IND vs Aus: ఓడిపోయే మ్యాచ్‌ గెలిచాం.. వారిద్దరి వల్లే ఇదంతా! చాలా గర్వంగా ఉంది

Hardik Pandya Speaks On The Hard Fought Win Over Australia In The 1st odi - Sakshi

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా బోణీ కొట్టింది. ముంబై వాంఖడే వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత విజయంలో కేఎల్‌ రాహుల్‌(75), రవీంద్ర జడేజా(45) కీలక పాత్ర పోషించాడు. 189 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. కేవలం 39 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ సమయంలో రాహుల్.. కెప్టెన్ హార్దిక్ పాండ్య సాయంతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. అయితే 25 పరుగులు చేసిన హార్దిక్‌ను స్టోయినిస్‌ ఓ అద్భుతమైన బంతితో పెవిలియన్‌కు పంపాడు. దీంతో వీరిద్దరి  భాగస్వామ్యానికి తెరపడింది. ఈ క్రమంలో 84 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి మరింత ఇబ్బందుల్లో భారత జట్టు పడింది.

ఇటువంటి సమయంలో క్రీజులోకి వచ్చిన జడేజాతో కలసి రాహుల్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్‌ బోర్డ్‌ వేగాన్ని పెంచారు. ఆఖరికి మరో వికెట్‌ కోల్పోకుండా టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఇక ఈ విజయంపై మ్యాచ్‌ అనంతరం టీమిండియా స్టాండ్‌ ఇన్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా స్పందించాడు.

ఓడిపోయే మ్యాచ్‌ గెలిచాం.. వారిద్దరి వాళ్లే ఇదంతా!
"మేము బౌలింగ్‌, బ్యాటింగ్‌ రెండింటిలోనూ తీవ్ర ఒత్తిడికి గురయ్యాము. ముఖ్యంగా బ్యాటింగ్‌లో క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడి మ్యాచ్‌లో నిలిచేందుకు మార్గాలను కనుగొన్నాం. ఎప్పుడైతే మ్యాచ్‌ మా వైపు మలుపు తిరిగిందో.. ప్రత్యర్ధికి మరో అవకాశం ఇవ్వకుండా మా బాయ్స్‌ మ్యాచ్‌ను ఫినిష్‌ చేశారు. ఈ మ్యాచ్‌లో మా జట్టు ఆట తీరు పట్ల నేను నిజంగా గర్విస్తున్నాను.

ఫీల్డ్‌లో కూడా అద్భుతంగా రాణించారు. జడ్డూ, గిల్‌ అయితే సూపర్‌ క్యాచ్‌లు అందుకున్నారు. ముఖ్యంగా లబుషేన్ ఇచ్చిన క్యాచ్‌ను రవీంద్ర జడేజా పట్టిన తీరు ఎంత చెప్పుకున్న తక్కువే. అయితే వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ఈ మ్యాచ్‌లో మేము విజయం సాధిస్తామని నేను అనుకోలేదు. ఇటువంటి సమయంలో రాహుల్‌, జడేజా ఆసాధారణ ప్రదర్శన కనబరిచారు. వారి పోరాట పటిమ మాలో ఆత్మ విశ్వాసం పెంపొందించింది.. జడ్డూ అయితే రీ ఎంట్రీ మ్యాచ్‌లోనే అదరగొట్టాడు" అని హార్దిక్‌ మ్యాచ్‌ అనంతరం పేర్కొన్నాడు.
చదవండి: KL Rahul: రాహుల్‌ అద్భుత ఇన్నింగ్స్‌.. కారణమిదే అంటున్న ఫ్యాన్స్‌! కోహ్లి కూడా..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top