ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన రవీంద్ర జడేజా, షకీబ్‌

ICC Announced Test All Rounder Rankings Ravindra Jadeja Gains 2nd Rank - Sakshi

దుబాయ్‌: టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా టెస్టు ఆల్‌రౌండర్‌ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టగా.. బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ ఆల్‌ హసన్‌ టీ 20 ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపాడు. ముందుగా జడేజా విషయానికి వస్తే.. బుధవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆల్‌రౌండర్‌ విభాగంలో జడేజా(377 పాయింట్లు) రెండో స్థానానికి చేరుకున్నాడు. రెండో స్థానంలో ఉన్న బెన్‌స్టోక్స్‌(370)ను ఏడు పాయింట్లతో అధిగమించాడు.

ఇంగ్లండ్‌తో ముగిసిన తొలి టెస్టులో జడేజా తొలి ఇన్నింగ్స్‌లో అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కడంలో కీలక పాత్ర పోషించిన జడేజా నెంబర్‌ వన్‌ స్థానానికి మరింత చేరువయ్యాడు. ఇక విండీస్‌ ఆల్‌రౌండర్‌ జాసన్‌ హోల్డర్‌ 384 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్‌తో మరో నాలుగు టెస్టులు మిగిలి ఉండడంతో జడేజా మంచి ప్రదర్శన కనబరిస్తే త్వరలోనే నెంబర్‌వన్‌ ర్యాంక్‌కు చేరుకునే అవకాశం ఉంది. ఇక టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో కేన్‌ విలియమ్సన్‌(901), స్టీవ్‌ స్మిత్‌(891), మార్నస్‌ లబుషేన్‌(878) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ 846 పాయింట్లతో నాలుగో స్థానం.. 791 పాయింట్లతో కోహ్లి ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలింగ్‌ విభాగంలో పాట్‌ కమిన్స్‌(908) తొలిస్థానం, రవిచంద్రన్‌ అశ్విన్‌(856) రెండో స్థానంలో ఉన్నాడు.

ఇక ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 సిరీస్‌లో షకీబ్‌ ఆల్‌ హసన్‌ దుమ్మురేపాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచిన షకీబ్‌ ఆసీస్‌తో జరిగిన చివరి టీ20లో నాలుగు వికెట్లతో కెరీర్‌ బెస్ట్‌ నమోదు చేశాడు. 286 పాయింట్లతో షకీబ్‌ టాప్‌లో ఉండగా.. ఒక పాయింట్‌ తేడాతో మహ్మద్‌ నబీ (285) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. టీ 20 బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో తబ్రెయిజ్‌ షంసీ 792 పాయింట్లతో తొలి స్థానం.. వహిందు హసరంగ 764 పాయింట్లతో రెండో స్థానం.. 719 పాయింట్లతో రషీద్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో 841 పాయింట్లతో డేవిడ్‌ మలాన్‌ తొలి స్థానం.. 819 పాయింట్లతో బాబర్‌ అజమ్‌ రెండో స్థానంలో ఉన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top