
ఇంగ్లండ్‌పై చారిత్రక గెలుపు సాధించేందుకు 7 వికెట్ల దూరంలో టీమిండియాకు చేదు వార్త. రెండో టెస్ట్ చివరి రోజు ఆట ప్రారంభానికి ముందు ఎడ్జ్‌బాస్టన్‌లో భారీ వర్షం కురుస్తుంది. స్టేడియం మొత్తాన్ని కవర్లతో కప్పేశారు. అక్కడ వాతావరణం రాత్రిని తలపిస్తుంది. ఫ్లడ్ లైట్లు ఆన్ చేశారు. భారతకాలమానం ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితిలో ఇది సాధ్యపడేలా లేదు.
మరో గంట పాటు వర్షం ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ నివేదించింది. అయితే మధ్యాహ్నం సమయంలో వర్షం ఉండకపోవచ్చని తెలుస్తుంది. వర్షం కారణంగా తొలి సెషన్ రద్దైతే టీమిండియాకు భారీ నష్టం సంభవిస్తుంది. మిగతా రెండు సెషన్లలో భారత బౌలర్లు ఏడు వికెట్లు తీయాల్సి ఉంటుంది. ఇది అంత ఈజీ కాదు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
HEAVY RAIN AT EDGBASTON...!!!! [Amit Shah from RevSportz] pic.twitter.com/zdrYfwj3ri
— Johns. (@CricCrazyJohns) July 6, 2025
కాగా, ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారత్ నిర్దేశించిన 608 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. భారత్ విజయానికి ఇంకా 7 వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ గెలుపునకు 536 పరుగులు కావాలి.
నాలుగో రోజు ఆటలో టీమిండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (162 బాల్స్‌లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా (69 నాటౌట్), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు.
గిల్‌పై విమర్శలు
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సెకెండ్ ఇన్నింగ్స్‌ను లేట్‌గా డిక్లేర్ చేయడాన్ని చాలా మంది క్రికెట్ నిపుణులు తప్పుబడుతున్నారు. కాస్త ముందుగానే ఇంగ్లండ్‌కు బ్యాటింగ్ చేసే అవకాశాన్ని ఇచ్చి ఉంటే మరిన్ని వికెట్లు పడివుండేవని అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు టీమిండియా ఎడ్జ్‌బాస్టన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ మ్యాచ్‌లో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా ఆటగాళ్లు ఆరాటపడుతున్నారు.
స్కోర్ వివరాలు..
భారత్ 587 & 427/6 డిక్లేర్
ఇంగ్లండ్ 407 & 72/3 (16) ప్రస్తుత రన్‌రేట్: 4.5