పాకిస్తాన్ సూపర్‌లీగ్ (పీఎస్ఎల్) 2026 సీజన్ విజేతగా బాబర్ ఆజం సారథ్యంలోని పెషావర్ జాల్మి నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ కింగ్స్‌మెన్‌ను ఓడించిన పెషావర్ జాల్మి టైటిల్ గెలిచింది. ఈ సీజన్‌లో బాబర్ టాప్ స్కోరర్‌గా నిలిచి ‘బ్యాటర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డుతో పాటు హనీఫ్ మొహమ్మద్ క్యాప్ అందుకున్నాడు.
ఈ నేపథ్యంలో అవార్డుతో పాటు ఆయన అందుకున్న బహుమతి విలువ కేవలం పీకేఆర్ 3,500 మాత్రమే అని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.1200 మాత్రమే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేశారు.
‘ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నందునే పీఎస్‌ఎల్ నిర్వాహకులు ఆటగాళ్లకు తక్కువ ప్రైజ్‌మనీ అందించింది’.. ‘పాపం పీసీబీ దగ్గర డబ్బులేవనుకుంటా.. అందుకే ఇంత తక్కువ ప్రైజ్‌మనీ ఇస్తున్నట్లున్నారు’ అని కామెంట్లు చేశారు. అయితే నిజానికి బాబర్ ఆజం అందుకున్న బహుమతి విలువలో అంకెల సంఖ్యను సోషల్ మీడియాలో తప్పుగా చూపించినట్లు పీఎస్‌ఎల్ నిర్వాహకులు తెలిపారు.
‘బ్యాటర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు కింద బాబర్ ఆజం పీకేఆర్ 3,500,000 ఇచ్చినట్లు తెలుస్తోంది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు 11,90, 790 రూపాయలు. ఇక టీ20 ప్రపంచకప్‌లో విఫలమైన బాబర్ ఆజం పీఎస్‌ఎల్ 2026 సీజన్‌లో మాత్రం సూపర్ హిట్ అయ్యాడు. 11 ఇన్నింగ్స్‌లు కలిపి 588 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు ఉండడం విశేషం.
అయితే కీలకమైన ఫైనల్లో బాబర్ ఆజం తొలి బంతికే ఔటైనప్పటికీ, ఓవరాల్‌గా ఒక పీఎస్‌ఎల్ సీజన్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. పీఎస్‌ఎల్ ముగిసిన మరుక్షణమే బాబర్ ఆజం టెస్టు సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ చేరుకున్నాడు. మీర్పూర్ వేదికగా మే 8 నుంచి 12 వరకు తొలి టెస్టు, మే 16 నుంచి 20 వరకు రెండో టెస్టు జరగనుంది.


