వైరల్‌ : క్రికెటర్ల బిల్లు చెల్లించిన అభిమాని

Fan Claims To Pay Restaurant Bill Of Team India Players In Melbourne - Sakshi

మెల్‌బోర్న్‌ : భారత్‌లో క్రికెట్‌ను అభిమానులు ఒక మతంలా చూస్తారు. ఇక టీమిండియా ఆటగాళ్లను ఎంతలా ఆరాధిస్తారనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలో వాళ్ల ఆటను ప్ర‌త్య‌క్షంగా చూడాల‌ని అభిమానులు క‌ల‌లు కంటారు. అలాంటిది వాళ్లు నేరుగా క‌ళ్ల ముందే ప్ర‌త్య‌క్ష‌మైతే ఆ అనుభవం ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. తాజాగా  మెల్‌బోర్న్‌లో ఒక ఇండియ‌న్ అభిమానికి అచ్చం అలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది.

బాక్సింగ్ డే టెస్ట్‌ విజయంతో కాస్త రిలాక్స్‌ మోడ్‌లో ఉన్న టీమిండియా క్రికెటర్లు రోహిత్ శ‌ర్మ‌, రిష‌బ్ పంత్‌, శుభ్‌మ‌న్ గిల్, న‌వ్‌దీప్ సైనీ న్యూ ఇయర్‌ సందర్భంగా మెల్‌బోర్న్‌లోని ఒక రెస్టారెంట్‌కు వెళ్లారు. తమకు నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్‌ చేసుకొని తింటున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న నవల్‌దీప్‌ సింగ్‌ టీమిండియా క్రికెటర్లు కూర్చున్న టేబుల్‌కు ఎదురుగా కూర్చున్నాడు. క్రికెటర్లను చూసి మురిసిపోయిన నవల్‌దీప్‌ సింగ్‌ ఆటగాళ్లు భోజనం చేస్తున్న సమయంలో వీడియో తీశాడు. ఈ సందర్భంగా వాళ్లకు ఏదైనా సర్‌ప్రైజ్‌ ఇచ్చి తన అభిమానాన్ని చాటుకోవాలని భావించాడు.(చదవండి: రోహిత్ శర్మకు ప్రమోషన్‌)


క్రికెటర్ల భోజనం పూర్తయిందనుకున్న సమయంలో.. నవల్‌దీప్ సింగ్ నేరుగా కౌంటర్ వద్దకు వెళ్లి క్రికెటర్లకు తెలియకుండా 118 ఆస్ట్రేలియన్‌ డాలర్లు( రూ. 6700) బిల్లు కట్టాడు. అయితే బిల్లు చెల్లించడానికి కౌంటర్ వద్దకు వచ్చిన క్రికెటర్లకు మీ బిల్లును ఆ వ్యక్తి కట్టాడంటూ నవల్‌దీప్ సింగ్ వైపు చూపించారు  దీంతో రోహిత్ శర్మ, పంత్‌లు నవల్‌దీప్‌ వద్దకు వచ్చి డబ్బు ఇవ్వబోయారు. అయితే నవల్‌దీప్‌ అందుకు అభ్యంతరం చెప్పి డబ్బు తీసుకోలేదు.

'మీ మీద ఉన్న అభిమానంతోనే బిల్లు చెల్లించానని.. మిమ్మల్ని ఇంత దగ్గర్నుంచి చూడడం సంతోషం కలిగించిదని' చెప్పాడు. అనంతరం తన అభిమాన క్రికెటర్లతో సెల్ఫీ దిగిన నవల్‌దీప్‌ను ఈ విషయాన్ని తన ట్విటర్‌లో పంచుకున్నాడు. 'లంచ్ స్పాన్సర్ చేసినందుకు రోహిత్‌, పంత్‌ సహా అందరూ థ్యాంక్స్ చెప్పారు. అనంతరం పంత్‌ నా భార్య దగ్గరకు వచ్చి మెల్‌బోర్న్‌లో మాకు మంచి లంచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చినందుకు థ్యాంక్స్‌ బాబీ అని చెప్పాడు. నా సూపర్‌స్టార్స్‌ కోసం చేసిన ఈ చిన్న పని నాకు సంతోషాన్ని కలిగించిందంటూ' ట్విటర్‌లో చెప్పుకొచ్చాడు.  తాజాగా ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి : 8 ఏళ్ల తర్వాత కూడా అదే తీరు)

ఇక నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జనవరి 7 నుంచి మూడో టెస్టు జరగనుంది. మాయాంక్‌ స్థానంలో రోహిత్‌ శర్మ చేరికతో టీమిండియా బ్యాటింగ్‌ విభాగం మరింత బలోపేతం కాగా.. మూడో టెస్టుకు విహారి స్థానంలో కేఎల్‌ రాహుల్‌ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.  మెల్‌బోర్న్‌ టెస్టులో గాయపడిన ఉమేశ్‌ యాదవ్‌ స్థానంలో టి. నటరాజన్‌ను ఎంపిక చేశారు. కాగా ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top