French Open 2021: స్వితోలినా ఇంటిముఖం

Elina Svitolina becomes seventh top-10 women seed to exit Roland Garros - Sakshi

మూడో రౌండ్‌లోనే ఓడిన ఐదో సీడ్‌

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో డిఫెండింగ్‌

పియన్‌ స్వియాటెక్‌

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో టాప్‌–10 సీడెడ్‌ క్రీడాకారిణుల పరాజయపర్వం కొనసాగుతోంది. ఇప్పటికే టాప్‌–10లోని ఆరుగురు క్రీడాకారిణులు ఇంటిదారి పట్టగా... వారి సరసన తాజాగా ఐదో సీడ్‌ ప్లేయర్‌ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్‌) చేరింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌ మ్యాచ్‌లో ప్రపంచ 33వ ర్యాంకర్‌ బర్బొరా క్రిచికోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6–3, 6–2తో స్వితోలినాను ఓడించి వరుసగా రెండో ఏడాది ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. గంటా 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో క్రిచికోవా నెట్‌వద్దకు 18 సార్లు దూసుకొచ్చి 14 సార్లు పాయింట్లు సాధించగా... స్వితోలినా సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేసింది.

మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌) 7–6 (7/4), 6–0తో కొంటావీట్‌ (ఎస్తోనియా)పై, నాలుగో సీడ్‌ సోఫియా (అమెరికా) 4–6, 6–4, 6–1తో పెగూలా (అమెరికా)పై, స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా) 6–3, 7–5తో 18వ సీడ్‌ ముకోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై, 17వ సీడ్‌ సాకరి (గ్రీస్‌) 7–5, 6–7 (2/7), 6–2తో 14వ సీడ్‌ మెర్‌టెన్స్‌ (బెల్జియం) నెగ్గి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి చేరారు.  

వరుసగా 12వ ఏడాది...
పురుషుల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ (సెర్బియా) వరుసగా 12వ ఏడాది ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన మూడో రౌండ్‌లో టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ 6–1, 6–4, 6–1తో బెరాన్‌కిస్‌ (లిథువేనియా)పై గెలిచాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌), ఐదో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌), పదో సీడ్‌ ష్వార్ట్‌జ్‌మన్‌ (అర్జెంటీనా) కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరారు. మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో నాదల్‌ 6–3, 6–3, 6–3తో కామరూన్‌ నోరి (బ్రిటన్‌)పై, సిట్సిపాస్‌ 5–7, 6–3, 7–6 (7/3), 6–1తో ఇస్నెర్‌ (అమెరికా)పై, ష్వార్ట్‌జ్‌మన్‌ 6–4, 6–2, 6–1తో ఫిలిప్‌ కోల్‌ష్రైబర్‌ (జర్మనీ)పై విజయం సాధించారు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top