PAK Vs ENG: ఇంగ్లండ్ బ్యాటర్స్ విధ్వంసం.. మూడో టి20లో ఘన విజయం

కరాచీ వేదికగా శుక్రవారం పాకిస్తాన్‌తో జరిగిన మూడో టి20లో ఇంగ్లండ్ 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఏడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోరు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్స్ బెన్ డకెట్(42 బంతుల్లో 70 నాటౌట్), హ్యారీ బ్రూక్(35 బంతుల్లో 81 పరుగులు నాటౌట్) విధ్వంసం సృష్టించడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. విల్ జాక్స్ 40 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో ఉస్మాన్ ఖాదీర్ రెండు వికెట్లు తీయగా.. హస్నైన్ ఒక వికెట్ పడగొట్టాడు.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు రిజ్వాన్, బాబర్ ఆజంలు తక్కువ స్కోర్లకే వెనుదిరగడం జట్టుపై ప్రభావం చూపించింది. షాన్ మసూద్ 40 బంతుల్లో 66 పరుగులు నాటౌట్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కుష్‌దిల్ షా 29 పరుగులు చేయగా.. మిగతావారు విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3, ఆదిల్ రషీద్ 2, రీస్ టోప్లీ, సామ్ కరన్‌లు చెరొక వికెట్ తీశారు. ఇక ఇరుజట్ల మధ్య నాలుగో టి20 మ్యాచ్ ఆదివారం(సెప్టెంబర్ 25న) జరగనుంది.
చదవండి: 'నేనే సర్‌ప్రైజ్ అయ్యా; అందుకే డీకే.. పంత్ కంటే ముందుగా'
మరిన్ని వార్తలు