గిల్‌ సూపర్‌ టాలెంట్‌.. దిగ్గజ ఆటగాడిగా ఎదుగుతాడు | 'He's A Super Talent': Nasser Hussain Picks Indian batter As A Future Legend - Sakshi
Sakshi News home page

Future Legend: గిల్‌ సూపర్‌ టాలెంట్‌.. దిగ్గజ ఆటగాడిగా ఎదుగుతాడు! రచిన్‌ సైతం...

Published Sat, Dec 30 2023 4:57 PM

He Is Super Talent: Nasser Hussain Picks Indian batter As Future Legend - Sakshi

He’s a super talent: టీమిండియా యువ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌పై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుసేన్‌ ప్రశంసలు కురిపించాడు. మెన్స్‌ క్రికెట్‌లో అతడు దిగ్గజ ఆటగాడిగా ఎదుగుతాడని అంచనా వేశాడు. ఈ ఏడాది గిల్‌ అత్యుత్తమంగా రాణించాడంటూ అతడిని ‘‘సూపర్‌ టాలెంట్‌’’గా అభివర్ణించాడు.

అత్యధిక పరుగుల వీరుడు
కాగా అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఈ ఏడాది అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. 2023లో మొత్తంగా 29 వన్డేలు ఆడిన 24 ఏళ్ల ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌.. సగటు 63.36తో 1584 పరుగులు సాధించాడు. ఇందులో ఓ డబుల్‌ సెంచరీ కూడా ఉండటం విశేషం.

హైదరాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్‌.. 149 బంతుల్లోనే 208 పరుగులు రాబట్టి సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అంతేకాదు.. టీ20, టెస్టు ఫార్మాట్లోనూ ఒక్కో శతకం బాది సత్తా చాటాడు. 

అద్భుత నైపుణ్యాలు... తనకు తానే సాటి
ఈ నేపథ్యంలో రాబోయే తరం క్రికెట్‌ సూపర్‌స్టార్ల గురించి ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ నాసిర్‌ హుసేన్‌.. శుబ్‌మన్‌ గిల్‌ పేరును ప్రస్తావించాడు. ‘‘మెన్స్‌ క్రికెట్‌ నెక్ట్స్ సూపర్‌స్టార్‌ ఎవరంటే నేను శుబ్‌మన్‌ గిల్‌ పేరు చెబుతాను. 2023లో అతడు అత్యుత్తమంగా ఆడాడు. 

మరో ఎండ్‌ నుంచి తనకు సహకారం అందించే రోహిత్‌ శర్మ వంటి సీనియర్ల నుంచి అతడు చాలా విషయాలు నేర్చుకుని ఉంటాడు. గిల్‌ అద్భుత నైపుణ్యాలు కలిగిన ఆటగాడు.

టీమిండియా తరఫున రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన ప్రదర్శనలు ఇవ్వగలడు. 2024లోనూ అతడి ఫామ్‌ ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నా’’ అని నాసిర్‌ హుసేన్‌ శుబ్‌మన్‌ గిల్ను కొనియాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. 

రచిన్‌ రవీంద్ర జోరు కొనసాగాలి
ఇక ఈ ఏడాది గిల్‌తో పాటు న్యూజిలాండ్‌ యువ ఆల్‌రౌండర్‌ రచిన్‌ రవీంద్ర కూడా తనను బాగా ఆకట్టుకున్నాడని నాసిర్‌ హుసేన్‌ తెలిపాడు. అతడి జోరు వచ్చే సంవత్సరం కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించాడు.

కాగా రచిన్‌ రవీంద్ర వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఏకంగా మూడు శతకాలు బాదిన విషయం తెలిసిందే. పది ఇన్నింగ్స్‌లో కలిపి 578 పరుగులు రాబట్టాడు రచిన్‌. 

చదవండి: IND Vs SA: వాళ్లిద్దరిని ఎంపిక చేయకుండా పెద్ద తప్పు చేశారు: భజ్జీ

Advertisement
Advertisement