లేదా? అన్న అంశంపై స్పందిస్తూ.. ‘‘నా దృష్టి కోణం ఒక్కటే. నా జట్టు విలువ పెంచేలా నా శాయశక్తులా కృషి చేస్తా. అక్కడున్న వాళ్లు కూడా నా వల్ల జట్టుకు మేలు చేకూరుతుందని భావించాలి. అప్పుడే నేను జట్టులో ఉంటాను.

పదే పదే నిరూపించుకోవాలనే ఒత్తిడి వస్తే..
అయితే, పదే పదే నన్ను నేను నిరూపించుకోవాలనే ఒత్తిడి వస్తే.. అక్కడ నాకు స్థానం ఉండదని పరోక్షంగా నాకు నేను చెబుతున్నట్లు అర్థం. ఏదేమైనా నిజాయితీగా ఆట కోసం సన్నద్ధం కావడం అత్యంత ముఖ్యం. బ్యాటింగ్‌ చేయడానికి వెళ్లే ముందు ప్రతిసారి నా తల వంచుకుని.. కొత్తగా మైదానంలోకి దిగినట్లే వెళ్తాను.

నా క్రికెట్‌ కెరీర్‌లో దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. అందుకు నేను కృతజ్ఞుడిని. కఠినంగా శ్రమించడమే నాకు తెలుసు. సరైన రీతిలో ఆడటమే నా లక్ష్యం. అలాగే ఆడతాను కూడా. వన్డే మ్యాచ్‌లో నలభై ఓవర్ల పాటు.. వికెట్ల మధ్య పరుగులు తీయాల్సి వస్తే నేను కచ్చితంగా ఆ పనిని పూర్తి చేస్తా.

ప్రతి బాల్‌ నా కెరీర్‌లో ఆఖరిది అనే  ఆలోచనతోనే
నాకెలాంటి ఫిర్యాదులూ ఉండవు. ఎందుకంటే.. మ్యాచ్‌లో ఊహించని పరిస్థితులు ఎదురైనా.. అందుకు తగ్గట్లుగా జట్టు కోసం ఉపయోగపడేలా ముందే నేను సన్నద్ధమవుతా. మ్యాచ్‌లో ఎదుర్కొనే ప్రతి బాల్‌ నా కెరీర్‌లో ఆఖరి బంతి అనే  ఆలోచనతోనే సిద్ధమవుతా.

వికెట్ల మధ్య అలుపు లేకుండా పరిగెడతా. ఇంత చేసినా నా విలువ, స్థాయి ఏమిటో నిరూపించుకోవాలని అంటున్నారంటే.. అక్కడ నా అవసరం లేదు అని అర్థం. నాకు అది అక్కర్లేదు కూడా!’’ అని కోహ్లి నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. 

ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో కోహ్లి చేసిన ఈ కామెంట్లు వైరల్‌ అవుతున్నాయి. గంభీర్‌, అగార్కర్‌ వైఖరి నచ్చకే అతడు ఈ విధంగా స్పందించాడని అభిమానులు అంటున్నారు.

కాగా 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రో-కో.. గతేడాది అనూహ్యంగా టెస్టులకూ గుడ్‌బై చెప్పారు. ఇప్పుడు ఇద్దరూ వన్డేలతో పాటు ఐపీఎల్‌లో కొనసాగుతున్నారు. ఆర్సీబీ తరఫున కోహ్లి ఐపీఎల్‌-2026 సీజన్‌లో ఇప్పటికి 12 మ్యాచ్‌లు ఆడి 484 పరుగులు సాధించాడు.

చదవండి: రాహుల్‌ ద్రవిడ్‌ సంచలన వ్యాఖ్యలు!

Advertisement
 
Advertisement
Advertisement