
యశస్వి జైస్వాల్ , పంత్ , సాయి సుదర్శన్
తొలి సెషన్‌లో ఒక్క వికెట్ కోల్పోకుండా ఓపెనర్ల పట్టుదల... ఆపై తక్కువ వ్యవధిలో మూడు వికెట్లు... కీలక సమయంలో రిషభ్ పంత్‌కు గాయం... చివరకు సంతృప్తిగా ముగింపు! మాంచెస్టర్ టెస్టులో భారత జట్టు పరిస్థితి ఇది. టాస్ ఓడినా సానుకూల ఆటతో భారత బ్యాటింగ్ కొనసాగింది. యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ అర్ధ సెంచరీలతో ఆకట్టుకోగా, ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ బంతితో రాణించాడు. ఇంకా లోతైన బ్యాటింగ్ ఉండటంతో రెండో రోజు టీమిండియా ఎంత భారీ స్కోరు నమోదు చేస్తుందనేది చూడాలి.
మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టును భారత్ ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. బుధవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (151 బంతుల్లో 61; 7 ఫోర్లు), యశస్వి జైస్వాల్ (107 బంతుల్లో 58; 10 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. రిషభ్ పంత్ (48 బంతుల్లో 37 రిటైర్డ్‌హర్ట్; 2 ఫోర్లు, 1 సిక్స్) గాయంతో మైదానం వీడాడు.
ప్రస్తుతం రవీంద్ర జడేజా (19 బ్యాటింగ్), శార్దుల్ ఠాకూర్ (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానం చరిత్రలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జట్టు ఒక్కసారి కూడా మ్యాచ్ గెలవలేదు. అయినా సరే, స్టోక్స్ మరోసారి టాస్ గెలిచి అలాంటి సాహసం చేశాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ నాలుగు టాస్‌లూ గెలవగా... అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ వరుసగా 14 టాస్‌లు ఓడిపోయింది!
ఓపెనర్ల శుభారంభం...
భారత్‌కు మరోసారి ఓపెనర్లు జైస్వాల్, కేఎల్ రాహుల్ (98 బంతుల్లో 46; 4 ఫోర్లు) మెరుగైన ఆరంభాన్ని అందించారు. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరు చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. లంచ్ సమయానికి జట్టు వికెట్ నష్టపోకుండా 78 పరుగులు చేసింది. అయితే రెండో సెషన్‌లో పరిస్థితి మారింది. తక్కువ వ్యవధిలో పదునైన బంతితో రాహుల్‌ను అవుట్ చేసి వోక్స్ జట్టుకు తొలి వికెట్ అందించాడు.
96 బంతుల్లో అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్న తర్వాత డాసన్ బౌలింగ్‌లో జైస్వాల్ వెనుదిరగ్గా... గత టెస్టు వైఫల్యాన్ని శుబ్‌మన్ గిల్ (12) ఇక్కడా కొనసాగించాడు. స్టోక్స్ బంతిని ఆడకుండా వదిలేసిన గిల్ రివ్యూ కోరినా లాభం లేకపోయింది. అంతకుముందు భారత్ కొన్ని ఉత్కంఠ క్షణాలను ఎదుర్కొంది. స్టోక్స్ బౌలింగ్‌లో 20 పరుగుల వద్ద సుదర్శన్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను కీపర్ స్మిత్ వదిలేయడం కాస్త కలిసొచ్చింది.
కీలక భాగస్వామ్యం...
టీ విరామం తర్వాత సుదర్శన్, పంత్ చక్కటి సమన్వయంతో ఇన్నింగ్స్‌ను నడిపించారు. సుదర్శన్ ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయగా, పంత్ కూడా సంయమనం ప్రదర్శిస్తూ పరుగులు రాబట్టాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 72 పరుగులు జోడించిన తర్వాత గాయంతో పంత్ తప్పుకోవాల్సి వచ్చింది. 134 బంతుల్లో కెరీర్‌లో తొలి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం సుదర్శన్‌ను స్టోక్స్ వెనక్కి పంపాడు.
ఈ దశలో జడేజా, శార్దుల్ కలిసి జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరు 55 బంతుల్లో అభేద్యంగా 29 పరుగులు జత చేసి తొలి రోజును ముగించారు. చివర్లో వెలుతురు మందగించడంతో అంపైర్ల సూచనతో ఇంగ్లండ్ స్పిన్ బౌలింగ్‌కే పరిమితమైంది. దాంతో 80 ఓవర్ల తర్వాత కూడా జట్టు కొత్త బంతి తీసుకునే ప్రయత్నం చేయలేదు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) బ్రూక్ (బి) డాసన్ 58; రాహుల్ (సి) క్రాలీ (బి) వోక్స్ 46; సుదర్శన్ (సి) కార్స్ (బి) స్టోక్స్ 61; గిల్ (ఎల్బీ) (బి) స్టోక్స్ 12; పంత్ (రిటైర్డ్‌హర్ట్) 37; జడేజా (బ్యాటింగ్) 19; శార్దుల్ (బ్యాటింగ్) 19; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (83 ఓవర్లలో 4 వికెట్లకు) 264. వికెట్ల పతనం: 1–94, 2–120, 3–140, 3–212 (రిటైర్డ్ నాటౌట్), 4–235. బౌలింగ్: వోక్స్ 17–4–43–1, ఆర్చర్ 16–2–44–0, కార్స్ 16–1–60–0, స్టోక్స్ 14–2–47–2, డాసన్ 15–1–45–1, రూట్ 5–0–19–0.
అన్షుల్ కంబోజ్ @ 318
పేస్ బౌలర్ అన్షుల్ కంబోజ్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన 318వ ఆటగాడిగా అతను నిలిచాడు. హరియాణాకు చెందిన 24 ఏళ్ల అన్షుల్ 24 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 22.88 సగటుతో 79 వికెట్లు పడగొట్టాడు.
లార్డ్స్ టెస్టులో ఆడిన జట్టు నుంచి మూడు మార్పులతో భారత్ బరిలోకి దిగింది. గాయాలతో దూరమైన నితీశ్, ఆకాశ్‌దీప్‌కు బదులుగా అన్షుల్, శార్దుల్‌లను ఎంపిక చేయగా...కరుణ్ నాయర్‌ను తప్పించి సాయి సుదర్శన్‌కు అవకాశం కల్పించారు.
రిషభ్ పంత్‌కు గాయం!
భారత్‌ను ఈ టెస్టులో ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉన్న ఘటన తొలి రోజే చోటు చేసుకుంది. వికెట్ కీపర్ రిషభ్ పంత్ బ్యాటింగ్ చేస్తూ గాయపడి రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. వోక్స్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ ఆడబోగా బంతి నేరుగా అతని కుడి పాదంపై పడింది. ఎల్బీడబ్ల్యూ అప్పీల్‌కు అంపైర్ స్పందించకపోవడంతో ఇంగ్లండ్ రివ్యూ కోరింది. బంతి కాలికి తగిలే ముందే బ్యాట్‌ను తాకుతూ వెళ్లడంతో అతను నాటౌట్‌గా తేలాడు.
అయితే బంతి బలంగా తాకడంతో పంత్ తీవ్ర నొప్పితో విలవిల్లాడాడు. సహచరుల అండతో ఒంటికాలిపై అడుగు వేయాల్సి వచ్చింది. చివరకు కార్ట్‌లో అతడిని మైదానం బయటకు తీసుకెళ్లారు. గాయం తీవ్రత ఎలాంటిదనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆ తర్వాత ఈ టెస్టులో అతని పరిస్థితి ఏమిటనేది తేలుతుంది.