పాక్‌ను చిత్తుగా ఓడించిన బంగ్లా ప్లేయర్లకు భారీ లబ్ది | ICC Rewards Bangladesh Players After Thrashing Pakistan In Mirpur Test | Sakshi
Sakshi News home page

పాక్‌ను చిత్తుగా ఓడించిన బంగ్లా ప్లేయర్లకు భారీ లబ్ది

May 13 2026 3:36 PM | Updated on May 13 2026 3:52 PM

ICC Rewards Bangladesh Players After Thrashing Pakistan In Mirpur Test

పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ఐసీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. మిర్పూర్ టెస్టులో 104 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసిన తర్వాత విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బంగ్లా ప్లేయర్లు భారీగా లాభపడ్డారు. ముఖ్యంగా కెప్టెన్ నజ్ముల్‌ హసన్‌ షాంటో కెరీర్ బెస్ట్ రేటింగ్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో షాంటో విశేషంగా రాణించాడు.

తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (101), రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీ (87) (మొత్తం 188 పరుగులు) చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇందుకు ప్రతిఫలంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అతడు.. ర్యాంకింగ్స్‌లో ఏకంగా 16 స్థానాలు ఎగబాకి 23వ స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఇదే స్థానంలో పాక్‌ స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌ కూడా కొనసాగుతున్నాడు.

ఇదే మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ తీసి జట్టు విజయంలో మరో కీలక పాత్రధారుడిగా నిలిచిన నహిద్‌ రాణా కూడా ర్యాంకింగ్స్‌లో భారీ జంప్ కొట్టాడు. ఒకేసారి ఐదు స్థానాలు ఎగబాకి 64వ స్థానానికి చేరుకున్నాడు.

ఇదే మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 91, రెండో ఇన్నింగ్స్‌లో 56 పరుగులు చేసిన మొమినుల్‌ హ‍క్‌ 12 స్థానాలు ఎగబాకి 35వ ర్యాంక్‌కి చేరుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 71, రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులు చేసిన ముష్ఫికర్‌ రహీం రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 26వ ర్యాంక్‌లో నిలిచాడు.

నాలుగు వికెట్లతో సత్తా చాటిన తైజుల్‌ ఇస్లాం మూడు స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్ చేరుకోగా, తస్కిన్‌ అహ్మద్‌ 48వ స్థానంలో నిలిచాడు.

ఇక పాకిస్తాన్‌ ఆటగాళ్లకు మాత్రం ఈ టెస్ట్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. సౌద్‌ షకీల్‌, షాన్‌ మసూద్‌ ఇద్దరూ ఆరు స్థానాలు దిగజారారు. ఐదు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటిన మొహమ్మద్‌ అబ్బాస్‌ మాత్రం 28వ స్థానానికి ఎగబాకి కొంత ఊరటనిచ్చాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement